Mangalavaram Review: మంగళవారం మూవీ రివ్యూ - పాయల్ రాజ్‌పుత్ బోల్డ్ మూవీ ఎలా ఉందంటే?
17 November 2023, 8:29 IST
Mangalavaram Review: పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన మంగళవారం మూవీ శుక్రవారం థియేటర్లలో రిలీజైంది. ఆర్ 100 కాంబోలో తెరకెక్కిన ఈ మూవీ ఎలా ఉందంటే?
పాయల్ రాజ్‌పుత్
Mangalavaram Review: ఆర్ఎక్స్ 100 తర్వాత పాయల్ రాజ్‌పుత్, డైరెక్టర్ అజయ్ భూపతి కాంబినేషన్‌లో వచ్చిన మూవీ మంగళవారం. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీ పాన్ ఇండియన్ లెవెల్‌లో శుక్రవారం రిలీజైంది. చైతన్యకృష్ణ, శ్రీతేజ్ కీలక పాత్రలు పోషించారు. టైటిల్‌తోనే ఆడియెన్స్‌లో క్యూరియాసిటీ కలిగించిన మంగళవారం మూవీ ఎలా ఉంది? ఆర్ ఎక్స్ 100 స్థాయి హిట్‌ను పాయల్ రాజ్‌పుత్, డైరెక్టర్ అజయ్‌భూపతి ఈ సినిమా అందుకున్నారా? లేదా? అన్నది చూద్ధాం…
మహాలక్ష్మీపురం కథ...
మహాలక్ష్మీపురంలోని ఓ జంట మధ్య అక్రమ సంబంధం ఉందని ఊరి గోడలపై రాతలు కనిపిస్తాయి. ఆ జంట అనూహ్య పరిస్థితుల్లో చనిపోతారు. మరో జంట గురించి కూడా రాతలు కనిపించడం, వారు చనిపోవడంతో ఊరి ప్రజల్లో భయం మొదలవుతుంది. గ్రామదేవత మాలచ్చమ్మ జాతర జరిపించకపోవడమే ఈ మరణాలకు కారణమని ఊరి ప్రజలు భావిస్తారు.
ఈ మిస్టరీ మర్డర్స్ వెనుక ఏదో కుట్ర ఉందని ఎస్ఐ (నందితాశ్వేత)భావిస్తుంది. కానీ ఊరి జమీందారు ప్రకాశం (చైతన్య కృష్ణ) మాటలకు కట్టుబడి ఇమె ఇన్వేస్టిగేషన్‌కు ఎవరూ సరిగా సహకరించరు. ఆ హత్యలకు వెనుక ఉన్న మర్మం ఏమిటి? వారు చనిపోయారా? చంపబడ్డారా? ఈ హత్యలకు శైలుకు (పాయల్ రాజ్‌పుత్) సంబంధం ఉందా? మహాలక్ష్మీపురం నుంచి ఆమె వెలివేయబడటానికి కారణం ఏమిటి?
దెయ్యం రూపంలో ఊరిలో శైలు తిరుగుతోందని ఊరి ప్రజలు ఎందుకు భ్రమపడ్డారు? శైలు చిన్ననాటి ప్రియుడు రవి ఏమయ్యాడు? శైలుకు ఉన్న మానసిక సమస్యకు ఈ హత్యలకు ఏమైనా సంబంధం ఉందా? అన్నదే మంగళవారం సినిమా కథ.
మల్టీ జానర్ మూవీ....
మల్టీజానర్ మూవీగా మంగళవారం సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు అజయ్ భూపతి. సస్పెన్స్ థ్రిల్లర్, హారర్, రివేంజ్, తో పాటు ఓ మెసేజ్‌ను కూడా ఈ సినిమా ద్వారా ఆడియెన్స్‌కు అందించే ప్రయత్నం చేశాడు. చైల్డ్ అబ్యూజింగ్ అంశాలతో పాటు లవ్ స్టోరీని కూడా మిక్స్ చేశాడు. అన్ని జోనర్స్‌ను మిక్స్ చేస్తూ కంప్లీట్‌గా విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో చివరి వరకు ఎంగేజింగ్‌గా సినిమాను నడిపించాడు.
బోల్డ్ క్యారెక్టర్...
