Tollywood: సమస్యలు పరిష్కారమైన తర్వాతే షూటింగ్స్ ప్రారంభం - దిల్ రాజు క్లారిటీ
04 August 2022, 14:22 IST
టాలీవుడ్ లో నెలకొన్న సమస్యలు పరిష్కారానికి నాలుగు ప్రత్యేకమైన కమిటీలను ఏర్పాటు చేసినట్లు నిర్మాత దిల్ రాజు స్పష్టం చేశారు. టాలీవుడ్ బంద్ పై నిర్మాత దిల్ రాజు ఏమన్నారంటే...
సి.కల్యాణ్, దిల్ రాజు, దామోదర ప్రసాద్
టాలీవుడ్ లో థియేటర్స్, ఓటీటీ పరంగా నెలకొన్న సమస్యల పరిష్కారం కొరకు ఇటీవలే ప్రొడ్యూసర్ గిల్డ్ సినిమా షూటింగ్స్ బంద్ కు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయాల్ని వ్యతిరేకిస్తూ కొందరు టాలీవుడ్ నిర్మాతలు తమ సినిమాల షూటింగ్ లను నిర్వహిస్తున్నట్లు వార్తలొచ్చాయి.
ప్రొడ్యూసర్ గిల్డ్ నిర్ణయాల్ని తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ అంగీకరించలేదని, ఈ విషయంపై నిర్మాతలకు, ఫిలిం ఛాంబర్ కు మధ్య అభిప్రాయభేదాలు వచ్చినట్లు ప్రచారం జరిగింది. ఈ పుకార్లపై నిర్మాత దిల్ రాజు స్పందించారు. ప్రస్తుతం టాలీవుడ్ లో అన్ని సినిమాల షూటింగ్స్ నిలిచిపోయానని పేర్కొన్నారు. కొన్ని సినిమాల చిత్రీకరణలు కొనసాగుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని అన్నాడు.
అన్ని సమస్యలకు పరిష్కారాలు దొరికిన తర్వాతే షూటింగ్ లను తిరిగి మొదలుపెట్టబోతున్నట్లు వెల్లడించారు. ఓటీటీ, థియేటర్ సమస్యలతో పాటు కార్మికుల వేతనాలు, వీపీఎఫ్ ఛార్జీల పరిష్కారానికై నాలుగు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసినట్లు దిల్ రాజు పేర్కొన్నారు. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో జరుగుతున్న సమావేశాల్లో తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా పాల్గొంటున్నట్లు తెలిపారు. ఛాంబర్ తో నిర్మాతలకు ఎలాంటి గొడవలు లేవని స్పష్టం చేశారు. ప్రొడ్యూసర్ గిల్డ్ టాలీవుడ్ కు పెద్ద దిక్కు కాదని, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆప్ కామర్స్ మాత్రమే సుప్రీమ్ అథారిటీ అని దిల్ రాజు అన్నారు.
టాపిక్