kushi Movie Review: ఖుషి మూవీ రివ్యూ - విజయ్ దేవరకొండ, సమంత మూవీ ఎలా ఉందంటే?
01 September 2023, 12:19 IST
kushi Movie Review: విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఖుషి మూవీ సెప్టెంబర్ 1న (శుక్రవారం ) థియేటర్లలో రిలీజైంది. శివనిర్వాణ దర్శకత్వంలో రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీ ఎలా ఉందంటే...
సమంత, విజయ్ దేవరకొండ
kushi Movie Review: అర్జున్ రెడ్డి, గీతగోవిందం సినిమాలతో ట్రెండ్ సెట్టర్ సక్సెస్‌లను అందుకున్నాడు విజయ్ దేవరకొండ. మళ్లీ ఆ స్థాయి విజయం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తోన్న విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఈ శుక్రవారం (సెప్టెంబర్1న) ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. సమంత (Samantha) హీరోయిన్‌గా నటించిన ఈసినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించాడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. పవన్ ఐకానిక్ మూవీ టైటిల్‌తో రిలీజైన ఈ మూవీ ఎలా ఉంది? విజయ్ దేవరకొండ, సమంత తమ కెమిస్ట్రీతో అభిమానుల్ని అలరించారా? లేదా? అన్నది తెలియాలంటే కథలోని వెళ్లాల్సిందే...
మణిరత్నం అభిమాని కథ...
విప్లవ్ దేవరకొండ (విజయ్ దేవరకొండ) బీఎస్ఎన్ఎల్‌లో ఉద్యోగం వస్తుంది. మణిరత్నంపై అభిమానంతో పట్టుపట్టి కశ్మీర్‌లో పోస్టింగ్ వేయించుకుంటాడు. కశ్మీర్‌లోనే ఆరాబేగంతో (సమంత) తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. తప్పిపోయిన తన సోదరుడిని వెతుక్కుంటూ పాకిస్థాన్ నుంచి కశ్మీర్ వచ్చానని విప్లవ్‌తో అబద్దం చెబుతుంది ఆరా. అది నిజమని నమ్మి ఆరాకు సాయం చేయడానికి ముందుకొస్తాడు విప్లవ్. ఈ క్రమంలో విప్లవ్ మంచితనానికి ఫిదా అయినా ఆరాబేగం అతడిని ప్రేమించడం మొదలుపెడుతుంది.
ఆరాబేగం అసలు ఆరాధ్య అని, ఆమెది పాకిస్థాన్ కాదని కాకినాడ అనే నిజం విప్లవ్‌కు తెలుస్తుంది.తాను ప్రముఖ ప్రవచనకర్త చదరంగం శ్రీనివాసరావు ( మురళీశర్మ) కుమార్తెనని విప్లవ్‌తో చెబుతుంది ఆరాధ్య. విప్లవ్ తండ్రి లెనిన్ సత్యం నాస్తిక సంఘం ప్రెసిడెంట్‌గా పనిచేస్తుంటాడు. చందరంగం శ్రీనివాసరావు, లెనిన్ సత్యం మధ్య సిద్ధాంతపరమైన విభేదాలు ఉండటంతో విప్లవ్, ఆరాధ్య పెళ్లికి వారు ఒప్పుకోరు. జాతకాల ప్రకారం విప్లవ్, ఆరాధ్య పెళ్లి జరిగితే ఇద్దరి మధ్య గొడవలు వస్తాయని చందరంగం శ్రీనివాసరావు చెబుతాడు.
తమ పెళ్లితో ఆయన సిద్ధాంతాన్ని తప్పు అని నిరూపిస్తామని ఛాలెంజ్ చేసిన విప్లవ్, ఆరాధ్య రిజిస్టర్డ్ మ్యారేజీ చేసుకుంటారు. వారి పెళ్లి బంధం సాఫీగా సాగిందా? ఆరాధ్య తండ్రి చెప్పినట్లుగానే వారి మధ్య గొడవలు వచ్చాయా? విప్లవ్‌కు ఆరాధ్య ఎందుకు దూరమైంది? పిల్లల ప్రేమ కోసం చందరంగం శ్రీనివాసరావు, లెనిన్ సత్యం తమ సిద్ధాంతాల్ని పక్కన పెట్టారా? లేదా? అన్నదే(kushi Movie Review)ఈ సినిమా కథ.
ఆచారాలు, సంప్రదాయాలు...
నాస్తిక కుటుంబానికి చెందిన అబ్బాయి, సంప్రదాయాలకు, ఆచారాలకు పెద్దపీట వేసే బ్రహ్మణ కుటుంబంలో పుట్టిన ఓ అమ్మాయి ప్రేమ, పెళ్లి కథతో శివ నిర్వాణ ఖుషి పాయింట్‌ను రాసుకున్నారు. భిన్న మనస్తత్వాలు, అభిప్రాయాలు కలిగిన ఆ జంట తమ మధ్య ఎదురైన అపోహాల్ని, విభేదాల్ని పక్కనపెట్టి ప్రేమే గొప్పదని ఎలా నిరూపించారన్నది రొమాంటిక్‌గా ఈ సినిమాలో చూపించారు.
