Pathu Thala Movie Review: పత్తు తలా మూవీ రివ్యూ - శింబు గ్యాంగ్‌స్టర్ మూవీ ఎలా ఉందంటే
29 April 2023, 14:31 IST
Pathu Thala Movie Review: శింబు, గౌతమ్ కార్తిక్ హీరోలుగా నటించిన తమిళ మూవీ పత్తు తలా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజైంది. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీకి కృష్ణ దర్శకత్వం వహించాడు.
శింబు
Pathu Thala Movie Review: శింబు, గౌతమ్ కార్తిక్, ప్రియా భవానీ శంకర్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ సినిమా పత్తు తలా. కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా కోలీవుడ్‌లో కమర్షియల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా ఇటీవల ఆమెజాన్ ప్రైమ్ ద్వారా ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీ ఎలా ఉందంటే...
Pathu Thala Movie Story - సీఏం మిస్సింగ్...
సంక్షేమమే క్షేమం పేరుతో ఇంటింటికి టీకా అనే కొత్త పథకాన్ని ముఖ్యమంత్రి ప్రవేశపెడతాడు. ఈ పథకాన్నిసీఏం ప్రారంభించడం డిప్యూటీ సీఏం గుణశేఖర్‌కు (గౌతమ్ మీనన్) ఇష్టం ఉండదు. అదే రోజు అనూహ్యంగా సీఏం కనిపించకుండా పోతాడు. ముఖ్యమంత్రి అదృశ్యం వెనుక గ్యాంగ్‌స్టర్ ఏజీఆర్ అలియాస్ ఏజీ రావణన్ (శింబు) ఉన్నాడని పోలీసులతో పాటు సీబీఐ అనుమానిస్తుంది.
కానీ అతడికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు వారికి లభించవు. ఏజీఆర్‌ను పట్టుకోవడానికి ప్రయత్నించిన చాలా మంది పోలీసులు, ప్రభుత్వ అధికారులు అదృశ్యమవుతుంటారు. ఏజీఆర్ చేసే అకృత్యాలను బయటపెట్టే బాధ్యతను అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ గుణ అలియాస్ శక్తి (గౌతమ్ కార్తిక్) చేపడతాడు. ఏజీఆర్ గ్యాంగ్‌లో సభ్యుడిగా చేరి కొద్ది రోజుల్లోనే అతడికి నమ్మకస్తుడిగా మారిపోతాడు.
ప‌్రపంచం దృష్టిలో కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌గా చెలామణి అవుతోన్న ఏజీఆర్ అసలు స్వరూపం ఏమిటి? అతడు గ్యాంగ్‌స్టర్‌గా ఎందుకు మారాడు? సీఏం అదృశ్యం వెనుక ఏజీఆర్ హస్తం ఉందా? సీఏంకు ఏజీఆర్‌తో ఉన్న సంబంధం ఏమిటి? ఏజీఆర్‌తో అతడి చెల్లెలు ఎందుకు మాట్లడదు? గుణ పోలీస్ అనే నిజం ఏజీఆర్ కనిపెట్టాడా? ఏజీఆర్‌ను పట్టుకోవడానికి వచ్చిన గుణ చివరకు అతడి గ్యాంగ్‌లోనే చేరాలని ఎందుకు నిర్ణయించుకున్నాడు? అన్నదే పత్తు తలా(Pathu Thala Movie Review) మూవీ కథ.
గ్యాంగ్‌స్టర్ డ్రామా...
గ్యాంగ్‌స్టర్ డ్రామాకు ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ అంశాలను మేళవిస్తూ దర్శకుడు కృష్ణ పత్తు తలా మూవీని తెరకెక్కించాడు. ప్రజలకు మంచి చేయడానికి చెడు మార్గాన్ని ఓ గ్యాంగ్ స్టర్ ఎందుకు ఎంచుకోవాల్సివచ్చింది? చట్టం దృష్టిలో పెద్ద క్రిమినల్‌గా చెలామణి అవుతోన్న అతడిని ఓ అండర్ కవర్ పోలీస్ ఆధారాలతో పట్టుకోవడానికి ఏం చేశాడనే అంశాల చుట్టూ ఈ కథను అల్లుకున్నారు. యాక్షన్ అంశాలతో పాటు అంతర్లీనంగా అన్నాచెల్లెళ్ల అనుబంధానికి కథలో చోటిచ్చారు.
