Indian Police Force OTT: చాలా దేశాల్లో టాప్-10లో ట్రెండ్ అవుతున్న వెబ్ సిరీస్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
21 January 2024, 18:06 IST
- Indian Police Force OTT Web Series: ఇండియన్ పోలీస్ ఫోర్స్ వెబ్ సిరీస్ దూసుకెళుతోంది. సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్ర పోషించిన ఈ సిరీస్ చాలా దేశాల్లో టాప్-10 ట్రెండింగ్‍లోకి వచ్చింది. వివరాలివే..
ఇండియన్ పోలీస్ ఫోర్స్ వెబ్ సిరీస్
Indian Police Force OTT Web Series: ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ వెబ్ సిరీస్ బాగా పాపులర్ అవుతోంది. బాలీవుడ్ స్టార్లు సిద్ధార్థ్ మల్హోత్రా, శిల్పా శెట్టి, వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సిరీస్ భారీగా వ్యూస్ దక్కించుకుంటోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో జనవరి 19వ తేదీన ఇండియన్ పోలీస్ ఫోర్స్ సీజన్ 1 వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‍కు వచ్చింది. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, ఉర్దూ సహా మరిన్ని భాషల్లోనూ స్ట్రీమ్ అవుతోంది. ఈ సిరీస్‍కు మంచి బజ్ ఉండడం, పాజిటివ్ స్పందన వస్తుండటంతో వ్యూస్‍లో దూసుకెళుతోంది.
ఇండియన్ పోలీస్ ఫోర్స్ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో దుమ్మురేపుతోంది. భారత్‍తో పాటు అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూఏఈ, సింగపూర్ సహా మరిన్ని దేశాల్లో ప్రస్తుతం టాప్-10లో ట్రెండ్ అవుతోంది. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ వెల్లడించింది. భారత్‍లో ప్రస్తుతం టాప్‍లో ఈ వెబ్ సిరీస్ ట్రెండ్ అవుతోంది.
ఇండియన్ పోలీస్ ఫోర్స్ వెబ్ సిరీస్‍పై సోషల్ మీడియాలో చాలా మంది నెటిజన్లు పాజిటివ్‍గా స్పందిస్తున్నారు. ఇంటెన్స్‌గా ఉన్న స్టోరీ, ఉత్కంఠగా ఉన్న డ్రామా సహా సిద్ధార్థ్ మల్హోత్రా, శిల్పా శెట్టి యాక్టింగ్‍ను ప్రశంసిస్తున్నారు. ఈ సిరీస్‍కు రోహిత్ శెట్టి, సుశ్వాంత్ ప్రకాశ్ దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్‍ను రోహిత్ శెట్టి క్రియేట్ చేసిన తీరుపై కూడా ప్రశంసలు వస్తున్నాయి.
ఈ సిరీస్‍లో సిద్ధార్థ్ మల్హోత్రా, శిల్పా శెట్టితో పాటు వివేక్ ఒబెరాయ్, మయాంక్ టాండన్, నితిన్ ధీర్, ఇషా తల్వార్, శ్వేత తివారీ, శరద కేల్కర్, వైదేహి పరశురామి, ముకేశ్ రిషి తదితరులు కీలకపాత్రలు పోషించారు. లిజో జార్జ్ - డీజే చీతాస్ సంగీతం అందించారు.
ఇదీ ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ సిరీస్ కథ
ఇండియన్ పోలీస్ ఫోర్స్ సీజన్ 1 వెబ్ సిరీస్ కథ ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్ల చుట్టూ తిరుగుతుంది. ఢిల్లీ వరుసగా బాంబు పేలుళ్లు జరుగుతాయి. ఈ పేలుళ్లకు కారణమైన ఉగ్రవాదులను పట్టుకునే బాధ్యతను ఢిల్లీ పోలీస్ స్పెషల్ యూనిట్ అఫీసర్లు కబీర్ మాలిక్ (సిద్ధార్థ్ మల్హోత్రా), విక్రమ్ భక్షి (వివేక్ ఒబెరాయ్) చేపడతారు. వారికి గుజరాత్ ఏటీఎస్ చీఫ్ తారా శెట్టి (శిల్పా శెట్టి) సాయం చేస్తుంది. నిందితులను పట్టుకునేందుకు ముగ్గురూ ఆపరేషన్ చేపడతారు. ఈ బాంబు పేలుళ్ల వెనుక ఉన్న మాస్టర్ మైండ్ హైదర్ అలియాజ్ జరార్ (మయాంక్ టాండన్) అని గుర్తిస్తారు. అతడిని పట్టుకోవాలని ప్రయత్నిస్తారు. పోలీసులకు ఉగ్రవాదులకు పోరు ఎలా జరిగింది? జరార్‌ను కబీర్ మాలిక్ టీమ్ పట్టుకుందా.. అనేదే మిగిలిన కథగా ఉంది.
ఇండియన్ పోలీస్ ఫోర్స్ వెబ్ సిరీస్‍లో ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లు ఎక్కువగా ఆకట్టుకుంటాయి. ఉగ్రవాదులను పట్టుకునేందుకు పోలీసులు చేసే ప్లానింగ్ కూడా ఇంట్రెస్టింగ్‍గా సాగుతుంది. అయితే, నరేషన్ మరీ కొత్తగా ఏం అనిపించదు. అయితే, ఆద్యంతం ఉత్కంఠగా సాగుతుంది ఈ సిరీస్. ఇండియన్ పోలీస్ ఫోర్స్ వెబ్ సిరీస్‍లో మరిన్ని సీజన్లు వచ్చే అవకాశం ఉంది.