Family Star Review: ఫ్యామిలీ స్టార్ రివ్యూ - విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ మూవీ ఎలా ఉందంటే?
05 April 2024, 13:07 IST
Family Star Review:విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ స్టార్ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించింది.
ఫ్యామిలీ స్టార్ మూవీ రివ్యూ
Family Star Review:విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోహీరోయిన్లుగా నటించిన ఫ్యామిలీ స్టార్ మూవీ శుక్రవారం థియేటర్లలో రిలీజైంది. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను దిల్‌రాజు (Dil Raju) ప్రొడ్యూస్ చేశాడు. గీతగోవిందం తర్వాత విజయ్ దేవరకొండ, పరశురామ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ మూవీ ఎలా ఉందంటే?
మిడిల్ క్లాస్ కుర్రాడి కథ...
గోవర్ధన్ (విజయ్ దేవరకొండ) ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కుర్రాడు. ఓ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తుంటాడు. కుటుంబ బాధ్యతలన్నీ అతడిపైనే ఉంటాయి. అన్నపిల్లలను బాధ్యతను కూడా తీసుకొని వారిని చదివిస్తుంటాడు. గోవర్ధన్ ఇంట్లోకి ఇందు (మృణాల్ ఠాకూర్) అద్దెకు దిగుతుంది. సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్ అయిన ఇందు మిడిల్ క్లాస్ జీవనశైలిపై ఓ ప్రాజెక్ట్ చేయాలనే ప్రయత్నంలో ఉంటుంది.
ఆ రహస్యాన్ని గోవర్ధన్ వద్ద దాచిపెట్టి అతడితో క్లోజ్‌గా మూవ్ అవుతుంది . ఇందు మంచితనం చూసి ఆమెతో ప్రేమలో పడతాడు గోవర్ధన్. అంత సాఫీగా సాగిపోతున్న తరుణంలో తన జీవితంపై ఇందు రాసిన బుక్ గోవర్ధన్ కంటపడుతుంది. ఆ బుక్‌లో తన గురించి ఇందు రాసిన తీరు చూసి గోవర్ధన్ హర్ట్ అవుతాడు. ఆమె ప్రేమకు బ్రేకప్ చెబుతాడు. ఎలైట్ అనే కన్‌స్టక్షన్ కంపెనీ తరఫున ఓ ప్రాజెక్ట్ పనిమీద గోవర్ధన్‌కు అమెరికా వెళ్లే ఛాన్స్ వస్తుంది.
ఆ కంపెనీ సీఈఓ (జగపతిబాబు)కూతురే ఇందు అనే నిజం తెలుస్తుంది. ప్రాజెక్ట్ పని కోసం గోవర్ధన్‌తో పాటు ఇందు కూడా అమెరికా వెళుతుంది. అక్కడ ఏం జరిగింది? వారి మధ్య అభిప్రాయభేదాలు ఎలా సమసిపోయాయి? వారిద్దరు ఎలా ఒక్కటయ్యారు? గోవర్ధన్ గురించి ఇందు తన బుక్‌లో ఏం రాసింది? ఇండియన్ కమ్యూనిటీ గొప్పతనాన్ని గోవర్ధన్ అమెరికాలో ఎలా చాటిచెప్పాడు? అన్నదే ఈ మూవీ(Family Star Review) కథ.
బాక్సాఫీస్ సక్సెస్ ఫార్ములా...
మిడిల్ క్లాస్ బ్యాక్‌డ్రాప్ అన్నది ఒకప్పుడు టాలీవుడ్ బాక్సాఫీస్ సక్సెస్ ఫార్ములాగా పేరుపడ్డది. కుటుంబ బాధ్యతల్ని నెరవేర్చే క్రమంలో హీరో పడే కష్టాలు, త్యాగాలతో దాసరి నారాయణరావు, ముత్యాల సుబ్బయ్య లాంటి దర్శకులు సక్సెస్‌ఫుల్ సినిమాల్ని తెరకెక్కించారు. ఈ ఫార్ములా కథలతో చిరంజీవి, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలు సైతం విజయాల్ని అందుకున్నారు.మిడిల్ క్లాస్ పాయింట్ ను చాలా రోజుల తర్వాత మళ్లీ ఫ్యామిలీ స్టార్ (Family Star Review)మూవీతో టచ్ చేశారు దర్శకుడు పరశురామ్.
బలమే బలహీనత...
కుటుంబ బాధ్యతల్ని నెరవేర్చే క్రమంలో ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు. తన ఫ్యామిలీని ఉన్నతంగా చూడాలనే కలలు కనే అతడి జీవితంలోకి ఓ అమ్మాయి వచ్చి ఎలాంటి అలజడి రేపిందనే పాయింట్‌తో దర్శకుడు పరశురామ్ ఈ కథను రాసుకున్నాడు. ఈ పాయింట్ చుట్టూ ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ, రొమాన్స్‌ను అల్లుకుంటూ ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేయాలని అనుకున్నారు.
