Inspector Rishi OTT Series Review: ఇన్‍స్పెక్టర్ రిషి రివ్యూ: నవీన్ చంద్ర మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ ఉత్కంఠభరితంగా ఉందా?
29 March 2024, 15:34 IST
- Inspector Rishi OTT Web Series Review: నవీన్ చంద్ర ప్రధాన పాత్ర పోషించిన మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇన్‍స్పెక్టర్ రిషి స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ఈ సిరీస్ థ్రిల్లింగ్‍గా ఆకట్టుకునేలా ఉందా అనేది ఈ రివ్యూలో తెలుసుకోండి.
Inspector Rishi OTT Series Review: ఇన్‍స్పెక్టర్ రిషి రివ్యూ: నవీన్ చంద్ర మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ ఉత్కంఠభరితంగా ఉందా?
వెబ్ సిరీస్: ఇన్‍స్పెక్టర్ రిషి, స్ట్రీమింగ్: అమెజాన్ ప్రైమ్ వీడియో (మార్చి 29 నుంచి, 10 ఎపిసోడ్లు)
ప్రధాన నటీనటులు: నవీన్ చంద్ర, సునైనా ఎల్లా, శ్రీకృష్ణ దయాల్, కన్నా రవి, మాలినీ జీవరత్నం, ఎలాంగో కుమారవేల్, అశ్వత్ చంద్రశేఖర్ తదితరులు
ఎడిటర్: సతీశ్ సూర్య, సంగీతం: అశ్వత్, డీవోపీ: భార్గవ్ శ్రీధర్
నిర్మాత: సుఖ్‍దేవ్ లహరి
క్రియేటర్, డైరెక్టర్: నందిని జేఎస్
Inspector Rishi Web Series Review: టాలెంటెడ్ నటుడు నవీన్ చంద్ర నటించిన సూపర్ నేచురల్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఇన్‍స్పెక్టర్ రిషి’ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‍కు వచ్చింది. తమిళంలో రూపొందిన ఈ సిరీస్ తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లోనూ అందుబాటులో ఉంది. ట్రైలర్‌తో మంచి బజ్ తెచ్చుకున్న ఈ సిరీస్ నేడు (మార్చి 29) అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ఈ సిరీస్ థ్రిల్లింగ్‍గా ఉత్కంఠభరితంగా ఉందా అనేది ఈ రివ్యూలో చూడండి.
ఇన్‍స్పెక్టర్ రిషి సిరీస్ కథ ఇదే
తమిళనాడులో తైంకాడు అటవీ ప్రాంతంలో ఒకే తీరులో వరుస హత్యలు జరుగుతుంటాయి. ఇన్‍స్పెక్టర్ రిషి (నవీన్ చంద్ర) ఈ కేసును దర్యాప్తు చేసేందుకు వస్తారు. ఇన్‍స్పెక్టర్లు అయ్యన్నార్ (కన్నా రవి), చిత్ర (మాలినీ జీవరత్నం) కూడా ఆయన టీమ్‍లో ఉంటారు. అటవీ అధికారులైన క్యాథీ (సునైనా ఎల్లా), సత్య నంబీషన్ (శ్రీకృష్ణ దయాల్), ఇర్ఫాన్ (కుమారవేల్) కూడా రిషికి ఈ కేసు దర్యాప్తులో సహకరిస్తారు. అయితే, వనరచ్చి అనే వనదేవత ఆ హత్యలను చేస్తోందని అందరూ నమ్ముతుంటారు. ఈ మిస్టరీని ఛేదించేందుకు రిషి దర్యాప్తు చేస్తుంటారు. ఈ హత్యలను మనుషులే చేశారని నమ్ముతుంటారు. వారిని వనరచ్చినే చంపిందా? లేకపోతే ఎవరైనా హత్యలు చేసి వనరచ్చిపై నెట్టారా? హత్యల వెనుక కారణాలు ఏంటి? ఈ మిస్టరీని రిషి ఛేదించాడా? అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? అనేవే ఇన్‍స్పెక్టర్ రిషి సిరీస్‍లో ముఖ్యమైన అంశాలుగా ఉన్నాయి.
