Guntur Karam: గుంటూరుకారం మూవీకి ఫేక్ రేటింగ్ - సైబర్ క్రైమ్ పోలీసులకు నిర్మాత కంప్లైంట్
15 January 2024, 9:34 IST
Guntur Karam: గుంటూరు కారం మూవీపై బుక్ మై షో యాప్‌లో ఫేక్ రేటింగ్ ఇస్తోన్న వారిపై నిర్మాత సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు బుక్‌మై షోలో దాదాపు 0.10 రేటింగ్ వోట్స్ దాదాపు 70 వేల వరకు వచ్చినట్లు సమాచారం.
గుంటూరు కారం మూవీ
Guntur Karam: మహేష్ బాబు గుంటూరు కారం మూవీపై నెగెటివ్ ప్రచారం చేస్తోన్న వారిపై నిర్మాత సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. టికెట్స్ బుకింగ్ యాప్ బుక్ మై షోలో ఈ సినిమాకు 0/10 రేటింగ్‌ను దాదాపు 70 వేల మంది వరకు ఇచ్చారు. జీరో రేటింగ్ ఇచ్చి నెగెటివ్ ప్రచారం చేస్తున్నవారిపై నిర్మాత పోలీసులకు ఫిర్యాదు చేయబోతున్నట్లు సమాచారం.
సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు...
సోమవారం నిర్మాతతో పాటు సినిమా టీమ్ సైబర్ క్రైమ్ పోలీసులను కలిసి నెగెటివ్ ప్రచారం చేస్తున్న వారిపై చర్యలను తీసుకోవాలని కంప్లైంట్ ఇవ్వబోతున్నట్లు చెబుతున్నారు. ఈ జీరో రేటింగ్ కారణంగా సినిమాకలెక్షన్స్ భారీగా తగ్గే అవకాశం ఉన్నట్లు సినిమా యూనిట్ భావిస్తోన్నట్లు సమాచారం.
కొంతమంది కావాలనే గుంటూరు కారం మూవీపై దుష్ఫ్రచారం చేస్తున్నారని ఈ ఫిర్యాదులతో పేర్కొననున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో గుంటూరు కారం మూవీపై నెగెటివ్ కామెంట్స్, ట్రోల్స్ చేస్తున్న వారిపై కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకున్నట్లు తెలుస్తోంది.
మిక్స్‌డ్ టాక్ ఉన్నా...
గుంటూరు కారం తొలి ఆట నుంచే మిక్స్‌డ్ టాక్ వచ్చిన వసూళ్లలో మాత్రం దూసుకుపోతుంది. రెండు రోజుల్లోనే 98 కోట్ల గ్రాస్‌ను...60 కోట్లకుపైగా షేర్ కలెక్షన్స్ రాబట్టింది.ఓవర్‌సీస్‌లో మూడు రోజుల్లోనే రెండు మిలియన్ల మార్క్‌ను అందుకొని రికార్డ్ క్రియేట్ చేసింది. వరుసగా ఐదు సార్లు ఈ రికార్డును అందుకున్న ఏకైక తెలుగు హీరోగా మహేష్ రికార్డ్ క్రియేట్ చేశారు.
ఆదివారం రోజు కూడా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో పదిహేను కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 130 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో గుంటూరు కారం మూవీ రిలీజైంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకో యాభై కోట్లకుపైనే కలెక్షన్స్ రావాల్సివుంది. అయితే హనుమాన్ మినహా మిగిలిన సంక్రాంతి సినిమాలకు నెగెటివ్ టాక్ రావడం హనుమాన్‌కు కలిసివచ్చే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి.
మహేష్ మాస్ పర్ఫార్మెన్స్...
గుంటూరు కారం మూవీకి త్రివిక్రమ్ దర్శకత్వం వహించాడు. అతడు, ఖలేజా తర్వాత దాదాపు పదమూడేళ్ల గ్యాప్ తర్వాత మహేష్‌బాబు, త్రివిక్రమ్ కలిసి చేసిన మూవీ ఇది. తల్లీకొడుకుల అనుబంధానికి మాస్ యాక్షన్ అంశాలను జోడించి త్రివిక్రమ్ ఈ మూవీని తెరకెక్కించాడు.
ఇందులో మహేష్‌బాబు అటిట్యూడ్, క్యారెక్టరైజేషన్‌తో పాటు మాస్ ఫర్ఫార్మెన్స్ అభిమానులను ఆకట్టుకుంటోంది. డ్యాన్సుల్లో ఇరగదీశాడని కామెంట్స్ చేస్తున్నారు. త్రివిక్రమ్ కథలో బలం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రొటీన్ స్క్రిప్ట్‌తో ఈ సినిమా చేశాడని, అతడి డైలాగ్స్‌లో పసలేదనే ఫైర్ అవుతోన్నారు.
శ్రీలీల...
గుంటూరు కారం మూవీలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ, జయరాం కీలక పాత్రలు పోషించారు. గుంటూరుకారం సినిమాను హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ నిర్మించారు. తమన్ సంగీతాన్ని అందించాడు. గుంటూరు కారం ఓటీటీ హక్కులు నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. గుంటూరు కారం తర్వాత దిగ్గజ దర్శకుడు రాజమౌళితో యాక్షన్ అడ్వెంచర్ మూవీ చేయబోతున్నాడు మహేష్ బాబు.