తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kashmir Files | కశ్మీర్‌ ఫైల్స్‌ మూవీపై కాంగ్రెస్‌ Vs బీజేపీ.. మాటలయుద్ధం

Kashmir Files | కశ్మీర్‌ ఫైల్స్‌ మూవీపై కాంగ్రెస్‌ vs బీజేపీ.. మాటలయుద్ధం

Hari Prasad S HT Telugu

14 March 2022, 13:16 IST

google News
    • Kashmir Files | 1990లో జరిగిన కశ్మీరీ పండిట్ల ఊచకోత, తర్వాత వాళ్లు కశ్మీర్‌ వదిలి వెళ్లడం వంటి ఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమానే కశ్మీర్‌ ఫైల్స్‌. ఈ సినిమా ఇప్పుడు కాంగ్రెస్‌, బీజేపీ మధ్య మాటల యుద్ధానికి కారణమైంది.
కశ్మీర్ ఫైల్స్ మూవీలో నటించిన అనుపమ్ ఖేర్, పల్లవి ఘోష్ లతో డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి
కశ్మీర్ ఫైల్స్ మూవీలో నటించిన అనుపమ్ ఖేర్, పల్లవి ఘోష్ లతో డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి (PTI)

కశ్మీర్ ఫైల్స్ మూవీలో నటించిన అనుపమ్ ఖేర్, పల్లవి ఘోష్ లతో డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి

న్యూఢిల్లీ: వివేక్‌ అగ్నిహోత్రి తెరకెక్కించిన కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమా రాజకీయ రచ్చకు దారి తీసింది. కశ్మీరీ పండిట్ల ఊచకోతకు సంబంధించి నిజాలు ఇవీ అంటూ కేరళ కాంగ్రెస్‌ వరుస ట్వీట్లు చేయగా.. వాటికి బీజేపీ కౌంటర్‌ ఇచ్చింది. #KashmirFiles vs truth హ్యాష్‌ట్యాగ్‌తో కేరళ కాంగ్రెస్‌ వరుస ట్వీట్లలో వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. అయితే చరిత్రను కాంగ్రెస్‌ సరిగా అర్థం చేసుకోలేకపోయిందంటూ కేరళ బీజేపీ ఎంపీ కేఎల్‌ అల్ఫోన్స్‌ విమర్శించారు.

కశ్మీరీ పండిట్లు అక్కడ జీవించలేని పరిస్థితులు కల్పించారని ఆరోపించారు. ఇక ఈ కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమాకు చాలా వరకూ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పన్ను నుంచి కూడా మినహాయింపు ఇవ్వడం గమనార్హం. ఈ సినిమాను ప్రస్తావిస్తూ.. కేరళ కాంగ్రెస్‌ తన అధికారిక ట్విటర్‌ ద్వారా వరుస ట్వీట్లు చేసింది. కశ్మీరీ పండిట్లు కశ్మీరు లోయ వదిలి వెళ్లిన సమయంలో గవర్నర్‌గా ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన జగ్మోహనే ఉన్నారని, ఆయన డైరెక్షన్‌లోనే వాళ్లు కశ్మీర్‌ను వదిలి జమ్మూకి వెళ్లారని ఆరోపించింది. ఆ సమయంలో అధికారంలో ఉన్నది కూడా బీజేపీ మద్దతు ఉన్న వీపీ సింగ్‌ ప్రభుత్వమే అన్న విషయాన్ని గుర్తు చేసింది.

ఉగ్రవాదుల దాడి తర్వాత అక్కడి పండిట్లకు భద్రత కల్పించాల్సింది పోయి.. అప్పటి గవర్నర్‌ జగ్మోహన్‌ వారిని జమ్మూకి వచ్చేయాల్సిందిగా చెప్పారని ఆరోపించింది. ఆ సమయంలో రామ మందిర అంశాన్ని వాడుకొని దేశంలో హిందూ, ముస్లింల మధ్య విభేదాలు సృష్టించే పనిలో బీజేపీ ఉన్నదని, పండిట్ల అంశం బీజేపీకి ప్రచారానికి పనికొచ్చిందని కేరళ కాంగ్రెస్‌ మరో ట్వీట్‌లో విమర్శించింది.

1989లో వీపీ సింగ్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత నెల రోజులకే పండిట్ల వలసలు ప్రారంభమయ్యాయి. అయినా బీజేపీ ఏమీ చేయకుండా 1990 నవంబర్‌ వరకూ వీపీ సింగ్‌ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిందని ఆరోపించింది. కశ్మీరీ పండిట్ల కోసం కాంగ్రెస్‌ ఆధ్వర్యంలోని యూపీఏ ప్రభుత్వం ఏం చేసిందో కూడా వివరించింది. పండిట్ల అంశంలో బీజేపీది కేవలం మొసలి కన్నీరే అని, రెండుసార్లు కేంద్రంలో, ఒకసారి కశ్మీర్‌లో అధికారంలోకి వచ్చినా పండిట్లను తిరిగి అక్కడికి తీసుకెళ్లడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని విమర్శించింది.

దీనిపై బీజేపీ ఎంపీ అల్ఫోన్స్‌ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్‌ చరిత్రను సరిగా అర్థం చేసుకోలేకపోయిందని అన్నారు. అక్కడి కాంగ్రెస్‌ లేదా కాంగ్రెస్‌ మద్దతు ఉన్న ప్రభుత్వాల ఆధ్వర్యంలోనే లక్షన్నర మంది కశ్మీరీ పండిట్లు మతపరమైన హింస కారణంగా కశ్మీర్‌ లోయను వదిలి వెళ్లారని అల్ఫోన్స్‌ అన్నారు. పండిట్లు కశ్మీర్‌లో ఉండలేని పరిస్థితులను కాంగ్రెస్‌, దాని మిత్రపక్షాలు కల్పించాయని ఆరోపించారు. కశ్మీరీ పండిట్లను చంపారని, దీంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వాళ్లు వలస వెళ్లారని చెప్పారు. ఆర్టికల్‌ 370 ఎత్తేసిన తర్వాత కశ్మీర్‌లో పరిస్థితులు చాలా మెరుగుపడ్డాయని స్పష్టం చేశారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం