తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Movie Songs Of Gaddar: సినిమా పాటలతోనూ ఉద్యమాలను ఉరకలెత్తించిన గద్దర్.. ప్రాచుర్యం పొందిన పాటలు ఇవే

Movie songs of Gaddar: సినిమా పాటలతోనూ ఉద్యమాలను ఉరకలెత్తించిన గద్దర్.. ప్రాచుర్యం పొందిన పాటలు ఇవే

06 August 2023, 18:19 IST

google News
    • Movie songs of Gaddar: ప్రజా గాయకుడు గద్దర్ కొన్ని సినిమాల్లోనూ పాటలు పాడారు. గీతాలు రచించారు. వాటిలో అత్యధికంగా ప్రాచుర్యం పొందినవి ఏవో ఇక్కడ చూడండి.
గద్దర్ (ఫైల్ ఫొటో)
గద్దర్ (ఫైల్ ఫొటో)

గద్దర్ (ఫైల్ ఫొటో)

Movie songs of Gaddar: ప్రజా గాయకుడు గద్దర్ (74) కన్నుమూశారు. హైదరాబాద్‍లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం (ఆగస్టు 6) కన్నుమూశారు. తన పాటలతో, రచనలతో పీపుల్స్ వార్ నుంచి తెలంగాణ ఉద్యమం వరకు ప్రజల్లో చైతన్యం రగిలించారు గద్దర్. తన కలం, గలంతో ఉద్యమాలను ఉరకలెత్తించారు. చాలా గీతాలతో ప్రజల్లో ఉద్యమస్ఫూర్తిని, పోరాట శక్తిని తట్టి లేపారు. కొన్ని సినిమాలకు కూడా గద్దర్ పాటలను అందించారు. వాటిలోనూ చైతన్య గీతాలే ఎక్కువ. ప్రజల్లోకి ఉద్యమ కాంక్ష చొచ్చుకెళ్లేలా.. అదే క్రమంలో ఉర్రూతలూగించేలా గీతాలను అందించారు. అలా సినిమాల కోసం గద్దర్ రాసి.. ప్రాచుర్యం పొందిన కొన్ని పాటల గురించి ఇక్కడ చూడండి.

1979 సంవత్సరంలో ‘మాభూమి’ సినిమాలో ‘బండెనక బండి కట్టి.. పదహారు బండ్లు కట్టి’ అనే పాట పాడారు గద్దర్. నిజాం పాలకుల దురాగతాలను వివరించారు. ప్రజలు ఉద్యమించాలంటూ ఆ పాటతో పిలుపునిచ్చారు. ఆ ఒక్క పాట నిజాం వ్యతిరేక ఉద్యమానికి మరింత ఊపు తెచ్చింది. గ్రామగ్రామాన ప్రాచుర్యం పొందింది. ప్రజల్లో ఉద్యమ కాంక్షను రగిల్చింది. అంతకు ముందు 1971లోనే ‘ఆపరా రిక్షా’ చిత్రంలో ఓ పాట రాశారు గద్దర్. ఆ తర్వాత గద్దర్ పేరుతో తన మొదటి ఆల్బమ్ చేశారు. గుమ్మడి విఠల్ రావుగా ఉన్న ఆయన పేరు ఈ ఆల్బమ్ తర్వాతే ‘గద్దర్’గా మారింది.

1995లో ‘ఒరేయ్ రిక్షా’ సినిమా కోసం ‘మల్లె తీగకు పందిరి వోలె’ (నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా) అంటూ సెంటిమెంట్ పాట రాశారు గద్దర్. చెల్లెలిపై అన్నకు ఉన్న మమకారాన్ని తన అందమైన మాటలతో ఆవిష్కరించారు. ఈ పాటను వందేమాతరం శ్రీనివాస్ పాడారు. అదే చిత్రంలో మరిన్ని పాటలు కూడా రాశారు గద్దర్. మల్లె తీగకు పందిరి వోలే పాటకు గాను గద్దర్‌కు నంది అవార్డు వచ్చింది. అయితే, ఆయన దాన్ని తిరస్కరించారు.

2011లో ‘జై బోలో తెలంగాణ’ సినిమా కోసం గద్దర్ రచించి, పాడిన ‘పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా.. పోరు తెలంగాణమా’ పాట ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ఉరకలెత్తించింది. అప్పటికే ఉద్యమం ఉద్ధృతంగా సాగుతుండగా.. దానికి గద్దర్ గీతం మరింత ఊపు తీసుకొచ్చింది. తెలంగాణలో వాడవాడలా ఈ పాటే వినిపించింది. తెలంగాణ ఉద్యమంలో ఈ పాట కీలక పాత్ర పోషించింది. ఆ ఏడాది ఈ పాటకు కూడా నంది అవార్డు దక్కించుకున్నారు గద్దర్.

గద్దర్ భౌతికంగా ఈ లోకాన్ని విడిచినా పాటగా.. ఉద్యమస్ఫూర్తిగా అందరి మదిలోనూ ఉంటారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం