తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bimbisara Movie Review: బింబిసార మూవీ రివ్యూ.. కళ్యాణ్ రామ్ మెప్పించాడా

Bimbisara movie review: బింబిసార మూవీ రివ్యూ.. కళ్యాణ్ రామ్ మెప్పించాడా

05 August 2022, 13:36 IST

google News
  • Bimbisara movie review: హిస్టారిక‌ల్ ఫాంటసీ కథాంశానికి టైమ్ ట్రావెల్ పాయింట్ ను ముడిపెడుతూ నంద‌మూరి హీరో క‌ళ్యాణ్‌రామ్ (Kalyan ram) చేసిన చిత్రం బింబిసార‌ (Bimbisara). వ‌శిష్ట్ మ‌ల్లిడి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన ఈ సినిమా ఎలా ఉందంటే..

క‌ళ్యాణ్‌రామ్
క‌ళ్యాణ్‌రామ్ (twitter)

క‌ళ్యాణ్‌రామ్

Bimbisara movie review: చ‌రిత్ర‌ను, వ‌ర్త‌మానాన్ని ముడిపెడుతూ తెర‌కెక్కే సినిమాల ప‌ట్ల ప్రేక్ష‌కుల్లో ఎప్పుడూ ఆస‌క్తి ఉంటుంది. లార్జ‌ర్‌దేన్ లైఫ్ క‌థాంశాల‌తో కూడిన ఈ సినిమాలు అరుదుగా వ‌స్తుంటాయి. అందులోనూ టైమ్ ట్రావెల్ పాయింట్ తో తెలుగులో చాలా త‌క్కువ సినిమాలొచ్చాయి. అలాంటి అరుదైన జోన‌ర్ లో రూపొందిన చిత్రం బింబిసార‌.

కెరీర్ తొలిసారి హిస్టారిక‌ల్ ఫాంట‌సీ క‌థాంశంతో క‌ళ్యాణ్‌రామ్ (kalyan ram) చేసిమా ఇది. దాదాపు న‌ల‌భై కోట్ల వ్యయంతో క‌ల్యాణ్‌రామ్ మార్కెట్‌కు రెట్టింపు బ‌డ్జెట్‌తో ఈ సినిమా తెర‌కెక్కింది. ఈ సినిమాతో వ‌శిష్ట్ మ‌ల్లిడి ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మ‌య్యారు. కేథ‌రిన్‌, సంయుక్త‌ మీన‌న్ (samukta menon) హీరోయిన్లుగా న‌టించారు. ఏ ధైర్యంతో కొత్త ద‌ర్శ‌కుడిని న‌మ్మి క‌ళ్యాణ్ రామ్ ఈ సినిమా చేశాడు. బింబిసార‌తో అత‌డికి విజ‌యం ద‌క్కిందా ప్ర‌స్తుతం టాలీవుడ్ లో నెల‌కొన్న అనిశ్చిత ప‌రిస్థితుల‌ను అధిగ‌మిస్తూ థియేట‌ర్ల‌కు ప్రేక్ష‌కుల్ని ర‌ప్పించే స‌త్తా ఈ సినిమాకు ఉందా లేదా తెలియాలంటే క‌థ‌లోకి వెళ్లాల్సిందే.

బింబిసారుడి కథ (story of bimbisara)

అధికారం యుద్ధ‌మే శ్వాస‌గా జీవిస్తుంటాడు త్రిగ‌ర్తల సామ్రాజ్యాధిప‌తి బింబిసారుడు (కళ్యాణ్ రామ్). త‌న పాల‌న‌లో ప్ర‌జ‌ల‌కు రాక్ష‌సుడైనా, దేవుడైనా తానే అనే విర్ర‌వీగుతుంటాడు. త‌న మాట‌కు ఎవ‌రు ఎదురుచెప్పినా మ‌ర‌ణ‌దండ‌న విధిస్తుంటాడు. త‌న అధికారానికి అడ్డొస్తాడ‌ని సోద‌రుడు దేవ‌ద‌త్తుడిని (కళ్యాణ్ రామ్ )కూడా హ‌త‌మారుస్తాడు.

త‌న క‌న్నుప‌డిన ప్ర‌తి సామ్రాజ్యాన్ని హ‌స్త‌గ‌తం చేసుకుంటూ త్రిగ‌ర్త‌ల సామ్రాజ్యాన్ని ఏలుతుంటాడు బింబిసారుడు. అన్న కుట్ర‌ల నుండి త‌ప్పించుకున్న దేవ‌ద‌త్తుడు ఓ మాయా ద‌ర్ప‌ణం స‌హాయంతో బింబిసారుడిని కాల‌చ‌క్రంలో 5వ శ‌తాబ్దం నుండి 20వ శ‌తాబ్దానికి పంపిస్తాడు.

