Angelina Jolie | యుద్ధం వేళ ఉక్రెయిన్‌లో ప్రత్యక్షమైన హాలీవుడ్ స్టార్ హీరోయిన్
01 May 2022, 14:47 IST
- యుద్ధంతో అతలాకుతలమవుతున్న ఉక్రెయిన్‌లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఏంజెలినా జోలీ ప్రత్యక్షమైంది. అక్కడి ఓ నగరంలో పర్యటించి యుద్ధం వల్ల ప్రభావితమైన వారితో మాట్లాడింది.
ఉక్రెయిన్ లోని లెవివ్ నగరంలోని స్థానికులతో మాట్లాడుతున్న ఏంజెలినా జోలీ
కీవ్: హాలీవుడ్ స్టార్ హీరోయిన్, మానవతావాది అయిన ఏంజెలినా జోలీ శనివారం ఉక్రెయిన్ నగరమైన లెవివ్కు వెళ్లింది. ఆ దేశ పశ్చిమ భాగంలో ప్రధాన నగరమిది. యుద్ధం కారణంగా ప్రభావితమై లెవివ్‌లో ఆశ్రయం పొందుతున్న వారిని కలవడానికే ఆమె అక్కడికి వచ్చినట్లు నగర్ గవర్నర్ మాక్సిమ్ కోజిట్స్కీ చెప్పారు. 2011 నుంచి యునైటెడ్ నేషన్స్ హైకమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ తరఫున శరణార్థుల ప్రత్యేక రాయబారిగా పనిచేస్తోంది.
యుద్ధం వేళ ఆమె ఇలా తమ నగరాన్ని సందర్శిస్తుందని ఊహించలేదని మాక్సిమ్ అన్నారు. లెవివ్ నగరంలో ఏంజెలినా పర్యటనకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆమె ఉక్రెయిన్ను సందర్శించడం చాలా మందిని ఆకట్టుకుంది. యుద్ధం కారణంగా అన్నీ కోల్పోయి శరణార్థులుగా మిగిలిన వారితో ఏంజెలినా మాట్లాడింది.
అంతేకాదు క్రామాటోర్స్క్ రైల్వే స్టేషన్ దాడిలో గాయపడిన చిన్నారులు చికిత్స పొందుతున్న హాస్పిటల్‌ను కూడా ఏంజెలినా సందర్శించింది. అక్కడి ఓ కాఫీ షాప్‌కు ఆమె వెళ్లిన వీడియో కూడా ఒకటి ఫేస్బుక్లో కనిపించింది. ఈ సందర్భంగా తన దగ్గరికి వచ్చి ఆటోగ్రాఫ్‌లు అడిగిన అభిమానులతో ఆమె ఫొటోలు కూడా దిగింది. గత నెలలో యుద్ధం కారణంగా అతలాకుతలమైన మరో దేశం యెమెన్‌లోనూ ఆమె పర్యటించింది.
టాపిక్