Krishna mukunda murari serial today january 31st: ముకుంద మీద అనుమానంతో నిలదీసిన ఆదర్శ్.. కృష్ణని పొగిడిన మురారి
31 January 2024, 7:11 IST
- Krishna mukunda murari serial today january 31: ముకుంద తన పక్కన పడుకోకపోవడంతో ఆదర్శ్ కి అనుమానం వస్తుంది. దీంతో ముకుందని గట్టిగా నిలదీయడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
కృష్ణ ముకుంద మురారి సీరియల్ జనవరి 31 వ ఎపిసోడ్
Krishna mukunda murari serial today january 31st: ఒకరి మీద ఇష్టం ప్రేమ ఉన్నాయని ప్రత్యేకించి చెప్పాలా? వాళ్ళ ప్రవర్తన, వాళ్ళకి ఇచ్చే విలువ బట్టి తెలిసిపోదా అని ముకుంద మురారిని అడుగుతుంది. తెలిసిపోతుంది కదా మళ్ళీ చెప్పుకోవడం అవసరమా అంటుంది. నిజమే కదా అని సుమలత మధుకర్ వాళ్ళని ఇరికయిస్తుంది. వీళ్ళు ఇంత బాగున్నారు కదా మరి ఆదర్శ్ రావడం కరెక్టేనా అని అక్క ఎందుకు అడిగిందని రేవతి ఆలోచిస్తుంది.
కృష్ణని ఆకాశానికి ఎత్తేసిన మురారి
మురారి చాప కింద వేసుకుని పడుకోవడం చూసి కృష్ణ ఎందుకు ఇలా చేస్తున్నారని బెడ్ మీద పడుకోమని చెప్తుంది. శోభనం అయ్యే వరకు బెడ్ మీద పడుకొనని చెప్తాడు. కృష్ణ మాత్రం అందుకు ఒప్పుకోదు. నీ నిర్ణయానికి ఫుల్ సపోర్ట్ ఇస్తానని చెప్తాడు. ఇది వరకులాగా బెడ్ మీద పడుకుంటానులే అంటుంది. నీ సంతోషం చూసుకోకుండా ముకుంద సంతోషం చూశావ్ నువ్వు సూపర్. ఇంట్లో అందరూ ఎన్ని మాటలు అన్నారు కానీ అవేమీ పట్టించుకోకుండా నన్ను కాపాడుతూ నిన్ను నువ్వు కాపాడుకుంటూ ఇంటిని చక్కదిద్దావని మెచ్చుకుంటాడు. ఇంట్లో అందరూ వద్దని అంటున్నా ఆదర్శ్ ని తీసుకొచ్చావ్ హ్యాట్సాప్. చాలా రోజుల తర్వాత పెద్దమ్మ కళ్లలో ఆనందం చూశాను. అంతా నీ వల్లే నీకు ఈ కుటుంబం రుణపడి ఉంటుందని పొగడ్తల్లో ముంచెత్తుతాడు.
మీ సపోర్ట్ లేకపోతే అవుట్ హౌస్ లో ఉండగలిగేదాన్నా, ఎప్పుడో బయటకి పంపించేవాళ్ళు. మీరు నాకు చాలా సపోర్ట్ ఇచ్చారని భర్తని మెచ్చుకుంటుంది. మురారి వద్దని చెప్తున్నా కూడా కృష్ణ మాత్రం బెడ్ మీద పడుకోవాలని చెప్తుంది. ఇన్నాళ్ళూ జరగనిది ఇప్పుడేం జరగదని అంటుంది. ఆదర్శ్ నిద్రలేచి పక్కన ముకుంద ఉందనుకుని చెయ్యి వేస్తాడు. తను లేకపోయేసరికి అప్పుడే నిద్రలేచిందా అని చూస్తాడు. బెడ్ పక్కన నేల మీద మరొక బెడ్ వేసి ఉంటుంది. అంటే ముకుంద కింద నిద్రపోయిందా? ఎందుకు నా పక్కన పడుకోలేదు రాత్రి వరకు బాగానే ఉంది కదా. ఇంతలోనే ఏమైంది అసలు ముకుంద మనసులో నేను ఉన్నానా లేదా అనుకుంటాడు.
ముకుందని అనుమానించిన ఆదర్శ్
ముకుంద అప్పుడే వస్తుంది. నిజంగానే నా మీద నీకు ఇష్టం ఉందా? మనస్పూర్తిగానే నన్ను ఇక్కడికి రప్పించావా? లేదంటే నన్ను ఇక్కడికి రప్పించడం కోసం ఇష్టం లేకపోయినా ఉన్నట్టు నటించావా? అని అడుగుతుంది. నేను ఈయనతో బాగానే ఉంటున్నాను కదా ఎందుకు అనుమానం వచ్చిందని అడుగుతుంది. ఎందుకంటే అని నేల మీద ఉన్న బెడ్ చూపిస్తాడు. మంచం ఉండగా నేల మీద పడుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీస్తాడు. ఇదా మీ అనుమానం ఇంకా మన శోభనం జరగలేదు కదా అప్పటి వరకు ఒకే మంచం మీద పడుకుంటే అరిష్టం అన్నారని నేను కింద పడుకున్నానని చెప్తుంది.
