Sai Pallavi: సాయిపల్లవి రిజెక్ట్ చేసిన సినిమాలన్నీ డిజాస్టర్లే - జడ్జిమెంట్ రాంగ్ అయ్యే ఛాన్స్ లేదంటోన్న ఫ్యాన్స్
31 October 2023, 10:36 IST
Sai Pallavi Rejected Movies: సాయిపల్లవి కెరీర్‌లో నటించిన సినిమాలకంటే కథ, పాత్రలు నచ్చక తిరస్కరించిన సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. ఆ సినిమాలు ఏవంటే...
సాయిపల్లవి
Sai Pallavi Rejected Movies: స్టార్ హీరో సినిమాల్లో నటించే అవకాశం వస్తే కథ, పాత్రల గురించి ఆలోచించకుండా చాలా మంది హీరోయిన్లు వెంటనే ఎస్ చెబుతుంటారు. నో చెప్పడానికి సంశయిస్తుంటారు.కానీ సాయిపల్లవి మాత్రం అందుకు పూర్తి భిన్నమని ఆమె అభిమానులు చెబుతుంటారు. కెరీర్‌లో సాయిపల్లవి నటించిన సినిమాల కంటే వదలుకున్న సినిమాల జాబితా పెద్దగా ఉంటుంది. చిరంజీవి, అజిత్, విజయ్ దేవరకొండతో పాటు పలువురు హీరోల సినిమాల్ని సాయిపల్లవి తిరస్కరించింది. ఆమె తిరస్కరించిన సినిమాలు ఏవంటే…
చంద్రముఖి 2…
లారెన్స్, కంగనా రనౌత్ నాయకానాయికలుగా నటించిన హారర్ మూవీ చంద్రముఖి 2 ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. రజనీకాంత్ చంద్రముఖికి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలింది. ఈ సినిమాలో తొలుత కంగనా రనౌత్ పాత్ర కోసం సాయిపల్లవిని తీసుకోవాలని డైరెక్టర్ పి.వాసు అనుకున్నాడు.
కానీ పాత్ర నిడివి తక్కువ కావడం, క్యారెక్టర్‌కు పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోవడంతో సాయిపల్లవి సినిమాను తిరస్కరించింది. చంద్రముఖి 2 విషయంలో సాయిపల్లవి జడ్జిమెంట్ కరెక్ట్ అంటూ అభిమానులు చేసిన ట్వీట్స్ వైరల్ అవుతోన్నాయి. సినిమాల విషయంలో ఆమె జడ్జిమెంట్ ఎప్పుడు రాంగ్ కాదని అంటున్నారు.
చిరంజీవి భోళాశంకర్…
భోళాశంకర్ సినిమాలో చిరంజీవి చెల్లెలి పాత్రలో సాయిపల్లవి నటించాల్సింది. ఈ పాత్రతో దర్శకుడు మెహర్ రమేష్ సాయిపల్లవిని సంప్రదించాడు. కానీ సాయిపల్లవి ఈ సినిమాను రిజెక్ట్ చేసింది. సాయిపల్లవి వదులుకున్న ఈ పాత్రలో కీర్తిసురేష్ నటించింది.
ఈ ఏడాది ఆగస్ట్‌లో భారీ అంచనాల నడుమ రిలీజైన భోళాశంకర్ చిరంజీవి కెరీర్‌లో బిగ్గెస్ట్ ఫెయిల్యూర్స్‌లో ఒకటిగా నిలిచింది.తనకు రీమేక్ సినిమాలు అంటే భయమని, కంపేరిజన్స్ వస్తాయనే భయంతోనే సినిమాను వదులుకున్నట్లు గతంలో సాయిపల్లవి చెప్పింది. అయితే అసలు నిజం అది కాదని, కథ విన్నప్పుడే భోళాశంకర్ వర్కవుట్ కాదనే సాయిపల్లవి ఊహించిందని, అందుకే ఆమె ఈ సినిమా ఒప్పుకోలేదని అంటున్నారు.
డియేర్ కామ్రేడ్..
ఈ రెండు సినిమాలు మాత్రమే కాకుండా మణిరత్నం చెలియా, విజయ్ దేవరకొండ డియేర్ కామ్రేడ్ సినిమాల్లో హీరోయిన్‌గా సాయిపల్లవి నటించాల్సింది. కానీ అనివార్య కారణాల వల్ల ఆమె ఈ సినిమా చేయలేకపోయింది. వీటితో పాటు అజిత్ వలిమై, మహేష్‌బాబు సరిలేరు నీకెవ్వరు, విజయ్ లియో సినిమాల్లో హీరోయిన్‌గా సాయిపల్లవి పేరు వినిపించింది.
డేట్స్ సర్ధుబాటు కాకపోవడంతో పాటు ఇతరత్రా కారణాల సాయిపల్లవి ఈ సినిమాలు చేయలేకపోయింది. సాయిపల్లవి రిజెక్ట్ చేసిన ఈ సినిమాల్లో చాలా వరకు డిజాస్టర్స్ కావడం గమనార్హం.