Farhana Movie Review: ఫర్హానా మూవీ రివ్యూ - ఐశ్వర్యరాజేష్, సెల్వరాఘవన్ మూవీ ఎలా ఉందంటే?
08 July 2023, 6:31 IST
Farhana Movie Review: ఐశ్వర్య రాజేష్, సెల్వరాఘవన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఫర్హానా మూవీ సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ మూవీకి నెల్సన్ వెంకటేషన్ దర్శకత్వం వహించాడు.
ఫర్హానా మూవీ
Farhana Movie Review: లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో తమిళంలో కథానాయికగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నది ఐశ్వర్యరాజేష్(Aishwarya Rajesh). ఆమె హీరోయిన్‌గా నటించిన ఫర్హానా మూవీ సోనీలివ్(Sony Liv) ఓటీటీలో తెలుగు, తమిళ భాషల్లో రిలీజైంది.
థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ సినిమాకు నెల్సన్ వెంకటేషన్ దర్శకత్వం వహించాడు. జీతన్ రమేష్, సెల్వరాఘవన్ (Selvaraghavan) ప్రధాన పాత్రలు పోషించారు. సొసైటీలోని ఓ కరెంట్ ఇష్యూను తీసుకొని తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందంటే...
ఫర్హానా కథ...
ఫర్హానా ( ఐశ్వర్య రాజేష్) సంప్రదాయాలకు విలువనిచ్చే కుటుంబంలో జన్మిస్తుంది. పెళ్లై ముగ్గురు పిల్లలు ఉంటారు. జాబ్ చేయాలనే కోరిక ఉన్న ఫ్యామిలీ కట్టుబాట్ల కారణంగా ఆమె కల తీరదు. ఫర్హానా భర్త కరీమ్ (జీతన్ రమేష్) చెప్పుల షాప్ సరిగా నడవదు. పిల్లల స్కూల్ ఫీజు కూడా కట్టడం కష్టమైపోతుంది. కుటుంబ భారాన్ని మోయడం కోసం తండ్రికి ఇష్టలేకపోయినా ఫర్హానా ఉద్యోగం చేయాలని ఫిక్స్ అవుతుంది. స్నేహితురాలి సహాయంతో ఓ కాల్ సెంటర్‌లో జాయినవుతుంది.
సాలరీ ఎక్కువ వస్తుందనే ఆశతో ఫ్రెండ్‌షిప్‌చాట్ అనే టీమ్‌లో అపరిచితులతో మారుపేరుతో మాట్లాడే జాబ్ ఎంచుకుంటుంది. కస్టమర్స్ అందరూ అసభ్యకరంగా మాట్లాడుతుండటంతో ఆ జాబ్ మానేయాలని అనుకుంటుంది.
అనుకోకుండా ఓ రోజ్ ఫ్రెండ్‌ఫిస్‌చాట్‌లో దయాకర్ (సెల్వరాఘవన్) అనే మ్యూజిక్ డైరెక్టర్‌తో ఇషా అనే మరో పేరుతో ఫర్హానా మాట్లాడుతుంది. ఫోన్ సంభాషణల ద్వారా దయాకర్‌తో ఫర్హానాకు మంచి స్నేహం ఏర్పడుతుంది. ఇద్దరు గంటల తరబడి మాట్లాడుకుంటారు. దయాకర్ మంచివాడిగా నమ్మి మనసు విప్పిఅతడితో తన కష్టాలు పంచుకుంటుంది ఫర్హానా.
ఓ రోజు దయాకర్‌ను కలవాలని అనుకుంటుంది. అదే రోజు జరిగిన కొన్ని పరిణామాల వల్ల దయాకర్‌ను ఫర్హానా దూరం పెట్టాలని నిశ్చయించుకుంటుంది . ఫర్హానా పేరుతో పాటు ఇంటి అడ్రెస్ తెలుసుకున్న దయాకర్ ఆమెను బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెడతాడు?
ఫర్హానా భర్త కరీమ్‌కు యాక్సిడెంట్ చేస్తాడు? అతడి బారి నుంచి ఫర్హానా ఎలా బయటపడింది? దయాకర్‌కు ఎలా బుద్దిచెప్పింది? ఈ సమస్యను ఎదుర్కోవడంలో ఫర్హానాకు భర్త కరీమ్ ఎలా అండగా నిలబడ్డాడు? అన్నదే ఈసినిమా(Farhana Movie Review) కథ.
కాల్ సెంటర్స్ మాయలు...
సోషల్ మీడియా, మొబైల్ ఫోన్స్ వల్ల ఉపయోగాలే కాదు అనర్థాలు కూడా చాలా ఉంటాయి. ఆన్‌లైన్‌లో అపరిచితులతో చాటింగ్, ఫోన్‌కాల్స్ మాట్లాడేలా ధానార్జనే ధేయ్యంగా కొందరు కాల్‌సెంటర్స్ నడుపుతుంటారు. ఈ ఫోన్ కాల్స్ ద్వారా ముక్కుమోహం తెలియని అపరిచితులతో ఏర్పడే స్నేహాలు ఎంత ప్రమాదకరం అన్నది ఫర్హానా సినిమాలో చూపించారు దర్శకుడు నెల్సన్ వెంకటేషన్.
