Tollywood | తెలుగు తెరపై విదేశీ అందాలు
11 April 2022, 10:06 IST
ప్రస్తుతం తెలుగు తెరపై పలువురు విదేశీ కథానాయికలు సందడి చేయబోతున్నారు. తమ గ్లామర్, అభినయ ప్రతిభతో టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఓలివియా మోరీస్
తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచవ్యాప్తం అవుతోంది. బాహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్ చిత్రాలు విదేశాల్లో అద్వితీయ ఆదరణను సొంతం చేసుకున్నాయి. ఇండియన్ సినిమాకు టాలీవుడ్ కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. తెలుగు సినిమాల్లో భాగమయ్యేందుకు విదేశీ నటీనటులు, సాంకేతిక నిపుణులు ఆసక్తిని చూపుతున్నారు. పలువురు విదేశీ ముద్దుగుమ్మలు హీరోయిన్లుగా సందడి చేయబోతున్నారు. ఇటీవలే విడుదలైన రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రంతో బ్రిటీష్ కథానాయిక ఒలివియా మోరిస్ ఆకట్టుకున్నది.
‘ఆర్ఆర్ఆర్’ లో ఒలివియా మోరిస్
భారతీయ సినిమా గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెబుతోంది ‘ఆర్ఆర్ఆర్’. పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా రాజమౌళి తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా వెయ్యి కోట్ల వసూళ్లను సాధించింది. ఇండియాలోనే కాదు ఓవర్‌సీస్‌లోనూ రికార్డు కలెక్షన్స్ రాబడుతోంది. ఈ పాన్ ఇండియన్ సినిమాలో తెలుగు, తమిళం, హిందీ నటీనటులతో పాటు ఫారిన్ యాక్టర్స్ కీలక పాత్రలను పోషించారు. ఎన్టీఆర్ సరసన బ్రిటన్ ముద్దుగుమ్మ ఒలివియా మోరిస్‌ను కథానాయికగా తీసుకున్నారు రాజమౌళి. హోటల్ పోర్టోఫినో, ది హెడ్ సిరీస్‌లతో బ్రిటీష్ ప్రేక్షకులకు చేరువైన ఒలివియా ‘ఆర్ఆర్ఆర్’ లో చక్కటి నటనతో మెప్పించింది. అందంతో పాటు మంచి మనసున్న బ్రిటీష్ యువతిగా ఆమె పాత్రను రాజమౌళి విభిన్నంగా వెండితెరపై ఆవిష్కరించారు. ‘ఆర్ఆర్ఆర్’ సక్సెన్‌ను ఎంజాయ్ చేస్తోంది ఒలివియా. ఈ సినిమాతో ఎన్టీఆర్‌కు అభిమానిగా మారిపోయానంటూ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఈ సినిమాలో ఒలీవియాతో పాటు ఐరీష్ యాక్టర్స్ రే స్టీవెన్‌సన్, అలిసన్ డూడీ కీలక పాత్రలను పోషించారు. నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రలో విలక్షణ అభినయంతో ఆకట్టుకున్నారు.
నాగశౌర్యకు జోడీగా న్యూజిలాండ్ భామ
నాగశౌర్య హీరోగా నటిస్తున్న ‘కృష్ణవ్రింద విహారి’ సినిమాతో న్యూజిలాండ్ సుందరి షిర్లే సేతియా టాలీవుడ్‌లో అరంగేట్రం చేస్తోంది. సింగర్ గా కెరీర్‌ను ప్రారంభించిన ఆమె ఆపై నటనవైపు అడుగులు వేసింది. బాలీవుడ్‌లో మస్కా అనే సినిమా చేసింది. కృష్ణవ్రింద విహారిలో మోడ్రన్ యువతిగా ఆమె కనిపించబోతున్నది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రానికి అనీశ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.
తెలుగు తెరపై ఉక్రెయిన్ భామ
తమిళంలో డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో సినిమాలు చేస్తూ వైవిధ్యతను చాటుకుంటున్నారు హీరో శివకార్తికేయన్. ‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ దర్శకత్వం వహిస్తున్న సినిమాతో శివకార్తికేయన్ తెలుగులోఎంట్రీఇవ్వబోతున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఇందులో శివకార్తికేయన్ జోడీగా ఉక్రెయిన్ సుందరి మారియా ర్యాబోషప్కా హీరోయిన్‌గా నటిస్తోంది. పలు ఉక్రెయిన్ సినిమాల్లో నటించిన ఆమె స్పెషల్ ఓప్స్ వెబ్ సిరీస్ తో బాలీవుడ్‌తో తొలి అడుగు వేసింది. శివకార్తికేయన్ సినిమాతో ఇప్పుడు సౌత్ లోకి ఎంట్రీ ఇస్తోంది.
హాలీవుడ్ సాంకేతిక నిపుణుల ముద్ర
ప్రస్తుతం తెలుగు సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతుండటంతో వీటిలో భాగమయ్యేందుకు నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులు ఆసక్తిని చూపుతున్నారు. పుష్ప సినిమాలో శేషాచలం కొండలను, అక్కడి అందాలను రియలిస్టిక్‌గా చూపించి విజయంలో కీలకభూమిక పోషించారు సినిమాటోగ్రాపర్ మిరోస్లా క్యూబా బ్రోజెక్. పోలాండ్‌కు చెందిన మిరోస్లా పలు అంతర్జాతీయ చిత్రాలకు కెమెరామెన్ గా పనిచేశారు. నాని హీరోగా నటించిన గ్యాంగ్‌లీడర్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు మిరోస్లా. మహానటి సినిమాకు స్పెయిన్ కు చెందిన డానీ సాంచెజ్ లోపెజ్ సినిమాటోగ్రఫీ అందించారు. పీరియాడికల్ లుక్‌ను సహజంగా ఆవిష్కరించి ఆకట్టుకున్నారు. ప్రస్తుతం రానా హీరోగా నటిస్తున్న విరాటపర్వం సినిమాకు ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.
సినిమాటోగ్రాఫర్స్ మాత్రమే కాదు పలువురు యాక్షన్ కొరియోగ్రాఫర్స్ టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు.
సమంత హీరోయిన్‌గా నటిస్తున్న యశోద చిత్రానికి హాలీవుడ్ స్టంట్ మాస్టర్ యానిక్‌బెన్ యాక్షన్ సీక్వెన్స్ సమకూర్చుతున్నారు.ఇటీవలే సమంతపై యానిక్ బెన్ ఆధ్వర్యంలో భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను తెరకెక్కించారు. హరిహరవీరమల్లు సినిమాకు బల్గేరియన్ స్టంట్ మాస్టర్ టోడోర్ లజరోవ్ యాక్షన్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ కు బ్యాట్ మెన్ ఫేమ్ నిక్ పావెల్ స్టంట్స్ డిజైన్ చేశారు. రాధేశ్యామ్ చిత్రానికి ఆయన పనిచేశారు. అలాగే స్టోవల్, రిమ్‌బర్గ్(గని), అండీ లాంగ్ లైగర్ సినిమాకు స్టంట్ మాస్టర్ గా పనిచేశారు. వీరితో పాటు పలువురు యాక్షన్ కొరియోగ్రాఫర్స్ తెలుగు సినిమాలకు పనిచేస్తున్నారు