Itlu Maredumilli Prajaneekam : ఓటీటీలో ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం.. ఎప్పుడంటే
19 December 2022, 20:12 IST
- Itlu Maredumilli Prajaneekam OTT Release : అల్లరి నరేష్ హీరోగా నటించిన ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా ఓటీటీలో విడుదల అయ్యేందుకు సిద్ధమైంది. సందేశాత్మక కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం
అల్లరి నరేశ్(Allari Naresh), ఆనంది, వెన్నెల కిశోర్(Vennela Kishore) ప్రధాన పాత్రల్లో నటించిన ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం(Itlu Maredumill Prajaneekam) సినిమా నవంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భిన్న కథాంశంతో తెరకెక్కిన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం అనుకున్న విజయం సాధించలేకపోయింది. కానీ అల్లరి నరేశ్ ఎంచుకున్న కథను చాలామంది మెచ్చుకున్నారు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ(OTT)లో విడుదల అయ్యేందుకు సిద్ధమైంది. డిసెంబర్ 23 నుంచి ఈ చిత్రం జీ5లో స్ట్రీమింగ్ అవనుంది.
నాంది సక్సెస్ తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) హీరోగా నటించిన సినిమా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. కామెడీ పంథాకు భిన్నంగా మరోసారి సీరియస్ కథాంశాన్ని ఎంచుకొన్నాడు నరేష్. మెసేజ్ ఓరియెంటెడ్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాతో ఏ.ఆర్ మోహన్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆనంది, వెన్నెలకిశోర్, సంపత్‌రాజ్ కీలక పాత్రల్లో నటించారు.
కథ ఏంటంటే..
శ్రీనివాస్ (అల్లరి నరేష్) తెలుగు టీచర్‌గా ప్రభుత్వ ఉద్యోగం చేస్తుంటాడు. అన్యాయాల్ని సహించలేని మనస్తత్వం అతడిది. ఎన్నికల డ్యూటీ కోసం మారేడుమిల్లి గిరిజన ప్రాంతానికి వెళ్తాడు. ఆ ప్రాంతంలో విద్యా, వైద్యం లాంటి కనీస వైద్య సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటారు. గ్రామస్తుల సమస్యలను ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు పట్టించుకోరు.
తమ సమస్యలు తీరే వరకు ఓటింగ్‌లో పాల్గొనకూడదని ఆ ఊరి ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. అక్కడ వంద శాతం ఓటింగ్ జరపాలని శ్రీనివాస్‌ను కలెక్టర్ త్రివేది (సంపత్)ఆదేశిస్తాడు. తన మంచితనంతో ఊరి ప్రజలందరూ ఓటు వేసేలా ఒప్పిస్తాడు శ్రీనివాస్.
ఎన్నికలు సజావుగా సాగిన తర్వాత బ్యాలెట్ బాక్స్‌లతో తిరిగివెళ్తున్న అధికారులను కండా (శ్రీతేజ్) కిడ్నాప్ చేస్తాడు. అధికారులను కండా కిడ్నాప్ చేయడానికి కారణం ఏమిటి? ఆ కిడ్నాప్ వెనక ఎవరున్నారు? ఆ ఊరి ప్రజల సమస్యలను తీర్చడం కోసం శ్రీనివాస్ వేసిన ఎత్తు ఏమిటి? ఈ క్రమంలో అతడికి ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయనదే ఈ సినిమా కథ.