కుటుంబ పోషణ కోసం అలాంటి కంపెనీలో పనిచేసే యువతీయువకులుఎలాంటి సమస్యల్ని ఎదుర్కొంటారు అన్నది వాస్తవిక కోణంలో ఆవిష్కరించారు. ఆధునిక సమాజంలో ఇప్పటికీ కొన్ని మతాల్లో కట్టుబాట్లు, సంప్రదాయాల పేరుతో ఆడపిల్లలను ఇంటికే పరిమితం చేస్తున్నారని, ఈ ఆలోచన విధానం మారాలనే సందేశాన్ని చెప్పారు.
అంతే కాకుండా కుటుంబ భారాన్ని మోయడానికి ఉద్యోగం కోసం ఇంటి నుంచి బయట అడుగుపెట్టిన మహిళలకు సోసైటీలో ఎలాంటి కష్టాలు ఎదురవుతాయన్నది ఆలోచనాత్మకంగా సినిమాలో చూపించారు.
సెంటిమెంట్ ప్రధానంగా...
ఫర్హానా కుటుంబ పరిస్థితులు, ఉద్యోగం చేయాలనే కల తీరక ఆమె ఎదుర్కొనే మానసిక సంఘర్షణతో ఎమోషనల్ సీన్స్‌తో సినిమా ప్రారంభమవుతుంది. కాల్ సెంటర్‌లో చేరిన తర్వాత దయాకర్‌తో ఫర్హానాకు స్నేహం మొదలవ్వడం, వారిద్దరి సంభాషణలతో పాటు భర్తకు తెలియకుండా దయాకర్‌ను కలవడానికి ఫర్హానా చేసే ప్రయత్నాలతో ప్రీ క్లైమాక్స్ వరకు సినిమా కాస్త నిదానంగా సాగుతుంది.
దయాకర్ బారి నుంచి ఫర్హానా తన కుటుంబాన్ని ఎలా కాపాడుకుందన్నది సెంటిమెంట్‌తోపాటు ఓ చిన్న ట్విస్ట్ ఇచ్చి డీసెంట్ క్లైమాక్స్‌తో సినిమాను ఎండ్ చేశారు డైరెక్టర్.
సాగతీత ఎక్కువే...
సొసైటీలోని బర్నింగ్ ఇష్యూను తీసుకొని ఫర్హానా సినిమాను తెరకెక్కించారు దర్శకుడు నెల్సన్ వెంకటేషన్. అతడు ఎంచుకున్న పాయింట్ బాగున్నా చెప్పిన విధానం మాత్రం రొటీన్‌గా ఉంది. సినిమా చాలా సాగతీతగా ఉంటుంది. . కథ ఎక్కువగా ఫర్హానా, దయాకర్ ఫోన్‌కాల్స్ చుట్టే సాగుతుంది. ఆ సీన్స్ అన్ని బోర్ కొడతాయి. దయాకర్‌కు ఫర్హానా బుద్ది చెప్పే సీన్స్ కూడా ప్రెడిక్టబుల్‌గా ఉన్నాయి.
ఐశ్వర్య రాజేష్ జీవించింది...
ఫర్హానా పాత్రలో ఐశ్వర్య రాజేష్ జీవించింది. తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి పోరాటం చేసే ఓ సగటు ఇల్లాలి పాత్రకు పూర్తిగా న్యాయం చేసింది. ఎమోషనల్ సీన్స్‌లో అదరగొట్టింది. కరీమ్ క్యారెక్టర్‌కు జీతన్ రమేష్ పర్‌ఫెక్ట్‌గా ఫిట్ అయ్యాడు.
భార్యను అర్థం చేసుకునే భర్తగా అతడి పాత్రను డిజైన్ చేసిన తీరు బాగుంది. అతడి పాత్ర నేపథ్యంలో వచ్చే డైలాగ్స్ ఆలోచింపజేస్తాయి. దయాకర్ అనే నెగెటివ్ షేడ్స్ క్యారెక్టర్‌లో డైరెక్టర్ సెల్వ రాఘవన్ కనిపించాడు. అతడు పాత్ర స్క్రీన్‌పై చాలా తక్కువ టైమ్ కనిపిస్తుంది.
Farhana Movie Review- మంచి థ్రిల్లర్...
ఫర్హానా అర్థవంతమైన మెసేజ్‌తో కూడిన డీసెంట్ థ్రిల్లర్ మూవీ. ఐశ్వర్య రాజేష్ యాక్టింగ్ కోసం తప్పకుండా ఈ సినిమా చూడొచ్చు.