నిన్నా, మొన్న లేని అరిష్టం ఇప్పుడు ఎందుకు వచ్చిందని అడుగుతాడు. నేను అప్పుడు కూడా కిందే పడుకున్నా. అనవసరంగా ఏడేదో ఊహించుకుని మనసు పాడుచేసుకోవద్దు. నా మీద అసలు అనుమానం పెట్టుకోవద్దని చెప్తుంది. నా మీద నీకు ప్రేమ లేదని తెలిసి వెళ్ళిపోయిన వాడిని వచ్చాక కూడా నాతో నువ్వు నాకు దూరంగా ఉంటే అదే అభిప్రాయం ఉంటుంది కదా అంటాడు. అయితే మీ అభిప్రాయం మార్చుకోండి దూరంగా ఉండేది ప్రేమ లేక కాదని అంటుంది. మనసులో మాత్రం సోరి ఆదర్శ్ ఇష్టం లేకపోయినా ఉన్నట్టు అబద్ధం చెప్తున్నానని అనుకుంటుంది. సరే నమ్ముతాను కానీ శోభనం జరిగే వరకు ఒకే మంచం మీద పడుకుంటే అరిష్టమని నేను ఎక్కడ వినలేదే? కృష్ణ వాళ్ళకి కూడా శోభనం జరగలేదు కదా వాళ్ళు ఇలాగే పడుకుంటున్నారేమో పిలిచి అడుగుదామా అంటాడు.
ప్రేమ ఉందని అబద్ధం చెప్పిన ముకుంద
ఆదర్శ్ వాళ్ళ పరిస్థితి వేరు మన పరిస్థితి వేరు. వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒకటి అవ్వచ్చు దూరం అవుతారనే భయం లేదు. కానీ మన పరిస్థితి అలా కాదు మీరు వస్తారో లేదో తెలియదు. వచ్చినా నమ్ముతారో లేదో తెలియదు. అందుకే ప్రతి సంప్రదాయం ఫాలో అవాలని చూస్తున్నాను. అందులో ఇదొకటి అత్తయ్య ముహూర్తం పెడతారు కదా అప్పటి వరకు ఓపిక పట్టండి. మీరంటే ఇష్టం ఉందో లేదో మీకే తెలుస్తుందని అంటుంది. సరే నీకు ఏది మంచిదని అనిపిస్తే అదే చేయమని చెప్తాడు. రోజురోజుకీ అబద్ధాల మీద అబద్ధాలు చెప్తున్నాను. ఇలా చేస్తే ఆదర్శ్ నా మీద ఇష్టం పెంచుకుంటూ ఉంటాడు. నా బదులు వేరే అమ్మాయిని చేసుకున్నా సంతోషంగా ఉండేవాడు.
నేను ఎంత ప్రయత్నించినా నా మనసు మురారిని వదిలి రావడం లేదు. అలా అని నాకు ఇంత మేలు చేసిన కృష్ణ జీవితం నాశనం చేయలేను. నాకు ఏదో ఒక దారి చూపించమని మనసులోనే దేవుడిని వేడుకుంటుంది. అర్థం చేసుకోకుండా అనుమానించి ఉంటే సోరి అంటాడు. మురారి నిద్రపోతుంటే చూసుకుని కృష్ణ మురిసిపోతుంది. తనని బలవంతంగా నిద్రలేపుతుంది. కృష్ణని వెనుక నుంచి చూసి మురారి టెంప్ట్ అయిపోయి తనని పట్టుకోవాలని చూస్తాడు. ఖచ్చితంగా మురారి కృష్ణని పట్టుకుండామని అనుకునేలోపు కాఫీ కప్పు చేతిలో పెడుతుంది. మంచి ఛాన్స్ మిస్ అయ్యిందని అంటే అంత ఛాన్స్ ఇవ్వనులే అంటుంది.
కృష్ణ సర్ ప్రైజ్
చప్పుడు కూడా లేకుండా వచ్చాను కదా వెనుక కూడా కళ్ళు ఉన్నాయా అంటాడు. ముహూర్తం ఇంకా పెట్టలేదు దూరం దూరం అంటుంది. దూరంగా ఉంటే మీకోక సర్ ప్రైజ్ ఉందని చెప్తుంది. కింద అందరి ముందు చెప్తానని అంటే ఇంట్లో వాళ్ళు నేను ఒకటేనా అంటాడు. దీంతో చేసేది లేక తను ఇచ్చే సర్ ప్రైజ్ ఏంటో చెవిలో చెప్తానని దగ్గరకి రమ్మని పిలుస్తుంది. ఏం చెప్పకుండా చెవి మీద కొట్టి థ్రిల్ గా ఉంది కదా అని నవ్వి పారిపోతుంది.