ఫ్యామిలీ ఎమోషన్స్, రొమాన్స్‌ను రియలిస్టిక్‌గా చూపించడం దర్శకుడు పరశురామ్ బలం. ఆ బలమే ఈ సినిమాలో బలహీనతగా మారింది. మిడిల్ క్లాస్ కష్టాలన్నీ చాలా ఆర్టిఫిషియల్‌గా సాగుతాయి. కుటుంబం కోసం హీరో చేసే త్యాగాలు టీవీ సీరియల్‌ను తలపిస్తాయి. కథ, కథనాలు మొత్తం 1990 కాలం నాటి సినిమాలను గుర్తుకుతెస్తాయి
ఇంటర్వెల్ ట్విస్ట్...
ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో కుటుంబ నేపథ్యం, ఇందు అతడి జీవితంలోకి వచ్చేసీన్స్‌తో సాగుతుంది. మిడిల్ క్లాస్ కుర్రాడిగా విజయ్ పడే కష్టాలు బాగా చూపించారు. ఆ సీన్స్ ఫన్ చక్కగా వర్కవుట్ అయ్యింది. ఈ సీన్స్ లో విజయ్ బాడీ లాంగ్వేజ్ లుక్ బాగున్నాయి. విజయ్ , మృణాల్ రొమాన్స్‌ను అందంగా చూపించారు.
ఇందు రాసిన బుక్‌తో ఇంటర్వెల్‌లో ఓ ట్విస్ట్ ఇచ్చి సెకండాఫ్‌పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. సెకండాఫ్ లో కథను అమెరికాకు షిప్ట్ చేశారు డైరెక్టర్. హీరో, హీరోయిన్ ఈగో క్లాష్‌తో నడుస్తుంది. హీరోహీరోయిన్ల మధ్య గొడవలకు కారణమయ్యే కాన్‌ఫ్లిక్ట్‌లో మరి పలుచన అయిపోయింది. హీరో ఇంటి బాధ్యతలు మీదవేసుకోవడంలో బలమైన సంఘర్షణ కనిపించదు. ఆ సీన్స్ ను దర్శకుడు కన్వీన్సింగ్ రాసుకోలేకపోయాడు. సెకండాఫ్ మొత్తం సాగతీతగా అనిపిస్తుంది. బలవంతంగా వచ్చే రొమాంటిక్ సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్‌తో కథ ఎంతకుముందు కదలక అక్కడే తిరుగుతుంది.
కామెడీ పేరుతో దర్శకుడు పరశురామ్ రాసుకున్న సీన్స్ బెడిసికొట్టాయి. విజయ్‌ని అమెరికాలో అమ్మాయిలు కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించడం, లుంగీ సీన్స్ చిరాకును తెప్పిస్తాయి. పాటలు, ఫైట్స్ ప్లేస్‌మెంట్ సరిగ్గా కుదరలేదు.
విజయ్ అదుర్స్...
మిడిల్ క్లాస్ కుర్రాడిగా విజయ్ అలరించాడు. లవర్ బాయ్ ఇమేజ్‌కు భిన్నంగా బాధ్యతల కలిగిన కుర్రాడి పాత్రలో ఒదిగిపోయాడు. యాక్షన్, రొమాన్స్, సెంటిమెంట్, కామెడీ అన్ని ఎమోషన్స్ ను బాగా పండించాడు. కానీ పరశురామ్ రొటీన్ స్టోరీ కారణంగా అతడి కష్టం మొత్తం వృథా అయ్యింది.
ఇందుగా మృణాల్ ఠాకూర్ అందంగా కనిపించింది. ఆమె యాక్టింగ్‌కు చాటిచెప్పే సీన్స్ బలంగా పడలేదు. హీరోయిన్ ఫాదర్‌గా జగపతిబాబుకు రెగ్యులర్ క్యారెక్టరే. రవిబాబు, వెన్నెలకిషోర్, దివ్యాంశ కౌషిక్‌తో పాటు చాలా మంది ఏ పాత్ర పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు.
ఫ్యామిలీ ఆడియెన్స్‌కు మాత్రమే...
ఫ్యామిలీ స్టార్ మూవీ ఫ్యామిలీ ఆడియెన్స్ మెప్పించే అవకాశం ఉంది. వారి ఆదరణపైనే ఈ సినిమా విజయావకాశాలు ఆధారపడ్డాయి. రొటీన్ స్టోరీ లైన్ ఈ సినిమాకు పెద్దగా మైనస్.
రేటింగ్: 2.5/5