తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sushant Singh Rajput Death Anniversary: సుశాంత్ సింగ్‍ను గుర్తు చేసుకుంటున్న అభిమానులు.. న్యాయం చేయాలంటూ..

Sushant Singh Rajput death anniversary: సుశాంత్ సింగ్‍ను గుర్తు చేసుకుంటున్న అభిమానులు.. న్యాయం చేయాలంటూ..

14 June 2023, 15:05 IST

google News
    • Sushant Singh Rajput death anniversary: సుశాంత్ సింగ్ రాజ్‍పుత్ వర్ధంతి సందర్భంగా అభిమానులు అతడిని గుర్తు చేసుకుంటున్నారు. ఎప్పటికీ తమ మనసుల్లో ఉంటాడని ట్వీట్లు చేస్తున్నారు.
సుశాంత్ సింగ్ రాజ్‍పుత్ (HT Photo)
సుశాంత్ సింగ్ రాజ్‍పుత్ (HT Photo)

సుశాంత్ సింగ్ రాజ్‍పుత్ (HT Photo)

Sushant Singh Rajput death anniversary: బాలీవుడ్ యంగ్ హీరో, టాలెంటెడ్ యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్‍పుత్ మరణించి నేటికి (జూన్ 14) సరిగ్గా మూడేళ్లయింది. 2020 జూన్ 14వ తేదీన ముంబైలోని బాంద్రాలోని తన ఇంట్లో సుశాంత్ మృతి చెందారు. నేడు సుశాంత్ సింగ్ వర్ధంతి కావటంతో అభిమానులు ఆయనను గుర్తు చేసుకుంటున్నారు. ఎంఎస్ ధోనీ, కై పోచే, కేదార్‌నాథ్ సహా పలు చిత్రాల ద్వారా సుశాంత్‍కు మంచి పేరు వచ్చింది. సీరియల్స్ నుంచి ఎంతో కష్టపడి సినీ హీరో స్థాయి వరకు ఆయన ఎదిగారు. ఈ విషయాలను గుర్తు చేసుకుంటూ.. సుశాంత్ సింగ్ రాజ్‍పుత్ మరణంపై విచారణలో న్యాయం జరగాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. నేడు ట్విట్టర్‌లో సుశాంత్ సింగ్ పేరు ట్రెండింగ్‍లో ఉంది.

సుశాంత్ సింగ్ రాజ్‍పుత్ మృతిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) మూడేళ్లుగా విచారణ జరుపుతోంది. కానీ ఈ కేసులో ఇప్పటి వరకు ఎలాంటి చార్జ్ షీట్ ఫైల్ చేయలేదు.. అలాగే అధికారికంగా కేసును క్లోజ్ కూడా చేయలేదు. 2020లో బిహార్ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించగా.. ఆ తర్వాత సీబీఐకి బదిలీ అయింది. ఈ నేపథ్యంలో విచారణ గురించి వివరాలను వెల్లడించాలని సుశాంత్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. సుశాంత్‍ కేసులో న్యాయం జరగాలని కోరుతూ ట్వీట్లు చేస్తున్నారు.

“జూన్ 14 బ్లాక్ డే. మూడేళ్లుగా సుశాంత్ కేసులో అన్యాయం జరుగుతోంది. రియల్ హీరో సుశాంత్‍ను మిస్ అవుతున్నా” అని యూజర్ ట్వీట్ చేశారు. “సుశాంత్ సింగ్ రాజ్‍పుత్‍ను మర్చిపోవడం అసాధ్యం. ఈ కేసు పూర్తయ్యే వరకు ఆ తర్వాత కూడా ఈ విషయాన్ని గుర్తు చేస్తూనే ఉంటాం. దీన్ని అంతం కానివ్వం” అని మరో యూజర్ రాసుకొచ్చారు. సుశాంత్ సింగ్‍ది ఆత్మహత్య కాదని, హత్య అంటూ అనుమానిస్తూ మరికొందరు ట్వీట్లు చేస్తున్నారు.

సుశాంత్ సింగ్ రాజ్‍పుత్ ఎప్పటికీ తమ హృదయాల్లోనే ఉంటాడని చాలా మంది పోస్ట్ చేస్తున్నారు. సుశాంత్ మృతి విషయంలో సీబీఐ త్వరగా విచారణ పూర్తి చేసి, న్యాయం చేయాలని చాలా మంది డిమాండ్లు చేస్తున్నారు.

తన ఇంట్లో ఉరి వేసుకున్న స్థితిలో సుశాంత్‍ను బాంద్రా పోలీసులు చూశారు. ఆ తర్వాత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. చాలా మంది బాలీవుడ్ నటులు, నిర్మాతలను ప్రశ్నించారు. మరికొందరిని విచారించారు. పోస్టు మార్టం తర్వాత సుశాంత్‍ది ఆత్మహత్యేననే భావనకు పోలీసులు వచ్చారు. అయితే, అభిమానులు మాత్రం అప్పటి నుంచి అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం