Captain Miller Review: కెప్టెన్ మిల్లర్ రివ్యూ - ధనుష్ యాక్షన్ మూవీ ఎలా ఉందంటే?
22 January 2024, 5:48 IST
Captain Miller Review: ధనుష్ హీరోగా నటించిన తమిళ మూవీ కెప్టెన్ మిల్లర్ సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజైంది. 1930 బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించాడు.
కెప్టెన్ మిల్లర్
Captain Miller Review:ధనుష్ (Dhanush) హీరోగా నటించిన తమిళ మూవీ కెప్టెన్ మిల్లర్ సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజైంది. పీరియాడికల్ యాక్షన్ డ్రామా మూవీకి అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించాడు. శివరాజ్‌కుమార్, సందీప్‌కిషన్ గెస్ట్ రోల్స్ చేశారు. . ప్రియాంక అరుళ్ మోహన్ (Priyanka Arul Mohan) హీరోయిన్‌గా నటించింది. ఈ వారంలోనే ఈ మూవీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తమిళంలో సంక్రాంతికి రిలీజైన కెప్టెన్ మిల్లర్ ఎలా ఉందంటే..?
కెప్టెన్ మిల్లర్ కథ...
అనలీసన్ అలియాస్ ఈసా (ధనుష్) నిమ్న కులానికి చెందిన యువకుడు. వారి ఊరికి సమీపంలోనే ఓ పెద్ద గుడి ఉంటుంది. ఈసా కులానికి చెందిన పూర్వీకులే ఆ గుడిని నిర్మిస్తారు. తక్కువ కులానికి చెందిన వారనే సాకుతో ఊరివాళ్లకు గుడిలోకి రానివ్వడు ఊరి రాజు. అంటరానితనంపై ఈసా అన్న సెంగోలన్ (శివరాజ్‌కుమార్) శాంతియుతపోరాటం చేస్తుంటాడు. కుల వివక్షను భరించలేకపోతాడు ఈసా. గౌరవ మర్యాదల కోసం బ్రిటీష్ ఆర్మీలో చేరుతాడు. అక్క అతడి పేరు కెప్టెన్ మిల్లర్‌గా మారుతుంది. ట్రైనింగ్ పూర్తిచేసుకున్న ఈసాకు ఫస్ట్ డ్యూటీలోనే శాంతియుతంగా పోరాటం చేస్తున్న వందలాది మంది భారతీయుల్ని కాల్చిచంపమని బ్రిటీష్ వారు ఆర్డర్ వేస్తారు. ఈసా అయిష్టంగా ఆ పని పూర్తిచేస్తాడు.
తప్పు చేశాననే పశ్చాత్తాపంతో బ్రిటీష్ అధికారిని చంపి ఊరికి పారిపోతాడు. ఈసా కాల్పిచంపిన భారతీయుల్లో తన అన్న సెంగోలన్ కూడా ఉన్నాడని ఊరివాళ్లు చెబుతారు. కెప్టెన్ మిల్లర్‌ను ఊరిలోకి అడుగుపెట్టడానికి వారు ఒప్పుకోరు. ఆ తర్వాత కన్నయ్య గ్యాంగ్‌లో చేరతాడు. మరోవైపు మిల్లర్ ఊరిలో ఉన్న గుడిలో రహస్యంగా దాచిపెట్టబడిన విలువైన కిరీటంతో కూడిన ఓ పెట్టెను అక్రమంగా తమ దేశానికి తరలించడానికి బ్రిటీష్ వారు ప్లాన్ చేస్తారు. వారి దగ్గర నుంచి మిల్లర్ ఆ బాక్స్‌ను కొట్టేస్తాడు. ఆ పెట్టెను తీసుకొని సిలోన్ పారిపోవాలని అనుకుంటాడు.
ఎలాగైనా మిల్లర్ దగ్గర నుంచి ఆ బాక్స్‌ను తీసుకోవాలని భావించిన బ్రిటీష్ ఆర్మీ ఆఫీసర్ అతడి ఊరి ప్రజలందరిని బంధించి చంపేస్తుంటాడు? ఊరి ప్రజల్ని కాపాడుకోవడానికి మిల్లర్ వెనక్కి వచ్చాడా? తమ ఊరివాళ్లు గుడిలో అడుగుపెట్టాలనే తల్లి కలను మిల్లర్ ఎలా నెరవేర్చాడు? మిల్లర్‌పై ప్రతీకారం కోసం ఏడు వందల మంది బెటాలియన్‌తో వచ్చిన బ్రిటీష్ అధికారిని మిల్లర్, కన్నయ్య గ్యాంగ్ ఎలా ఎదురించింది.
నిజంగానే మిల్లర్ అన్న సెంగోలన్ చనిపోయాడా? వేళ్‌మతి ఈసాను ద్వేషించడానికి కారణం ఏమిటి? జమీందారి వంశానికి చెందిన వేళ్‌మతి పోరాటయోధురాలిగా ఎందుకు మారింది? మిల్లర్ పోరాటానికి కెప్టెన్ రఫీక్ (సందీప్‌కిషన్) ఎలా అండగా నిలిచాడు? బ్రిటీష్ వారి నుంచి మిల్లర్ కొట్టేసిన బాక్స్‌లో ఏముంది? అన్నదే కెప్టెన్ మిల్లర్(Captain Miller Review) కథ.
కుల వివక్ష...
అంటరానితనం, కులవివక్షతో పాటు సమాజంలో నిమ్న వర్గాలు ఎదుర్కొంటున్న అణిచివేత నేపథ్యంలో కోలీవుడ్‌లో చాలా సినిమాలొచ్చాయి. పా రంజిత్, వెట్రిమారన్, మారి సెల్వరాజ్‌తో పాటు పలువురు దర్శకులు అణగారిన వర్గాల వారి వెతలను, వ్యథలను ఆవిష్కరిస్తూ సినిమాలు చేసి ప్రేక్షకుల్ని మెప్పించారు.