సున్నితమైన అంశాన్ని సీరియస్‌గా మెసేజ్ ఇస్తున్నట్లకుగా కాకుండా కంప్లీట్‌గా కామెడీ ప్రధానంగా లైటర్ వేలో ఖుషి సినిమాలో(kushi Movie Review) ఆవిష్కరించారు శివ నిర్వాణ.
కెమిస్ట్రీ ప్లస్...
విజయ్ దేవరకొండ, సమంత కెమిస్ట్రీని అందంగా చూపించడంపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టాడు డైరెక్టర్. ఫస్ట్ హాఫ్‌లో కశ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే లవ్ స్టోరీ సీన్స్ ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేస్తాయి. ఆ లవ్ సీన్స్‌ను అంతర్లీనంగా ఫన్‌ను జనరేట్ చేస్తూ టైమ్‌పాస్ చేశారు. ఆరాధ్య, విప్లవ్ పెళ్లితో ఫస్ట్‌హాఫ్‌ను ఎండ్ చేశాడు డైరెక్టర్...సెకండాఫ్‌లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చారు. చిన్న చిన్న విభేదాలకే ఆరాధ్య, విప్లవ్ గొడవలు పడి విడిపోవడం, వారి మధ్య సంఘర్షణ చుట్టూ కథ నడుస్తుంది. చివరకు వారి ప్రేమకు పెద్దలు ఎలా మారిపోయారనే రొటీన్ క్లైమాక్స్‌తో సినిమా(kushi Movie Review) ఎండ్ అవుతుంది.
డెప్త్ మిస్...
ప్రేమ, పెళ్లి బంధం గొప్పతనాన్ని తన ప్రతి సినిమాలో రియలిస్టిక్‌గా, బలంగా చూపిస్తుంటారు శివ నిర్వాణ. ఆ డెప్త్ ఈ సినిమాలో మిస్సయింది. కశ్మీర్ లవ్ ట్రాక్ నిడివి ఎక్కువైన ఫీలింగ్ కలుగుతుంది. సెకండాఫ్‌లో విజయ్, సమంత గొడవలు పడటం, విడిపోయే సీన్స్‌లో సిల్లీగా అనిపిస్తాయి. తమ కుటుంబం సిద్ధాంతాలే గొప్పవని నమ్మే చదరంగం శ్రీనివాసరావు, లెనిన్ సత్యం ఒక్కసారిగా మారిపోవడం కన్వీన్సింగ్‌గా అనిపించదు. కథలోనూ కొత్తదనం లేదు. ఈ పాయింట్‌తో తెలుగులో జోడీ నుంచి ఇటీవల వచ్చిన నాని అంటే సుందరానికి వరకు చాలా సినిమాలొచ్చాయి. అదే కథను మరోసారి చూసిన ఫీలింగ్ కలుగుతుంది. లెంగ్త్ కూడా ఎక్కువైన ఫీలింగ్ కలుగుతుంది.
కామెడీ బలం...
కామెడీనే ఈ సినిమాకుపెద్ద బలంగా నిలిచింది. ఫన్ కోసం దేశముదురు, అర్జున్‌రెడ్డి తో పాటు పలు సినిమాల్ని వాడుకున్నాడు. అవి బాగానే వర్కవుట్ అయ్యాయి.
విజయ్ యాక్టింగ్ అదుర్స్..
విప్లవ్ పాత్రలో విజయ్ దేవరకొండ సెటిల్డ్ యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. గత క్యారెక్టర్స్‌లోని అగ్రెసివ్ నెస్ ఛాయలు లేకుండా పక్కింటి కుర్రాడి తరహా పాత్రలో అతడి క్యారెక్టర్‌ను శివ నిర్వాణ చక్కగా డిజైన్ చేసుకున్నాడు. ఎమోషనల్ రోల్‌లో సమంత నటన బాగుంది. సిద్ధాంతాల కోసం ప్రాణమిచ్చే వ్యక్తులుగా మురళీశర్మ, సచిన్ ఖేడ్‌కర్ చక్కటి నటనను కనబరిచాడు. వెన్నెలకిషోర్, రాహుల్ రామకృష్ణ కామెడీ కూడా రిలీఫ్‌గా నిలిచింది.
ఈ సినిమాకు హీషమ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్‌గా నిలిచింది. ఆరాధ్య, ఖుషి టైటిల్ సాంగ్స్, వాటి పిక్చరైజేషన్ బాగున్నాయి.
kushi Movie Review -ఫ్యామిలీ ఆడియెన్స్ కోసం...
ఖుషి కథ, కథనాల విషయంలో కొత్తదనం లేకపోయినా విజయ్ దేవరకొండ, సమంత కెమిస్ట్రీ కోసం ఓ సారి చూడొచ్చు. ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఈ సినిమా మెప్పిస్తుంది.
రేటింగ్: 2.75/5