Puri Jagannadh Open Letter: ఆడియెన్స్‌ను తప్ప ఎవరిని మోసం చేయలేదు - పూరి ఓపెన్ లెటర్ వైరల్
30 October 2022, 11:21 IST
Puri Jagannadh Open Letter: లైఫ్‌లో రిస్క్ చేయకపోతే అది లైఫ్ కాదని అన్నాడు పూరి జగన్నాథ్. ఆడియెన్స్‌ను తప్ప తాను ఎవరినీ మోసం చేయలేదని అన్నాడు. ఆదివారం పూరి జగన్నాథ్ ఓపెన్ లెటర్‌ను రిలీజ్ చేశాడు. ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పూరి జగన్నాథ్
Puri Jagannadh Open Letter: సక్సెస్, ఫెయిల్యూర్ ఈ రెండు ఆపోజిట్ అనుకుంటాం కాదు ఈ రెండూ ఫ్లోలో ఉంటాయని, ఒకదాని తర్వాత ఇంకొకటి వస్తాయని అన్నాడు దర్శకుడు పూరి జగన్నాథ్. గుండెల నిండా ఊపిరి పీల్చితే బతుకుతామని అనుకుంటాం కానీ వెంటనే చేయాల్సిన పని ఏంటి అంటే ఊపిరి వదిలెయ్యటమే అని పేర్కొన్నాడు. విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన లైగర్ సినిమా ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ అంచనాలతో పాన్ ఇండియన్ స్థాయిలో రిలీజైన ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది.
డిస్ట్రిబ్యూటర్లతో వివాదం
ఈ సినిమా నష్టాలకు సంబంధించి కొంతకాలంగా పూరి జగన్నాథ్‌కు డిస్ట్రిబ్యూటర్లకు మధ్య వివాదం నడుస్తోంది. సినిమా విషయంలో తాము నష్టపోయిన మొత్తాలను పూరి జగన్నాథ్ భరించాలంటూ డిస్ట్రిబ్యూటర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవలే డిస్ట్రిబ్యూటర్లు వరంగల్ శ్రీను, శోభన్‌బాబులపై పూరి జగన్నాథ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనతో పాటు తన కుటుంబసభ్యులకు డిస్ట్రిబ్యూటర్ల నుంచి ప్రాణహాని ఉందంటూ పేర్కొన్నాడు.
ఓపెన్ లెటర్
ఈ నేపథ్యంలో సోమవారం ఓ ఓపెన్ లెటర్‌ను పూరి జగన్నాథ్ రిలీజ్‌చేశాడు. ఇక్కడ ఏదీ పర్మినెంట్ కాదు. లైఫ్‌లో మనకి జరిగే ప్రతి సంఘటనను ఒక ఎక్స్‌పీరియన్స్‌లా చూడాలి తప్ప ఫెయిల్యూర్ సక్సెస్‌లా చూడకూడదు అని ఇందులో పేర్కొన్నాడు. . లైఫ్‌ను సినిమాలా చూస్తే షో అయిపోగానే మర్చిపోవచ్చు. మైండ్‌కి తీసుకుంటే మెంటల్ వస్తది.
సక్సెస్ అయితే డబ్బులొస్తాయి. ఫెయిల్ అయితే బోలెడు జ్ఞానం వస్తాది. ఎప్పుడూ మనం మెంటల్లీ, ఫైనాన్షీయల్లీ గెయిన్ అవుతూనే ఉంటాం తప్ప ఈ ప్రపంచంలో కోల్పోయేది ఏది లేదు. అందుకే దేనిని ఫెయిల్యూర్‌గా చూడొద్దు. బ్యాడ్ జరిగితే మన చుట్టూ ఉన్న బ్యాడ్ పీపుల్ మాయమైపోతారు. వెనక్కి తిరిగి చూస్తే ఎవడు మిగిలాడో తెలుస్తుంది.
నువ్వు హీరో అయితే...
లైఫ్‌లో రిస్క్ చేయ్యకపోతే అది లైఫ్‌కాదు. ఏ రిస్క్ చేయకపోతే అది ఇంకా రిస్క్. లైఫ్‌లో నువ్వు హీరో అయితే సినిమాలో హీరోకి ఎన్ని జరిగాయో అవన్నీ నీకు కూడా జరుగుతాయి. పొగుడుతారు, నిందిస్తారు. బొక్కలో వేస్తారు. మళ్లీ విడుదలచేస్తారు. అందరూ క్లాప్స్ కొడతారు. అక్షింతలు వేస్తారు. అవన్నీ మీ లైఫ్‌లో జరగకపోతే జరిగేలా చూడండి. లేకపోతే మీరు హీరో కాదేమో అనుకునే ప్రమాదం ఉంది. మనం హీరోలా బతకాలి. బతకాలి అంటే నిజాయితీగా ఉండాలి. నేను నిజాయితీపరుడని చెప్పుకోనవసరం లేదు. నిజాన్ని కాపాడాల్సిన అవసరం లేదు. నిజాన్ని నిజమే కాపాడుకుంటుంది.
ఎవరిని మోసం చేయలేదు...
ఎవరి నుంచి ఏది ఆశించకుండా ఎవరినీ మోసం చేయకుండా మన పని మనం చేసుకుంటూ పోతే మనల్ని పీకే వాళ్లు ఎవరూ ఉండరు. నేను ఎప్పుడైనా మోసం చేస్తే దగా చేస్తే అది నన్ను నమ్మి నా సినిమా టికెట్ కొన్న ఆడియెన్స్‌ను తప్ప నేను ఎవరినీ మోసం చేయలేదు. మళ్లీ ఇంకో సినిమా తీస్తా. వాళ్లను ఎంటర్‌టైన్ చేస్తా అని ఈ లెటర్‌లో పూరి జగన్నాథ్ వెల్లడించాడు. పూరి ఓపెన్ లెటర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.