అయితే ఈ కథలన్నీ సమకాలీన సమాజపు పోకడలను అద్ధంపడుతూ సాగాయి. కానీ కెప్టెన్ మిల్లర్‌తో దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ బ్రిటీష్ కాలంలో ఈ కులవివక్ష ఎలా ఉండేది. తక్కువ కులం వారిని రాజవంశస్థులు, బ్రిటీషర్లు ఎలా చిన్నచూపు చూసేవారు? తమ అవసరాల కోసం ఏ విధంగా వాడుకున్నారన్నది చూపించాడు.
దేశభక్తి...యాక్షన్...
గుడిని కట్టడానికి పనికొచ్చిన తక్కువ కులస్తులు...గుడిలో అడుగుపెట్టడానికి ఎందుకు అనర్హులుగా మారారు? అనే పాయింట్‌తోనే కెప్టెన్ మిల్లర్ కథను మొదలుపెట్టాడు దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్. గుడిలో అడుగుపెట్టాలనే వారి కల ఈసా అనే యువకుడి ద్వారా ఎలా నెరవేరిందన్నది యాక్షన్, డ్రామా, దేశభక్తి సోషల్ మెసేజ్ జోడించి సినిమాలో చూపించారు. బ్రిటీష్ బ్యాక్‌డ్రాప్ కెప్టెన్ మిల్లర్‌కు(Captain Miller Review) ప్లస్సయింది. ధనుష్‌లోని హీరోయిజం ఎలివేట్ కావడానికి ఈ బ్యాక్‌డ్రాప్ ను బాగా ఆడుకున్నాడు డైరెక్టర్.
ఐదు చాఫ్టర్స్…
ఓ ఆంటరాని యువకుడిగా జర్నీ మొదలుపెట్టి చివరకు ఊరి ప్రజల ఇలవేల్పు కు ప్రతిరూపంగా మారిన ఈసా ప్రయాణాన్ని భిన్న కోణాల్లో చూపించారు డైరెక్టర్ అరుణ్ మాథేశ్వరన్(Captain Miller Review). హీరో క్యారెక్టర్ జర్నీని ఐదు చాఫ్టర్స్‌గా విడగొట్టి చెప్పడం ఆకట్టుకుంటుంది. బ్రిటీష్ వారి నుంచి గుడికి సంబంధించి పెట్టెను ధనుష్ కొట్టేసే యాక్షన్ ఎపిసోడ్, క్లైమాక్స్ ఫైట్‌లోని ఎలివేషన్స్ అభిమానులను మెప్పిస్తాయి. నిమ్నవర్గాల వారిని గుడిలోకి రావద్దని ప్రీ క్లైమాక్స్‌లోని ధనుష్ చెప్పే డైలాగ్ ఆలోచనను రేకెత్తిస్తుంది.
సినిమాటిక్ లిబర్జీ...
సోషల్ మెసేజ్‌ను కమర్షియల్ కోణంలో చెప్పడంలో దర్శకుడు చాలా సినిమాటిక్ లిబర్జీ తీసుకున్నాడు. 1930 బ్యాక్‌డ్రాప్‌లో కథ సాగుతుంది. కానీ ధనుష్ స్టైలిష్ బైక్స్, గాగూల్స్ వాడటం, ప్రజెంట్ ట్రెండ్ గన్స్ ఉపయోగించడం లాజిక్స్‌కు దూరంగా సాగినట్లుగా అనిపిస్తుంది.ధనుష్, ప్రియాంక అరుళ్‌మోహన్ ట్రాక్ పెద్దగా వర్కవుట్ కాలేదు.
ధనుష్ వన్ మెన్ షో...
ధనుష్ వన్‌మెన్ షో మూవీ(Captain Miller Review) ఇది. కులవివక్ష ఎదుర్కొనే యువకుడిగా, దొంగలగ్యాంగ్ మెంబర్‌గా, పోరాటయోధుడిగా భిన్న కోణాల్లో సాగే పాత్రలో జీవించాడు. అతడి లుక్ డిఫరెంట్‌గా ఉంది. శివరాజ్‌కుమార్, సందీప్‌కిషన్ గెస్ట్ పాత్రల్లో కనిపించారు. క్లైమాక్స్‌లో ధనుష్, శివరాజ్‌కుమార్, సందీప్‌కిషన్ ముగ్గురి ఒకే సారి కనిపించే సీన్ బాగా వర్కవుట్ అయ్యింది. వారి క్యారెక్టర్స్‌ను కథలో భాగం చేసిన తీరు ఆకట్టుకుంటుంది. . ప్రియాంక అరుణ్ మోహన్, మాళవికా సతీషన్... ఇద్దరు హీరోయిన్లు ఉన్నా రొమాంటిక్ ట్రాక్‌లు, డ్యూయెట్స్ సినిమాలో ఉండవు. హీరోయిన్లు డీగ్లామర్ పాత్రల్లోనే కనిపించారు.
Captain Miller Review- ఫ్యాన్స్‌కు విజువల్ ట్రీట్…
ధనుష్ అభిమానులకు విజువల్ ట్రీట్‌లా కెప్టెన్ మిల్లర్(Captain Miller Review) నిలుస్తుంది. సామాజిక సందేశంతో సాగే కమర్షియల్ మూవీ ఇది. ఎక్కువగా తమిళ వాసనలతోనే ఈ మూవీ సాగుతుంది. తెలుగు ఆడియెన్స్‌ను మెప్పించడం కష్టమే.