RRR Movie | ‘ఆర్ఆర్ఆర్’ వసూళ్లతో ఇండియన్ ఏకానమీని పోల్చిన సెంట్రల్ మినిస్టర్
04 April 2022, 13:56 IST
‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా వసూళ్లను దేశ ఎకానమీతో ఆయన పోల్చడం ఆసక్తికరంగా మారింది.
ఎన్టీఆర్, రామ్ చరణ్
రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘ఆర్ఆర్ఆర్’ పై దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి. భాషాభేదాలకు అతీతంగా సినీ ప్రముఖులతో పాటు అన్ని రంగాల వారు ఈ సినిమాపై పొగడ్తల వర్షాన్ని కురిపిస్తున్నారు. తాజాగా ఆర్ఆర్ఆర్ వసూళ్లపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఓ పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘750 కోట్ల వసూళ్లతో ఆర్ఆర్ఆర్ ఇండియాలోనే బిగ్గెస్ట్ ఫిల్మ్ గా నిలిచిందని విన్నాను. ఆర్ఆర్ఆర్ లాంగే ఇండియన్ ఎకానమీ కూడా రికార్డులతో దూసుకుపోతున్నది. 202122 ఏడాదిలో దేశ ఎగుమతులు 418 బిలియన్లను దాటాయి’అంటూ పేర్కొన్నారు. ఆర్ఆర్ఆర్ తో ఇండియన్ ఎకానమీ గ్రోత్ ను మినిస్టర్ పోల్చడం రాజకీయ, సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
మంత్రి ట్వీట్‌కు చిత్రయూనిట్ రిప్లై ఇచ్చింది. దేశ అభివృద్ధిలో సినిమాలు ఓ చిన్న భాగంగా నిలుస్తుండటం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ప్రపంచస్థాయిలో మరిన్ని భారతీయ సినిమాలు సత్తా చాటుతాయనే నమ్మకం ఉందని చెప్పారు.ప్రస్తుతం మంత్రి ట్వీట్ తో పాటు ఆర్ఆర్ఆర్ యూనిట్ ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఫిక్షనల్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమాలో కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటించారు.
టాపిక్