MEGA 156 Title: చిరంజీవి సోషియో ఫ్యాంటసీ మూవీ టైటిల్ ఇదే.. అద్భుతంగా కాన్సెప్ట్ వీడియో.. సినిమా రిలీజ్ అప్పుడే..
15 January 2024, 20:12 IST
- MEGA 156 Title - Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న 156వ సినిమా టైటిల్ ఫిక్స్ అయింది. సోషియో ఫ్యాంటసీ మూవీగా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు వశిష్ట. కాన్సెప్ట్ వీడియో వీఎఫ్ఎక్స్‌తో అదిరిపోయింది.
MEGA 156 Title: చిరంజీవి సోషియో ఫ్యాంటసీ మూవీ టైటిల్ ఇదే
MEGA 156 Title - Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న సోషియో ఫ్యాంటసీ మూవీ గురించి బిగ్ అప్‍డేట్ వచ్చింది. ఈ సినిమా టైటిట్ వెల్లడైంది. సంక్రాంతి సందర్భంగా నేడు (జనవరి 15) టైటిల్ ప్రకటన వచ్చింది. చిరంజీవికి ఇది 156వ మూవీ కావడంతో ఇంతకాలం ఈ ప్రాజెక్టును మెగా156గా పిలుస్తూ వచ్చారు. ఈ సినిమాకు ‘విశ్వంభర’ అనే టైటిల్‍ను మూవీ యూనిట్ ఖరారు చేసింది. బింబిసార ఫేమ్ వశిష్ట ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. విశ్వంభర సినిమా కాన్సెప్ట్ వీడియోను కూడా మూవీ యూనిట్ రిలీజ్ చేసింది.
విశ్వంభర సినిమా కాన్సెప్ట్ వీడియో గ్రాఫిక్స్‌తో అద్భుతంగా ఉంది. మూడు లోకాల మధ్య ఉండే కథతో ఈ మూవీ రూపొందనుందని ఈ వీడియో చూస్తే అర్థమవుతోంది. దేవ లోకంలో స్టార్ గుర్తు ఉండే చిన్న పేటిక లాంటిది.. లోకాలను దాటుతూ విశ్వంలో తిరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఓ గ్రహ శకలాన్ని తగిలి ఆ పేటిక ఓ చోట పడిపోతుంది. అప్పుడు అగ్ని లాంటిది ఎగిసిపడుతుంది. ఆ పేటిక తెరుచుకొని వెలుగు వస్తుంది. ఆ వెలుగులో నుంచి విశ్వంభర అనే టైటిల్ వచ్చింది. మూడు లోకాలు, పంచభూతాలు ఈ సినిమాలో ప్రధానంగా ఉండేలా కనిపిస్తున్నాయి.
మొత్తంగా విశ్వంభర కాన్సెప్ట్ వీడియో అత్యున్నత గ్రాఫిక్స్‌తో అదిరిపోయింది. సినిమాపై ఆసక్తిని మరిన్ని రెట్లు పెంచేసింది. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కాన్సెప్ట్ వీడియోలో బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్భుతంగా సాగింది.
రిలీజ్ అప్పుడే..
విశ్వంభర సినిమా వచ్చే ఏడాది 2025 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్టు ఈ వీడియోలోనే మూవీ టీమ్ వెల్లడించింది. “అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. 2025 సంక్రాంతికి కలుద్దాం” అంటూ రిలీజ్ గురించి హింట్ ఇచ్చింది. అంటే.. ఈ సంక్రాంతికి టైటిల్ రాగా.. సరిగ్గా ఏడాదికి ఈ మూవీ విడుదలవుతుందని చెప్పేసింది.
విశ్వంభర మూవీని యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. సుమారు రూ.150 కోట్లకు పైగా బడ్జెట్‍తో పాన్ ఇండియా రేంజ్‍లో ఈ మూవీ రూపొందనుంది. ఈ చిత్రంలో గ్రాఫిక్స్ ఎక్కువగా ఉంటుందని టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియోతోనే అర్థమవుతోంది.
విశ్వంభర చిత్రానికి వశిష్ట దర్శకత్వం వహిస్తుండగా.. సాయి మాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నారు. చోటా కే నాయుడు సినిమాటోగ్రఫీ చేయనున్నారు. కోటగిరి వెంకటేశ్వరరావు, సంతోష్ కామిరెడ్డి ఎడిటర్లుగా ఉన్నారు.
విశ్వంభర సినిమాలో ఇతర నటీనటుల వివరాలను టీమ్ ఇంకా వెల్లడించలేదు. అయితే, ఈ చిత్రంలో త్రిష ఫీమేల్ లీడ్ చేస్తారని తెలుస్తోంది. అలాగే, దగ్గుబాటి రానా కూడా కీలకపాత్ర పోషిస్తారని టాక్ బయటికి వచ్చింది. త్వరలోనే ఈ విషయాలపై స్పష్టత రానుంది.
చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమా గతేడాది సంక్రాంతికి వచ్చిన బ్లాక్‍బాస్టర్ హిట్ అయింది. బాబీ దర్శకత్వం వహించిన ఆ కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ భారీ వసూళ్లను దక్కించుకుంది. రవితేజ కూడా ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్ర చేశారు. అయితే, భోళా శంకర్ మాత్రం నిరాశపరిచింది. మెహల్ రమేశ్ తెరకెక్కించిన ఆ చిత్రం ఆకట్టుకోలేకపోయింది.