ఏజీఆర్ గ్యాంగ్ మెంబర్...
ముఖ్యమంత్రి కిడ్నాప్ అయ్యే సీన్‌తోనే ఈ సినిమా ఆసక్తికరంగా ప్రారంభమవుతుంది. ఈ క్రైమ్ వెనుక ఏజీఆర్ ఉన్నాడని పోలీసులు అనుమానించడం, అతడి గ్యాంగ్‌లోకి రౌడీగా ప్రజలను నమ్మిస్తోన్న అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ గుణ చేరే అంశాలతో పత్తు తలా ఆరంభంలోనే క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. ఏజీఆర్ గ్యాంగ్‌లో గుణ నమ్మకస్తుడిగా ఎదగడం, మరోవైపు ప్రభుత్వ అధికారితో లీలాతో గుణ ప్రేమ, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్‌తో ఫస్ట్‌హాఫ్ నిదానంగా నడిపించారు.
శింబు ఎంట్రీతో…
విరామ సన్నివేశాల్లో ఏజీఆర్ ఎంట్రీ ఇచ్చే సీన్‌ను మళ్లీ రైట్ ట్రాక్‌లోకి కథ టర్న్ అయినట్లు అనిపిస్తోంది. సెకండాఫ్‌లో ఏజీఆర్ విలనిజాన్ని చూపిస్తేనే మరోవైపు అతడిని పట్టుకోవడానికి గుణ సాగించే సీక్రెట్ ఇన్వేస్టిగేషన్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు థ్రిల్లింగ్‌ను పంచుతాయి. సీఏం భార్య ఏజీఆర్ ఇంట్లో కనిపించడం, నమ్మకస్తులే అతడికి ద్రోహం చేయడానికి ప్రయత్నించే మలుపులు ఆకట్టుకుంటాయి. చివరకు ఏజీఆర్‌ను పట్టుకోవడానికి వచ్చిన గుణ అతడి కోసం ప్రాణ త్యాగానికి సిద్దపడటానికి సిద్ధమయ్యే సీన్ బాగుంది. క్లైమాక్స్ ఎపిసోడ్‌లోని యాక్షన్ సీన్స్ మాస్ ఫ్యాన్స్‌కు ఫీస్ట్ గా ఉండేలా డైరెక్టర్ తెరకెక్కించాడు.
గ్యాంగ్‌స్టర్ పాత్రలో…
ఏజీఆర్ అనే గ్యాంగ్‌స్టర్‌గా శింబు యాక్టింగ్, లుక్ బాగున్నాయి. కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌గా కఠిన మనస్కుడిగా, మరోవైపు చెల్లెలి ప్రేమ కోసం ఆరాటపడే అన్నగా క్యారెక్టర్‌లో చూపించిన వేరియేషన్ బాగుంది. గుణ అనే అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో గౌతమ్ కార్తిక్ ఒదిగిపోయాడు. ప్రియా భవానీ శంకర్ క్యారెక్టర్‌కు పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. విలన్‌గా గౌతమ్ మీనన్ పాత్ర రొటీన్‌గా ఉంది.
Pathu Thala Movie Review - శింబు ఫ్యాన్స్‌కు మాత్రమే....
కన్నడ చిత్రం మఫ్టీకి రీమేక్‌గా పత్తు తలా సినిమా రూపొందింది. కథ, కథనాలు రొటీన్‌గానే ఉన్నా శింబు యాక్టింగ్ కోసం ఈ సినిమా చూడొచ్చు.