ఆధునిక యుగంలో బింబిసారుడికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర‌య్యాయి? అత‌డిలో మార్పు ఎలా వ‌చ్చింది? క్రూరుడైన రాజుగా పేరుతెచ్చుకున్న బింబిసారుడు ప్ర‌జ‌ల దేవుడిగా ఎలా కొల‌వ‌బ‌డ్డాడు?

బింబిసారుడి ద‌గ్గ‌ర ఉన్న ధ‌న్వంత‌రి గ్రంథం కోసం సుబ్ర‌హ్మ‌ణ్య‌శాస్త్రి (వివాన్)అనే వైద్యుడు ప‌న్నిన కుట్ర‌లో బింబిసారుడు ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడా? దేవ‌ద‌త్తుడు ప్రేమించిన ఐరా (కేథరిన్) ఎవ‌రు? బింబిసారుడుకు పోలీస్ ఆఫీస‌ర్ వైజ‌యంతితో (సంయుక్తమీనన్) ఉన్న సంబంధ‌మేమిట‌న్న‌దే బింబిసార క‌థ.

అహాన్ని జయించడమే గెలుపు

అహం మ‌నిషిని ప్ర‌పంచంలో తానే గొప్ప అనే భ్ర‌మప‌డేలా చేస్తుంది. అహంభావ మ‌న‌స్త‌త్వంతో మంచి, చెడు అనే విచ‌క్ష‌ణ మ‌ర‌చిపోయి వేసే త‌ప్ప‌ట‌డుగుల్లోనే విజయం ఉంద‌ని న‌మ్ముతుంటారు.

కానీ అహాన్ని వీడ‌టంలోనే నిజ‌మైన గెలుపు ఉంద‌నే పాయింట్‌కు హిస్టారిక‌ల్, ఫాంట‌సీ డ్రామాను జోడించి ద‌ర్శ‌కుడు వ‌శిష్ట్ మ‌ల్లిడి బింబిసార సినిమాను తెర‌కెక్కించారు.

అధికార దాహం, యుద్ధం త‌ప్ప మ‌రో ప్ర‌పంచం తెలియ‌ని ఓ క్రూరుడైన రాజులో ఎలా మార్పువ‌చ్చింద‌నే అంశాన్ని రెండు టైమ్ పీరియ‌డ్స్‌లో డిఫ‌రెంట్ స్క్రీన్‌ప్లే బింబిసార‌ సినిమాలో చూపించారు.

బింబిసార స్క్రీన్ ప్లే మ్యాజిక్

త్రిగ‌ర్త‌ల సామ్రాజ్య‌పు, కాలానికి నేటి ఆధునిక స‌మ‌యాన్ని, పాత్ర‌ల‌ను ముడిపెడుతూ ద‌ర్శ‌కుడు క‌థ‌ను ఆస‌క్తిక‌రంగా న‌డిపించాడు.

చాలా టిపిక‌ల్ స్క్రీన్‌ప్లే ఇది. రెండు కాలాల మ‌ధ్య సంబంధాన్ని అర్థ‌వంతంగా చెప్ప‌డంలో ఏ మాత్రం త‌డ‌బాటుకు లోనైనా మొత్తం క‌న్ఫ్యూజ‌న్‌గా మారిపోతుంది. కానీ ద‌ర్శ‌కుడు వ‌శిష్ట్‌కు ఇదే తొలి సినిమా అయినా ప్ర‌తి పాయింట్‌ను లాజిక్స్ తో చ‌క్క‌గా చెప్పాడు.

ఈ ఫాంట‌సీ డ్రామా నుంచి కావాల్సినంత ఫ్యామిలీ ఎమోష‌న్ ను రాబ‌ట్టుకున్నాడు. ఓ చిన్న పాప కార‌ణంగా బింబిసారుడి మార్పు రావ‌డం అనే పాయింట్ చ‌క్క‌గా వ‌ర్క‌వుట్ అయ్యింది. ఫ్యామిలీ ఆడియెన్స్‌కు క‌నెక్ట్ అయ్యేలా ఈ ఎపిసోడ్స్ రాసుకున్నారు.

బింబిసారుడి క్రూరత్వంతో

బింబిసారుడి క్రూర‌త్వాన్ని ఆవిష్క‌రిస్తూ క‌థ‌ను మొద‌లుపెట్టిన తీరు ఆక‌ట్టుకుంటుంది. త‌న అడ్డొచ్చిన ప్ర‌తి ఒక్క‌రిని హ‌త‌మారుస్తూ త‌న సామ్రాజ్యాన్ని విస్త‌రించే చ‌క్ర‌వ‌ర్తిగా బింబిసారుడిని చూపించే స‌న్నివేశాల‌తో ఆక‌ట్టుకుంటాయి. అలాంటి రాజు త‌న రాజ్యానికి దూర‌మై నేటి కాలానికి వ‌చ్చిన త‌ర్వాత ఎదుర‌య్యే సీన్స్ నుండి కామెడీని రాబ‌ట్టుకుంటూ ఫ‌స్ట్‌హాఫ్‌ను న‌డిపించారు. జ‌బ‌ర్ధ‌స్త్ బ్యాచ్ చేసిన కామెడీ ట్రాక్ ఫ‌స్ట్ హాఫ్ లో న‌వ్వించింది.