కథనం ఇలా..
ఒకే తీరులో హత్యలు జరగడం.. వాటి వెనుక అదృశ్య శక్తి ఉందని అందరూ నమ్మడం.. ఆ హత్య కేసులను ఛేదించేందుకు పోలీస్ ఆఫీసర్లు ప్రయత్నించడం.. ఇలాంటి స్టోరీ లైన్‍తో ఇప్పటికే కొన్ని సినిమాలు, సిరీస్‍లు వచ్చాయి. ఇన్‍స్పెక్టర్ రిషి కూడా ఇదే కోవలోకి వస్తుంది. అయితే, ఈ సిరీస్‍లో క్రైమ్ థ్రిల్లర్‌కు హారర్ కూడా తోడైంది. ఈ సిరీస్ చాలా వరకు గ్రిప్పింగ్‍గా ఉంటూ ఎంగేజ్ చేస్తుంది. జానర్లు ఎక్కువగా ఉన్నా.. ఈ సిరీస్ సమతూకంతో ఉంటుంది. అన్ని అంశాలు సమపాల్లలో ఉండేలా మేకర్స్ జాగ్రత్త పడ్డారు.
ఇన్‍స్పెక్టర్ రిషి కథను పకడ్బందీగా రాసుకున్న డైరెక్టర్ నందినీ ఎస్‍జే.. దాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యారు. ప్రతీ ఎపిసోడ్‍కు లింక్ కూడా అర్థవంతంగా ఉండేలా రూపొందించారు. నరేషన్ ఎక్కువగా పక్కదోవ పట్టకుండా జాగ్రత్త పడ్డారు. ఓ పూజ తర్వాత కొందరు సామూహికంగా ఆత్మహత్య చేసుకునే సీక్వెన్స్‌తో ఈ సిరీస్ మొదలవుతుంది. ఆ తర్వాత కొన్నేళ్లకు అదే ప్రాంతంలో హత్యలు జరుగుతాయి. వీటిని రిషి, అతడి టీమ్ దర్యాప్తు చేయడం మొదలుపెడుతుంది. అక్కడి నుంచి ఇదే ట్రాక్‍లో సిరీస్ నడుస్తుంది. అయితే, రిషితో పాటు వారి టీమ్‍లోని ఇద్దరి వ్యక్తిగత జీవితం గురించి మధ్యమధ్యలో సీన్లు ఉన్నా.. మరీ ఎక్కువ కాకుండా వాటిని కూడా ఆసక్తికరంగానే మేకర్స్ చూపించారు. రిషిని వెంటాడే గతం కూడా ఇంట్రెస్టింగ్‍గానే ఉంటుంది.
ఈ హత్య కేసులను రిషి, అతడి టీమ్ దర్యాప్తు చేసే విధానాన్ని హడావుడిగా కాకుండా.. వివరంగా చూపించే ప్రయత్నం చేశారు మేకర్స్. ఏ విషయంలో అయినా లాజికల్, సైంటిఫిక్ అంశాలు ఉంటాయని రిషి భావిస్తుంటాడు. ఓ అరుదైన పురుగులు కూడా ఈ సిరీస్‍లో కీలకంగా ఉంటాయి. ఈ ఇన్వెస్టిగేషన్‍లో నమ్మకాలకు, లాజిక్‍లకు మధ్య సాగే సంఘర్షణ కూడా ఆసక్తికరంగానే ఉంటుంది. క్లైమాక్స్ కూడా ఇంట్రెస్టింగ్‍గానే సాగుతుంది. అయితే, హారర్ ఎలిమెంట్స్ మరీ భయపెట్టేలా ఉండవు.
