RRR For Oscars: ఆస్కార్ రేసులో ఆర్ఆర్ఆర్ - 14 కేటగిరీల్లో నామినేషన్స్
06 October 2022, 14:47 IST
RRR For Oscars: ఆస్కార్ రేసులో ఆర్ఆర్ఆర్ ఆశలు సజీవంగానే మిగిలిఉన్నాయి. ఈ సినిమా ను పధ్నాలుగు కేటగిరీల్లో ఆస్కార్‌కు నామినేట్ చేయాలంటూ కొత్తగా క్యాంపెయిన్ మొదలుపెట్టారు.
ఎన్టీఆర్, రామ్‌చరణ్
RRR For Oscars: ఆర్ఆర్ఆర్ విడుదలై ఏడు నెలలు దాటినా ఈ సినిమా హవా మాత్రం ఇంకా తగ్గలేదు. దేశవ్యాప్తంగా 1200 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టి సత్తా చాటిన ఈ సినిమా విదేశాల్లో అద్భుతమైన ఆదరణను సొంతం చేసుకుంటోంది. హాలీవుడ్ ప్రముఖులతో పాటు సినీ అభిమానులు ఈ చారిత్రక చిత్రంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటనకు ఫిదా అవుతున్నారు. ఈ సినిమాకు ఆస్కార్ రావాలంటూ సోషల్ మీడియా వేదికగా తమ మనసులోని మాటను బయటపెడుతున్నారు.
తొలుత ఇండియా నుంచి అఫీషియల్‌గా ఆర్ఆర్ఆర్ ఆస్కార్ రేసులో నిలిచే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఆర్ఆర్ఆర్ ను కాదని గుజరాతీ సినిమా చెల్లో షోను ఆస్కార్ ఎంట్రీ కోసం పంపుతున్నట్లుగా ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించడం విమర్శలకు దారితీసింది.
ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నామినేట్ చేయకపోయినా ఆర్ఆర్ఆర్ ఆస్కార్ బరిలో నిలిచే అవకాశం ఇంకా ఉంది. ఫర్ యువర్ కన్సిడరేషన్ (ఎఫ్‌వైసీ) క్యాంపెయిన్ ద్వారా 14 కేటగిరీల్లో ఈ సినిమాను నామినేట్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తోంది.
బెస్ట్ పిక్చర్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ డైరెక్టర్, సపోర్టింగ్ రోల్, ఒరిజినల్ సాంగ్, ఒరిజినల్ మ్యూజిక్‌తో పాటు మిగిలిన విభాగాల్లో ఈ సినిమా నామినేషన్స్ పంపనున్నట్లు సమాచారం. ఇండిపెండెంట్‌గా ఆస్కార్ క్యాంపెయిన్‌ను ఆర్ఆర్ఆర్ టీమ్ మొదలుపెట్టినట్లు హాలీవుడ్ పత్రికలు కథనాలు రాశాయి.
ఈ కథనాల్ని రాజమౌళి తనయుడు కార్తికేయ ట్విట్టర్‌లో షేర్ చేశారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల కష్టం, తపనతో పాటు ప్రపంచం నలుమూలలా ఉన్న సినీ అభిమానుల ప్రేమ తమను ఇక్కడి వరకు తీసుకొచ్చినట్లు ట్వీట్ చేశాడు. సినిమా డెస్టినీ ఎలా ఉంటుందో వేచిచూడాల్సిందే అంటూ పేర్కొన్నాడు.
అతడి ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 1920 బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కించాడు.ఇందులో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్, కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటించారు. అలియాభట్, ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో అజయ్ దేవ్‌గణ్, శ్రియ కీలక పాత్రలు పోషించారు.