Jee Karda Web Series Review : తమన్నా నటించిన 'జీ కర్దా' వెబ్ సిరీస్ ఎలా ఉంది?
16 June 2023, 11:44 IST
- Jee Karda Web Series Review : ఈ మధ్యకాలంలో తమన్నా వెబ్ సిరీస్ లపై కూడా ఫోకస్ చేస్తోంది. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో నటించిన జీ కర్దా వెబ్ సిరీస్ జూన్ 15న విడుదలైంది. చిన్నప్పటి స్నేహితులు పెద్దయ్యాక.. తమ జీవితాల్లో ఏం జరుగుతుందో ఇందులో చూపించారు.
జీ కర్దా వెబ్ సిరీస్ రివ్యూ
నటీనటులు : తమన్నా, ఆశీమ్ గులాటీ, సుహైల్ నయ్యర్, అన్యా సింగ్, సయాన్ బెనర్జీ, సంవేదన, మల్హర్ టక్కర్, హుస్సేన్ దలాల్, తదితరులు, దర్శకత్వం : అరుణిమా శర్మ, హోమీ అదజనియా, నిర్మాత : దినేష్ విజయన్, సంగీతం : సచిన్-జిగార్, సినిమాటోగ్రఫీ : సచిన్
ఇటీవలి కాలంలో వెబ్ సిరీస్ ట్రెండ్ పెరిగిపోయింది. థియేటర్లలో సినిమా చూసినా.. చూడకున్నా.. మెుబైల్ లో వెబ్ సిరీస్ లు చూస్తున్నారు జనాలు. పెద్ద పెద్ద హీరోలు, హీరోయిన్లు సైతం.. వెబ్ సిరీస్ లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా నటించిన.. జీ కర్దా.. వెబ్ సిరీస్ అమెజన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. జూన్ 15న విడుదలైన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది?
లావణ్య సింగ్(తమన్నా), రిషబ్ రాథోడ్(సుహైల్ నయ్యర్), అర్జున్ గిల్(ఆశిమ్ గులాటీ), ప్రీత్(అన్యా సింగ్), షీతల్(సంవేదన), షాహిద్(హుస్సెన్ దలాల్), మెల్రాయ్(సయన్ బెనర్జీ) చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఏం పనులు చేసినా కలిసే చేస్తుంటారు. ఓ రోజు జ్యోతిష్యుడి దగ్గరకు వెళ్తారు. ఒక్కొక్కరి గురించి ఒక్కో పాయింట్ చెబుతాడు జ్యోతిష్యుడు. అతడు చెప్పిన విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. అయితే కొన్నేళ్ల తర్వాత.. ఈ బ్యాచ్ లో లావణ్య సింగ్, రిషబ్ రాథోడ్ ప్రేమించుకుంటారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. కానీ వారి జీవితంలో అనుకోని సంఘటన జరుగుతుంది. దీంతో ఇద్దరి జీవితాలు కష్టాల్లో పడతాయి. ఇలా వేర్వేరు కారణాలతో మిగతా ఫ్రెండ్స్ జీవితాలు కూడా కష్టాల్లో మెుదలవుతాయి. చివరకు వీరి జీవితాల్లో ఏం జరిగిందనేది కథ.
స్నేహితులు, వారి జీవితాల్లో కష్టాలు అనే కథాంశంతో చాలా సినిమాలు వచ్చాయి. ఆ పాయింట్ మీదే ఈ స్టోరీ కూడా నడుస్తుంది. ఇందులో కొత్తదనం ఏమీ లేదు. అయితే కొన్ని చోట్లు ఎమోషన్స్ బాగా ఉన్నాయి. ఈ కాలం పరిస్థితులు, మారిన మనుషుల మనస్తత్వాలకు తగ్గట్టుగా కొన్ని సీన్స్ బాగుంటాయి. అక్కడక్కడా బోరింగ్ కూడా అనిపిస్తుంది. స్లోగా వెళ్తుంది. ఇక ఇప్పుడు ఓటీటీలు అంటే బోల్డ్ కంటెంట్ అనేలా అయిపోతుంది. ఇందులో కూడా బోల్డ్ నెస్ జోడించారు. అవసరం అనుకున్న సీన్లలో అడల్ట్ కంటెంట్ కాస్త.. బాగానే పెంచేశారు.
మనుషుల్లో మానసిక సంఘర్షణ మెుదలైనప్పుడు ఎలా ఉంటారు? చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు చేసే ప్రయత్నాలు ఎలా ఉంటాయి? ప్రవర్తన ఎలా ఉంటుంది? అని చూపించారు. సినిమా ఎక్కువగా మానసిక సంఘర్షణ మీదనే ఉంటుంది. కొన్ని చోట్ల అటు ఇటు అనిపించినా.. కథన నడిపిన తీరు బాగుంది. అక్కడక్కడ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకుంటుంది.
లవ్, రొమాన్స్ బ్రేకప్స్, స్వలింగ సంపర్కం లాంటి అంశాలతో జీ కర్దా రూపొందించారు. ఎవరి జీవితమైనా అనుకున్నట్టుగా ఉండదు... అదే ఈ వెబ్ సిరీస్ కాన్సెప్ట్. ఎమోషన్స్ ను మాత్రం దర్శకులు చక్కగా చూపించారు. అయితే బోల్డ్ కంటెంట్, కొన్ని చోట్లు బూతు డైలాగ్స్ మాత్రం కాస్త ఇబ్బంది కలిగిస్తాయి. ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు చూసేందుకు ట్రై చేయండి.
ఇక ఈ వెబ్ సిరీస్ లో నటీనటులు చక్కగా నటించారు. ఎవరి పాత్రకు తగ్గట్టుగా వారు న్యాయం చేశారు. ఎమోషన్స్ తో ఉన్న స్టోరీలో.. బ్యాలెన్స్ గా నటించారు. ప్రధాన పాత్రలో కనిపించిన తమన్నా నుంచి.. చిన్న పాత్రల్లో నటించిన వారు కూడా న్యాయం చేశారు. ఈ స్టోరీకి నటీనటులే ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. సినిమాటోగ్రఫీ కూడా చక్కగా ఉంది.
నటీనటుల నటన, కెమెరా పనితనం, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ వెబ్ సిరీస్ కు బలం కాగా.. కొత్త దనం లేని కథ, అక్కడక్కడా బోరింగ్ సీన్స్ బలహీనతలు.