ఊహించేలా ఉన్నా.. గ్రిప్పింగ్‍గా..
ఈ సిరీస్‍లో కొన్ని సీన్లు ముందుగానే ఊహించేలా సాగుతాయి. కథ సాగుతున్న కొద్ది హత్యలు చేసిందెవరన్నది కూడా కొందరికి అర్థం కావొచ్చు. ఒకవేళ ముందే ఊహించినా.. నరేషన్ గ్రిప్పింగ్‍గా ఉండడంతో ఈ సిరీస్ ఎక్కడా విసుగు తెప్పించదు. 10 ఎపిసోడ్లు ఉన్నా సస్పెన్స్‌ను ఫీలయ్యేలా చేస్తుంది. చివరి వరకు ఉత్కంఠను మెయిన్‍టెన్ చేయడంలో డైరెక్టర్ సఫలీకృతమయ్యారు. అయితే, ఆఖరిలో ఓ ఆసక్తికరమైన ప్రశ్నను అలాగే మిగిల్చారు. దీనికి రెండో సీజన్ కూడా వచ్చే అవకాశం ఉంది.
ఇన్‍స్పెక్టర్ రిషి సిరీస్‍కు అశ్వత్ బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కూడా ప్లస్ అయింది. కథకు తగ్గట్టే సంగీతం అందించాడు. ఫారెస్ట్ బ్యాక్‍డ్రాప్‍లో భార్గవ్ శ్రీధర్ కెమెరా వర్క్ కూడా బాగానే ఉంది. నైట్ సీన్లలోనూ కలర్ గ్రేడింగ్ మెరుగ్గానే ఉంది. ప్రొడక్షన్ వాల్యుస్ రిచ్‍గా ఉండడం కూడా ఈ సిరీస్‍కు ప్లస్‍గా ఉంది.
ఎవరెలా చేశారంటే..
ఇన్‍స్పెక్టర్ రిషిగా నవీన్ చంద్రకు ఫుల్ మార్క్స్ పడతాయి. సీరియస్, ఇంటెన్స్ రోల్‍గా ఆయన మెప్పించారు. అలాగే, గతం వెంటాడే సమయంలో ఎమోషనల్ సీన్లలోనూ బాగా చేశారు. ఆయన టీమ్‍లో ఉండే కన్నా రవి, మాలినీ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సునైనా ఎల్లా కూడా మెప్పించారు. శ్రీకృష్ణ దయాల్, కుమారన్ సహా మిగిలిన వారు తమ పరిధి మేర నటించారు.
మొత్తంగా..
ఇన్‍స్పెక్టర్ రిషి వెబ్ సిరీస్ కథ కొత్తది కాకపోయినా ఎంగేజింగ్‍గా సాగుతుంది. నిడివి ఎక్కువగా ఉన్నా.. విసుగు అనిపించదు. అక్కడక్కగా కథనం నెమ్మదించినా.. మళ్లీ తొందరగానే ట్రాక్ ఎక్కుతుంది. నిజాలు, నమ్మకాలకు మధ్య సంఘర్షణ ఇంట్రెస్టింగ్‍గా ఉంటుంది. ఇన్‍స్పెక్టర్ రిషి ఇన్వెస్టిగేషన్ ఉత్కంఠభరితంగానే ఉంటుంది. హారర్ అంశం ఎక్కువగా ఉండదు. ముందుగా చెప్పినట్టు కొన్ని సీన్లు ఊహలకు అందినా ఇంట్రెస్టింగ్‍గా చూసేలా ఉంటాయి. అయితే, ఈ సిరీస్ చివర్లో ఒకే సమాధానాన్ని మాత్రం ఇవ్వదు. ఈ సిరీస్‍లో హింసాత్మక, అభ్యంతరకర సన్నివేశాలు లేవు. ఈ వీకెండ్‍లో ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్‍ను తప్పకుండా చూసేయవచ్చు.
రేటింగ్: 3.25/5
టాపిక్