Conjuring Kannappan Review: కంజూరింగ్ కన్నప్పన్ మూవీ రివ్యూ - రెజీనా హారర్ కామెడీ మూవీ ఎలా ఉందంటే?
08 January 2024, 5:52 IST
Conjuring Kannappan Review: సతీష్, రెజీనా ముఖ్య పాత్రలు పోషించిన కోలీవుడ్ మూవీ కంజూరింగ్ కన్నప్పన్ ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. హారర్ కామెడీ కథతో తెరకెక్కిన ఈ సినిమాకు సెల్విన్ రాజ్ జేవియర్ దర్శకత్వం వహించాడు.
కంజూరింగ్ కన్నప్పన్ మూవీ
Conjuring Kannappan Review: కోలీవుడ్ కమెడియన్ సతీష్, రెజీనా ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ హారర్ కామెడీ మూవీ కంజూరింగ్ కన్నప్పన్ ఇటీవల నెట్‌ఫ్లిక్స్ లో రిలీజైంది. హారర్ కామెడీ కథతో తెరకెక్కిన ఈ సినిమాకు సెల్విన్ రాజ్ జేవియర్ దర్శకత్వం వహించాడు. కంజూరింగ్ కన్నప్పన్ ఎలా ఉందంటే?
కన్నప్ప కలల కథ...
కన్నప్ప (సతీష్) ఓ నిరుద్యోగి. గేమ్ డిజైనింగ్ కంపెనీలో ఉద్యోగం చేయాలన్నది అతడి కల. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం మాత్రం రాదు. పబ్జీలో ఓ పిల్లాడికి సాయం చేయబోయి డెవిల్ (ఆనంద్‌రాజ్) అనే రౌడీకి పది లక్షలు అప్పు పడతాడు కన్నప్ప. ఇంటి వెనకాల ఉన్న పాడుబడ్డ బావిలో కన్నప్పకు శపించబడిన డ్రీమ్ క్యాచర్ దొరుకుతుంది. ఆ క్యాచర్‌కు ఉన్న ఈకను పొరపాటుగా పీకడంతో కన్నప్ప కష్టాలు మొదలవుతాయి.
నిద్రపోగానే కలలో ఓ పెద్ద భవంతిలోకి అతడు అడుగుపెడతాడు. ఆ బంగళాలో ఉన్న ఆత్మలు అతడిని చంపడానికి ప్రయత్నిస్తుంటాయి. వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో కన్నప్పకు తగిలిన గాయాలన్నీ నిద్ర నుంచి లేవగానే నిజంగానే అతడి ఒంటిపై కనిపిస్తాయి. ఆ డ్రీమ్ క్యాచర్ కారణంగా కన్నప్పతో పాటు అతడి తల్లిదండ్రులు అంజనేయులు (వీటీవీ గణేష్), లక్ష్మి (శరణ్య), మావయ్య శేఖర్‌తో పాటు డాక్టర్ జానీ (రెడిన్ కింగ్‌స్లే), రౌడీ డెవిల్ కూడా ఆ కలల ప్రపంచంలోకి ప్రవేశిస్తారు.
డ్రీమ్ క్యాచర్ బారి నుంచి వారిని ఎగ్జార్సిస్ట్ ఏకాంబరం (నాజర్), డార్క్ డేవ్స్ (రెజీనా) ఎలా కాపాడారు? 1930ల కాలం నాటి ఆ బంగళాలో ఉన్న రాబర్ట్, విలియంతో పాటు మాగ్ధలిన్‌ల కథేమిటి? డ్రీమ్ వరల్డ్ నుంచి తన కుటుంబాన్ని కన్నప్ప ఎలా కాపాడుకున్నాడు? అన్నదే కంజూరింగ్ కన్నప్పన్ మూవీ కథ.
ఎవర్ గ్రీన్ ఫార్ములా...
హారర్ సినిమాల చాలా వరకు ఓ పెద్ద బంగళా...అందులో బంధించబడిన ఆత్మల చుట్టే తిరుగుంటాయి. ఆ దయ్యాల బారి నుంచి హీరో ప్రాణాలను తెగించి బయటపడటం, తన వాళ్లను రక్షించుకోవడం అన్నది చాలా సినిమాల్లో కామన్‌గా కనిపిస్తుంది. బ్లాక్ అండ్ వైట్ కాలంలో మొదలైన ఈ ఎవర్ గ్రీన్ హారర్ ఫార్ములాలో ప్రతి ఏటా ఇండియన్ స్క్రీన్‌పై వందలాది సినిమాలు వస్తూనే ఉంటాయి. కంజూరింగ్ కన్నప్పన్ ఆరంభ సన్నివేశాలు చూస్తే అలాంటి రొటీన్ టెంప్లెట్ హారర్ మూవీనే అనిపిస్తుంది.
కానీ డ్రీమ్ క్యాచర్ పేరుతో దర్శకుడు డిఫరెంట్ బ్యాక్‌డ్రాప్‌లో కథను రాసుకున్నాడు. ఆ ఐడియానే కంజూరింగ్ కన్నప్పన్‌కు ప్లస్సయింది. నిద్ర పోతే హీరోతో పాటు అతడి ఫ్యామిలీ దయ్యం బారిన పడటం అనే ఐడియా గమ్మత్తుగా ఉంది. కలలో దయ్యాలున్న బంగళాలోకి వారు అడుగుపెట్టడం, అక్కడ హీరో, అతడి కుటుంబం ఎదుర్కొనే ఇబ్బందులను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ఫన్నీగా రాసుకున్నాడు డైరెక్టర్.
కన్నప్ప, అతడి తల్లిదండ్రుల మధ్య సీన్స్‌లో పంచ్‌లు, సెటైర్స్ బాగా పేలాయి. నిద్రను ఆపుకోవడానికి మెయిన్ క్యారెక్టర్స్ పడే తిప్పలు కొన్ని నవ్విస్తాయి.
పాత వాసనలే...
డ్రీమ్ క్యాచర్ అనే పాయింట్ మినహా మిగిలిన కథ విషయంలో మాత్రం దర్శకుడు పాత ఫార్ములానే ఫాలో అయ్యాడు. పెద్ద భవంతిలో దయ్యాన్ని చూసి హీరోతో పాటు అతడి ఫ్యామిలీ భయపడటం, ఆ ఆత్మల బారి నుంచి పారిపోయే సన్నివేశాలల్లో పాత హారర్ సినిమాల వాసనలే కనిపిస్తాయి. హీరో కథను కామెడీగా...ఆత్మల కథ, వాటి బారి నుంచి హీరోను కాపాడటానికి రెజీనా, నాజర్ చేసే ప్రయత్నాల్ని సీరియస్‌గా చూపించారు. రెండింటికి సింక్ సరిగా కుదరనట్లు అనిపించింది.
పంచ్ డైలాగ్స్ ప్లస్సయ్యాయి...
కంజూరింగ్ కన్నప్పన్‌లో కోలీవుడ్ కమెడియన్ సతీష్ హీరోగా నటించాడు. పేరుకు హీరో అయినా అన్ని పాత్రలకు సినిమాలో సమానంగా ఇంపార్టెన్స్ ఉంటుంది. వీటీవీ గణేష్‌తో పాటు రెడిన్ కింగ్‌స్లే పంచ్ డైలాగ్స్ బాగా పేలాయి.
యూట్యూబ్‌లో రీల్స్ చేసే తల్లిగా శరణ్య పొన్‌వన్నన్ క్యారెక్టర్ నుంచి మంచి కామెడీని రాబట్టుకున్నాడు డైరెక్టర్. ఆనంద్ రాజ్ కామెడీ ట్రాక్ మాత్రం పెద్దగా నవ్వించలేదు. రెజీనా లుక్ మాత్రమే కొత్తగా ఉంది. యాక్టింగ్ పరంగా రెజీనా, నాజర్ పాత్రలకు సరిగా వాడుకోలేన్నట్లుగా అనిపించింది.
టైమ్‌పాస్ హారర్ మూవీ..
కంజూరింగ్ కన్నప్పన్ డిఫరెంట్ హారర్ కామెడీ మూవీ. ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా చూస్తే టైమ్‌పాస్ అవుతుంది.
రేటింగ్ : 2.5/5