సెక్సువల్ డిజార్డర్ ప్రధానంగా మంగళవారం కథను రాసుకున్నాడు దర్శకుడు అజయ్ భూపతి. ఆ పాయింట్‌ను చూపించడం కోసమే పాయల్ రాజ్‌పుత్ పాత్రను పూర్తిగా బోల్డ్‌గా ఆవిష్కరించాడు. ఆ బోల్డ్ కంటెంట్ యూత్ ఆడియెన్స్‌ను అట్రాక్ట్ చేస్తాయి.
స్క్రీన్‌ప్లే హైలైట్...
మంగళవారం స్క్రీన్‌ప్లే విషయంలో దర్శకుడు తెలివిగా అడుగులు వేశారు. శైలు రవి మధ్య ప్రేమకథ, ఆమె తండ్రి రెండో పెళ్లి, చైల్డ్ అబ్యూజింగ్ లాంటి అంశాలతో సినిమాను మొదలుపెట్టారు. ఆ తర్వాత మహాలక్ష్మీపురంలో జరిగే హత్యలు, ఆ మిస్టరీని ఛేదించడానికి ఎస్ఐ చేసే ప్రయత్నాలతో ఫస్ట్ హాఫ్‌ను ఫన్, సస్పెన్స్‌తో ఉత్కంఠగా నడిపించారు. ప్రధాన పాత్రధారులందరిపై అనుమానం కలిగించేలా ఆ సీన్స్‌ను రాసుకున్న విధానం బాగుంది. ప్రథమార్థంలో పాయల్ రాజ్‌పుత్ క్యారెక్టర్‌ను చూపించకుండా సస్పెన్స్‌ను మెయింటేన్ చేశారు. సెకండాఫ్‌లో పాయల్ ఎంట్రీతోనే సినిమా ఆసక్తికరంగా మారుతుంది. శైలు ప్రేమకథ, ఆమెకున్న మానసిక సమస్యను చూపిస్తూనే ఈ హత్యల వెనుకున్న సస్పెన్స్‌ను రివీల్ చేయడం బాగుంది.
ఎమోషన్స్ మిస్...
మంగళవారం సినిమా కోసం ఓ బోల్డ్ పాయింట్‌ను ఎంచుకున్నాడు అజయ్ భూపతి. అదే ఈ సినిమాకు ప్లస్, మైనస్‌గా నిలిచింది. మితిమీరిన శృంగార కోరికలు అనే పాయింట్‌ను చూపించే విషయంలో కొన్ని సార్లు దర్శకుడు హద్దులు దాటిన ఫీలింగ్ కలుగుతుంది. ఆ బోల్డ్ సీన్స్ ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఇబ్బంది పెడతాయి. పాయల్ సమస్యకు ఊరిలో జరిగే హత్యలకు మధ్య ఉన్న ఎమోషనల్ కనెక్టివిటీ మిస్సయిన ఫీలింగ్ కలుగుతుంది. ఫస్ట్ హాఫ్ కథ లేకుండా టైమ్‌పాస్ చేశారు డైరెక్టర్.
పాయల్ ఛాలెంజింగ్ రోల్...
ఆర్ఎక్స్ 100 తర్వాత మరోసారి ఛాలెంజింగ్ రోల్‌లో పాయల్ రాజ్‌పుత్ కనిపించింది. పాయల్‌ను గ్లామరస్‌గా చూపిస్తూనే ఆమె నుంచి మంచి నటనను రాబట్టుకున్నాడు డైరెక్టర్ అజయ్ భూపతి. మంచి డైరెక్టర్ చేతిలో పడితే నటిగా తాను ఎలా చెలరేగుతుందో ఈ సినిమాతో పాయల్ ప్రూవ్ చేసింది. ఎస్ఐగా నందితా శ్వేత యాక్టింగ్ పర్వాలేదనిపిస్తుంది. అజయ్ ఘోష్ కామెడీ ఆకట్టుకుంటుంది. శ్రీతేజ్, చైతన్యకృష్ణ, రవీంద్ర విజయ్ తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు. ఈ సినిమాకు అజనీష్ లోకనాథ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, శివేంద్ర సినిమాటోగ్రఫీ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్‌గా నిలిచాయి.
యూత్‌ను మెప్పిస్తుంది....
మంగళవారం డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన మర్డర్ మిస్టరీ మూవీ. ట్విస్ట్‌లతో థ్రిల్లింగ్‌ను పంచుతూనే బోల్డ్ సీన్స్‌తో యూత్ ఆడియెన్స్‌ను ఈ సినిమా మెప్పించే అవకాశం ఉంది.
టాపిక్