Chiranjeevi: ఆ బాధితుల్లో నేను ఒకడిని - ఆచార్య రిజల్ట్‌పై చిరంజీవి కామెంట్స్ వైరల్
01 September 2022, 8:01 IST
Chiranjeevi:హీరోల డేట్స్ దొరికాయి కదా అని హడావిడిగా సినిమాలు చేసే ధోరణి నుండి దర్శకులు బయటకు రావాలని టాలీవుడ్ అగ్ర హీరో చిరంజీవి సూచించారు. సినిమా ఇండస్ట్రీలోని తాజా పరిణామాలపై ఫస్ట్ డే ఫస్ట్ షో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.
చిరంజీవి
Chiranjeevi:కరోనా మహమ్మారి తర్వాత ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమాలు చూసే ధోరణి తగ్గిందనే భయం కొన్నాళ్లుగా టాలీవుడ్ వర్గాల్లో కనిపిస్తోందని అన్నాడు చిరంజీవి. అది కేవలం అపోహ మాత్రమేనని తెలిపాడు. బుధవారం హైదరాబాద్ లో జరిగిన ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా టాలీవుడ్ తాజా పరిస్థితులపై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సినిమాలు చూసేందుకు థియేటర్లకు వెళ్లకూడదనే భావన ప్రేక్షకుల్లో లేదని అన్నాడు. ఓటీటీ లకు అలవాటుపడినా మంచి సినిమా వస్తే థియేటర్లకు రావడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపాడు.
‘కంటెంట్ బాగుండాలి. థియేటర్ లో అడుగుపెట్టిన ప్రేక్షకుడికి సరైన సంతృప్తిని, ఎంటర్ టైన్ మెంట్ అందించాలి. అలాంటి కంటెంట్ ను అందించే బాధ్యత టాలీవుడ్ వర్గాలపై ఉంది. బింబిసార, సీతారామం, కార్తికేయ 2 సినిమాలు అందుకు ఉదాహరణగా నిలిచాయి. ఇలాంటి కథాబలమున్న మంచి సినిమాలు మరిన్ని రావాలి’ అని తెలిపారు. సినిమా ఫిలాసఫీ మారిపోయింది, ఇంట్లోనే కూర్చొని ఓటీటీలలో సినిమాలు చూడటానికి ప్రేక్షకులు అలవాటు పడిపోయారనే భయం తనలో ఏ మాత్రం లేదని చిరంజీవి అన్నారు.
‘ సినిమా బాగుంటే తప్పకుండా ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు. కంటెంట్ బాగాలేకపోతే రెండో రోజు థియేటర్లలో సినిమా ఉండదు. ఆ బాధితుల్లో నేను ఒకడిని. ఈ మధ్య కాలంలో నా సినిమా ఒకటి అలాగే ఫ్లాప్ అయ్యింది’ అని తెలిపాడు. మంచి కంటెంట్ ను తయారు చేసే బాధ్యత దర్శకులపైనే ఉందని చిరంజీవి పేర్కొన్నారు. ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో కూడిన కథాంశాలపై దర్శకులు ఫోకస్ పెట్టాలని సూచించారు.
‘నటీనటులు డేట్స్ దొరికాయి కదా అని ఏదో హడావిడి పడిపోయి సినిమాలు చేసే ధోరణి వద్దు. ఓ సినిమాపై ఎంతో మంది నటీనటులు, సాంకేతిక నిపుణులు, బయ్యర్లతో పాటు ప్రేక్షకులు ఆధారపడతారు. వారిని నిరాశ పరిచే హక్కు దర్శకులకు లేదు. దర్శకులు కంటెంట్ విషయంలో జాగ్రత్తపడితేనే హిట్స్ వస్తాయి’ అని చిరంజీవి తెలిపారు. సినీ పరిశ్రమను తేలికగా తీసుకోవద్దని అన్నాడు. పరిశ్రమకు లోకువగా చూస్తే ఎంతటివారైనా తొందరలోనే తెరమరుగై పోతారని చెప్పారు. కష్టపడేతత్వం, పట్టుదల లేని రోజు ఇండస్ట్రీని వదిలిపెట్టి వెళ్లిపోవడమే మంచిదని పేర్కొన్నారు.