త‌న వార‌సుల్ని బింబిసారుడు క‌లుసుకోవ‌డం, ఓ చిన్నారితో అత‌డికి ఉన్న అనుబంధం చుట్టూ క‌థ‌ను అల్లుకుంటూ సెంటిమెంట్ ప్ర‌ధానంగా సెకండ్ హాఫ్‌లో చూపించారు.

మ‌రోవైపు బింబిసారుడి స్థానంలో రాజ్యాన్ని చేప‌ట్టిన దేవ‌ద‌త్తుడు ఏం చేశాడో చెబుతూ రెండింటిని సింక్ చేస్తూ క‌థ‌నాన్ని ప‌రుగులు పెట్టించారు. నిజమైన మనిషిగా బింబిసారుడు ఎలా మారాడనే పాయింట్‌తో యాక్ష‌న్‌, ఎమోష‌న్స్ జోడిస్తూ వ‌చ్చే క్లైమాక్స్ ఆక‌ట్టుకుంటుంది. బింబిసార సినిమాకు సీక్వెల్ ప్రకటించి ప్రేక్షకుల్ని సర్ ప్రైజ్ చేశారు.

గ్రాఫిక్స్ నాసిరకం..

ద‌ర్శ‌కుడు ఎంచుకున్న పాయింట్ బాగున్నా గ్రాఫిక్స్ నాసిర‌కంగా ఉన్నాయి. బ‌డ్జెట్ ప‌రిమితుల‌తో చాలా చోట్ల చుట్టేసిన అనుభూతి క‌లుగుతుంది. క‌ళ్యాణ్‌రామ్ మిన‌హా బ‌ల‌మైన విల‌న్‌, హీరోయిన్ క్యారెక్ట‌ర్స్ లేక‌పోవ‌డం సినిమాకు మైన‌స్‌గా మారింది. నేటి యుగానికి వ‌చ్చిన బింబిసారుడికి ఎదుర‌య్యే క‌ష్టాలు ఆదిత్య 369, య‌మ‌ల‌లీల‌తో పాటు ప‌లు సినిమాల్ని గుర్తుకుతెస్తాయి.

కళ్యాణ్ రామ్ కెరీర్ బెస్ట్ bimbisara

ఇందులో అధికార దాహం క‌లిగిన క్రూరుడైన రాజుగా, ప్ర‌జ‌ల కోసం ఆలోచించే వ్య‌క్తిగా రెండు పాత్ర‌ల్లో క‌ళ్యాణ్‌రామ్ క‌నిపించారు. కానీ బింబిసారుడి పాత్రే ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచింది.

నెగెటివ్ షేడ్స్ తో కూడిన క్యారెక్ట‌ర్‌లో పూర్తిగా జీవించారు. క‌ళ్ల‌తోనే విల‌నిజాన్ని పండించారు. సినిమా మొత్తం ఒకే ఇంటెన్స్‌, ఎమోష‌న్‌ను క్యారీ చేస్తూ న‌టించాడు.

న‌టుడిగా అత‌డికి కెరీర్‌లో డిఫ‌రెంట్ సినిమాగా బింబిసార నిలుస్తుంది. క‌థానాయికలు కేవ‌లం అద‌నపు ఆక‌ర్ష‌ణ‌గానే నిలిచారు. సినిమాలో ఎక్ప్‌పెక్టేష‌న్స్ ఎవ‌రెస్ట్ ప‌ర్ఫార్మెన్స్ వ‌రెస్ట్ అంటూ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది.

హీరోయిన్ క్యారెక్ట‌ర్స్ అలాగే సాగుతాయి. వివాన్, ప్రకాష్ రాజ్, అయ్యప్ప శర్మ తో పాటు చాలా పాత్రలు కనిపిస్తాయి. కానీ ఎవరికి పెద్దగా ప్రాధాన్యత లేదు. ఈశ్వరుడా సాంగ్ బాగుంది. కీరవాణి నేపథ్య సంగీతం హిస్టారికల్ సీన్స్ చక్కగా ఎలివేట్ చేసింది.

bimbisara నిజాయితీతో కూడిన ప్రయత్నం

త‌న పంథాకు భిన్నంగా కొత్త‌ద‌నాన్ని న‌మ్మి క‌ళ్యాణ్ రామ్ నిజాయితీగా చేసిన ప్ర‌య‌త్న‌మిది. స్ర్కీన్‌ప్లే, విజువ‌ల్స్ ప‌రంగా త‌ప్ప‌కుండా బింబిసార కొత్త అనుభూతిని పంచుతుంది. క‌ళ్యాణ్‌రామ్ యాక్టింగ్ కోసం ఈ సినిమా చూడొచ్చు

రేటింగ్: 3/ 5

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం