తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sarvam Shakthi Mayam Review: సర్వం శక్తిమయం రివ్యూ.. 18 శక్తి పీఠాల దర్శనం.. ప్రియమణి కొత్త సిరీస్ ఎలా ఉందంటే?

Sarvam Shakthi Mayam Review: సర్వం శక్తిమయం రివ్యూ.. 18 శక్తి పీఠాల దర్శనం.. ప్రియమణి కొత్త సిరీస్ ఎలా ఉందంటే?

Sanjiv Kumar HT Telugu

20 October 2023, 8:57 IST

google News
  • Sarvam Shakthi Mayam Web Series Review: ప్రియమణి నటించిన కొత్త వెబ్ సిరీస్ సర్వం శక్తిమయం. అష్టాదశ శక్తి పీఠాలు, కుటుంబ బంధాలు, సనాతన ధర్మం వంటి అంశాలతో రూపొందిన ఆద్యాత్మిక వెబ్ సిరీస్ సర్వం శక్తి మయం రివ్యూలోకి వెళితే..

సర్వం శక్తిమయం రివ్యూ
సర్వం శక్తిమయం రివ్యూ

సర్వం శక్తిమయం రివ్యూ

టైటిల్: సర్వం శక్తిమయం

నటీనటులు: సంజయ్ సూరి, ప్రియమణి, సమీర్ సోని, ఆశ్లేష ఠాకూర్, అభయ్ సింహా, సుబ్బరాజు తదితరులు

కథ, క్రియేటర్: బీవీఎస్ రవి

దర్శకత్వం: ప్రదీప్ మద్దాలి

సినిమాటోగ్రఫీ సజీష్ రాజేంద్రన్

నిర్మాతలు: అంకిత్, విజయ్ చాడ, కౌముది కే నేమాని

విడుదల తేది: అక్టోబర్ 20, 2023

ఓటీటీ: ఆహా

ఎపిసోడ్స్: 10 (ఒక్కో ఎపిసోడ్ సుమారు 30 నిమిషాలు)

Sarvam Shakthi Mayam Review In Telugu: టాలీవుడ్ పాపులర్ రైటర్ బీవీఎస్ రవి క్రియేటర్‌గా చేసిన వెబ్ సిరీస్ సర్వం శక్తిమయం. ప్రియమణి, సంజయ్ సూరి, సమీర్ సోని ముఖ్య పాత్రలు పోషించిన ఈ వెబ్ సిరీస్ ఆద్యాత్మికంగా దృక్పథంతో తెరకెక్కించింది. భారతదేశంలోని 18 అష్టాదశ శక్తి పీఠాల గొప్పదనం, విశిష్టత, హిందూ ధర్మం గురించి వివరిస్తూ ఓ కుటుంబం చేసే తీర్థయాత్రే ఈ సర్వం శక్తిమయం. మరి ప్రియమణి నటించిన ఈ సర్వం శక్తిమయం వెబ్ సిరీస్ రివ్యూపై లుక్కేస్తే..

కథ:

మాధవ్ (సంజయ్ సూరి)కి భార్య ప్రియ (ప్రియమణి) ఇద్దరు పిల్లలు ప్రణవ్ (అభయ్ సింహా), రేవతి (ఆశ్లేష ఠాకూర్). అనేక వ్యాపారాలు చేసి చాలా నష్టపోతాడు. ఆఖరుకు భార్య తండ్రి దగ్గర కూడా డబ్బు తీసుకుని ఇంట్లో అందరికీ చులకన అవుతాడు. కాలేజీ గెట్ టు గెదర్ పార్టీలో తన ఫ్రెండ్ దీపక్ (సుబ్బరాజు)ను రూ. 50 లక్షలు సాయం చేయమని అడుగుతాడు. డబ్బు కావాలా, జీవితాన్ని నిలబెట్టే ఐడియా కావాలా అని దీపక్ అడిగితే.. ఐడియానే కావాలంటాడు మాధవ్.

ఆసక్తికర విషయాలు

దీపక్ ఇచ్చిన ఐడియా ఏంటీ? దాన్ని మాధవ్ ఫాలో అయ్యాడా? ఈ క్రమంలో మాధవ్‌కు ఎదురైన పరిస్థితులు ఏంటీ? అప్పటికే విడిపోదామనుకుంటున్న తన భార్య ప్రియ విడాకులు ఇచ్చిందా? మరోవైపు 'దేవుడిని ఎందుకు నమ్మాలి' అనే బుక్ రాయడం కోసం వచ్చిన నాస్తికుడు, రైటర్ డాక్టర్ రంజిత్ (సమీర్ సోని) మాధవ్ కుటుంబంతో ఎలా ట్రావెల్ చేశాడు? అతను హిందూ ధర్మం, దేవుడిపై నమ్మకం వంటి విషయాల గురించి ఏం తెలుసుకున్నాడు? తన కుటుంబంతో 40 రోజులు చేసిన తీర్థయాత్ర ఎలా సాగింది? అనే తదితర ఆసక్తికర విషయాల సిరీసే సర్వం శక్తిమయం.

విశ్లేషణ:

జీవితంలో అనేక వ్యాపారాలు చేసి అన్నింట్లో ఫెయిల్ అయిన ఓ వ్యక్తి ప్రశాంతతవైపు పయనించే వెబ్ సిరీస్ సర్వం శక్తిమయం. తన ఫెయిల్యూర్స్ దీపక్ చెప్పడంతో సిరీస్ స్టార్ట్ అవుతుంది. అతని సమస్యలు తొలగిపోవాలంటే కుటుంబంతో అష్టాదశ శక్తి పీఠాల దర్శనం చేసుకుని రావాలని ఫ్రెండ్ చెప్పిన ఐడియాతో సిరీస్ ఆసక్తికరంగా సాగుతుంది. చులకనగా చూసే కుటుంబంతో ఓ తండ్రి చేసే తీర్థయాత్ర ఒకవైపు అయితే, నాస్తికుడిని అస్తికుడిగా మార్చే ప్రయాణం మరోవైపు ఆకట్టుకుంటుంది.

సైంటిఫిక్ లాజిక్స్

భారతదేశంలో హిందూ, సనాతన ధర్మం, అష్టాదశ పీఠాల విశిష్టత, వేదాలు, ఉపనిషత్తులు, సాంప్రదాయాలు, పురాణాలు చాలా మందికి తెలియదు. కానీ, వారు తరతరాల నుంచి కుటుంబీకుల నుంచి అనుసరిస్తూ వస్తుంటారు. అది ఆద్యాత్మిక భావన, మనిషికి ప్రశాంతతను ఇచ్చే ఓ మార్గం అని చెప్పారు. కొన్ని విషయాల్లో మనం సైంటిఫిక్ లాజిక్స్ వెతుకుతుంటాం. కానీ, ఆ లాజిక్స్ హిందూ ధర్మంలో లేవని చాలా మంది భావన. కానీ, ఈ సిరీసుతో సైంటిఫిక్ లాజిక్స్ అన్ని హిందూ ధర్మం నుంచి వచ్చినవే అని చూపించారు.

సంస్కృతంలో కోట్ల సంవత్సరాల నుంచి ఉన్న వేదాలు, ఉపనిషత్తుల్లో అణువు, పరమాణువు వంటి సైన్స్ గురించి చెప్పినట్లు తెలిపారు. దీపక్ ఫ్యామిలీతో డాక్టర్ రంజిత్ చేసే ప్రయాణం, ఒక్కో శక్తి పీఠం గురించి కథ, వాటి ఆవిర్భావం, అంతరార్థం, అంతా కలిసి ఉన్నట్లు కనిపించే కుటుంబంలోని మనస్పర్థలు, దేవుడిపై నమ్మకానికి ఇచ్చే వివరణ, పూజారులు ఉచ్ఛరించే మంత్రాల్లోని విశిష్టత వంటి అనేక విషయాల గురించి అర్థవంతంగా సిరీస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు.

ఆలోచింపజేసే డైలాగ్స్

అయితే, తరతరాల నుంచి మా కుటుంబీకులు దేవుడిని నమ్ముతున్నారు, అందుకే గుడులు కట్టారు అని ఓ తేనే తీసేవాడు చెప్పే డైలాగ్ దేవుడిపై నమ్మకం ఉంచండి అని కావాలని రుద్దినట్లుగా అనిపిస్తుంది. కానీ, అదే సన్నివేశంలో మనలో మీద మనకు నమ్మకం ఉండటమే దేవుడు. నాలో ఆ నమ్మకం లేదు. అందుకే దేవుడిని నమ్ముతున్నాను అని చెప్పే డైలాగ్ ఆలోచించేలా చేస్తుంది. ఇక కొన్ని సీన్లకు చివరి మూడో ఎపిసోడ్‌లో ఇచ్చే వివరణ సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది.

ఈ తీర్థయాత్రలో ఒక మనిషి తన గురించి తాను ఏం తెలుసుకోగలడో చూపించారు. భార్యాభర్తల అనుబంధం, సక్సెస్, ఫెయిల్యూర్, సైన్స్, నమ్మకం, విశ్వాసం, శాంతి, 18 అష్టాదశ పీఠాల ప్రాముఖ్యత వంటి అంశాలను చాలా బాగా చూపించారు. పని చేసుకుంటూ పోవడమే దేవుడు అని సందేశం ఇచ్చారు. కొన్ని సన్నివేశాలు మాత్రం రిపీటెడ్‌గా, సాగదీతలా బోర్ కొట్టిస్తాయి. ఇక సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ, డైరెక్షన్, నిర్మాణ విలువలు అన్ని చక్కగా కుదిరాయి. 18 అష్టాదశ పీఠాలను దర్శించుకున్న భావన కలుగుతుంది.

నమ్మకం తీసుకొచ్చే సిరీస్

సంజయ్ సూరి, ప్రియమణి, సమీర్ సోని, ఆశ్లేష ఠాకూర్, అభయ్ సింహా తమ పాత్రల్లో జీవించారు. ఫైనల్‌గా చెప్పాలంటే.. ఇప్పటివరకు హారర్, స్కైఫై, యాక్షన్, మర్డర్ మిస్టరీ, టైమ్ ట్రావెల్ వంటి తదితర సినిమాలు, వెబ్ సిరీసులు చూశాం. కానీ, మనిషికి ఆధ్యాత్మిక భావనతో వచ్చే ప్రయోజనాన్ని తెలియచెప్పే సర్వం శక్తిమయం వంటి సిరీస్ చూడటం చాలా అవసరం. మనిషికి తనపై తనకు నమ్మకం తీసుకొచ్చే ఆద్యాత్మిక సిరీస్ సర్వం శక్తిమయం.

రేటింగ్: 2.75/5

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం