Bubblegum Movie Review: బబుల్‌గమ్ రివ్యూ - రోషన్ కనకాల డెబ్యూ మూవీ ఎలా ఉందంటే?
29 December 2023, 11:58 IST
Bubblegum Movie Review: ప్రముఖ యాంకర్ సుమ కనకాల తనయుడు రోషన్ కనకాల హీరోగా ఎంట్రీ ఇచ్చిన బబుల్ గమ్ మూవీ శుక్రవారం థియేటర్లలో రిలీజైంది. యూత్‌ఫుల్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమాకు క్షణం ఫేమ్ రవికాంత్ పేరేపు దర్శకత్వం వహించాడు.
బబుల్ గమ్ మూవీ
Bubblegum Movie Review: యాంకర్ సుమ కనకాల, నటుడు రాజీక్ కనకాల తనయుడు రోషన్ కనకాల బబుల్ గమ్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. క్షణం ఫేమ్ రవికాంత్ పేరేపు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలో మానస చౌదరి హీరోయిన్‌గా నటించింది. శుక్రవారం థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ఎలా ఉంది? తొలి సినిమాతోనే రోషన్ కనకాల ఆడియెన్స్‌ను మెప్పించాడా? లేదా? అన్నది తెలియాలంటే కథలోని వెళ్లాల్సిందే
ఆది, జాన్వీ ప్రేమకథ...
ఆది అలియాస్ ఆదిత్య (రోషన్ కనకాల) మిడిల్ క్లాస్ కుర్రాడు. ఆది తండ్రి (చైతూ జొన్నలగడ్డ) చికెన్ షాప్ నడిస్తుంటాడు. డబ్బు కష్టాలు పోయి జీవితంలో ఎదగాలంటే డీజేగా సక్సెస్ కావాలని ఆది కలలు కంటాడు. ఓ డీజే వద్ద అసిస్టెంట్‌గా జాయిన్ ఆయిన ఆదికి జాన్వీ పరిచయం అవుతుంది.
జాన్వీ (మానస చౌదరి) గొప్పింటి అమ్మాయి. ఆదికి భిన్న మనస్తత్వం ఆమెది. జాన్వీతో తొలిచూపులోనే ఆది ప్రేమలో పడతాడు. ఆమెకు లవ్ ప్రపోజ్ చేస్తాడు. ఫారిన్ వెళ్లే ప్రయత్నాల్లో ఉన్న జాన్వీ ఆ లోపు ఆదితో లవ్ పేరుతో టైమ్‌పాస్ చేయాలని అనుకుంటుంది. అతడితో క్లోజ్‌గా మూవ్ అవుతుంది.
జాన్వీ బర్త్ డే రోజు జరిగిన ఓ సంఘటన ఆది జీవితాన్ని మలుపుతిప్పుతుంది. పార్టీలోనే ఆది బట్టలు విప్పి అతడిని దారుణంగా అవమానిస్తుంది జాన్వీ. ఆదిని ఆమె అవమానించడానికి కారణం ఏమిటి? అసలు ఆ పార్టీలో ఏం జరిగింది? జాన్వీపై ఆది ప్రతీకారం తీర్చుకున్నాడా? జాన్వీ ప్రేమకు ఆది ఎలాంటి పరీక్ష పెట్టాడు? ఆ పరీక్షలో జాన్వీ నెగ్గిందా? ఆది, జాన్వీ ఒక్కటయ్యారా? లేదా? అన్నదే బబుల్ గమ్ కథ.
లిప్‌లాక్‌లు, రొమాంటిక్ సీన్స్...
బబుల్ గమ్ టీజర్స్, ట్రైలర్స్‌తోనే ఇది పక్కా యూత్‌ఫుల్ మూవీ అని మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు. ఆ ప్రచారానికి తగ్గట్లుగానే సినిమా మొత్తం బోల్డ్ కంటెంట్‌తో సాగుతుంది. లిప్‌లాక్‌లు, రొమాంటిక్ సీన్స్‌తో యూత్‌ను ఎట్రాక్ట్ చేసేలా డైరెక్టర్ రవికాంత్ పేరేపు ఈ మూవీని తెరకెక్కించాడు. అసలు కథను బోల్డ్ కంటెండ్ డామినేట్ చేసింది.
పేద, ధనిక యువత జీవన శైలి ఎలా ఉంటుంది? ప్రేమ, పెళ్లి, బ్రేకప్ వంటి విషయాల్లో నేటి యువత ఏ విధంగా ఆలోచిస్తున్నారన్నది ఈ సినిమాలో చూపించాడు డైరెక్టర్. కానీ రిచ్, పూర్ అంతరాలు అనే బ్యాక్‌డ్రాప్‌లో గతంలో తెలుగు తెరపై చాలా లవ్ స్టోరీస్ వచ్చాయి. మెయిన్ పాయింట్ వాటి చాయలతోనే సాగుతుంది. ప్రేమికుల మధ్య అపార్ధాలు, అపోహలు రావడం..ఒక్కటయ్యేందుకు వారు చేసే ప్రయత్నాల్లో ఎమోషన్స్ బలంగా లేవు. కామెడీ కూడా వర్కవుట్ కాలేదు.
ఫస్ట్ హాఫ్ ఫన్...
ఒంటిపై బట్టలు లేకుండా కేవలం డ్రాయర్‌తోనే హీరో కనిపించే సీన్‌తోనే ఆసక్తికరంగా ఈ సినిమా ప్రారంభమంవుతుంది. తండ్రితో తిట్లు తింటూ డీజేగా మారడానికి హీరో చేసే ప్రయత్నాల ఆరంభంలో కామెడీని పంచుతాయి. ఆ తర్వాత హీరోయిన్ ఎంట్రీ, హీరోతో ఆమె రొమాన్స్‌తో ఫస్ట్ హాఫ్ సరదాగా సాగుతుంది. ఆ సీన్స్ చాలా వరకు లిప్‌లాక్‌లు, రొమాంటిక్ సీన్స్‌తో నింపేశారు డైరెక్టర్. హీరోను హీరోయిన్ అవమానించే సీన్...ఆ తర్వాత తన తప్పును తెలుసుకునే సీన్‌తోనే సెకండాఫ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు డైరెక్టర్.
తండ్రీ కొడుకుల ఎమోషన్...
ప్రేమ కోసం హీరో పెట్టిన కండీషన్స్‌కు హీరోయిన్ ఒప్పుకోవడం, రిచ్ అమ్మాయి అయిన తను మిడిల్ క్లాస్ లైఫ్‌ను లీడ్ చేయడానికి హీరో ఇంట్లోనే ఉండటం అనే డ్రామాతో సెకండాఫ్‌ను నడిపించాడు డైరెక్టర్. సెకండాఫ్‌లో తండ్రీ కొడుకుల ఎమోషన్స్ వర్కవుట్ అయ్యాయి. రోషన్ కనకాల, చైతూ జొన్నలగడ్డ కాంబినేషన్‌లో వచ్చే తండ్రీ కొడుకుల ఎమోషన్స్ వర్కవుట్ అయ్యాయి. రొటీన్ క్లైమాక్స్‌తో సినిమా ఎండ్ అవుతుంది.
పక్కా హైదరాబాదీ కుర్రాడిగా...
ఆది పాత్రలో రోషన్ కనకాల యాక్టింగ్ బాగుంది. పక్కా హైదరాబాదీ కుర్రాడి పాత్రకు తగ్గట్లుగా డైలాగ్ డెలివరీ, ఆటిట్యూడ్ చక్కగా కుదిరాయి. ఎలాంటి సవాళ్లు లేని పాత్ర కావడంతో ఈజీగా చేసుకుంటూ వెళ్లిపోయాడు. తొలి సినిమా అయినా కెమెరా భయం లేకుండా నటించాడు. జాన్వీగా మానస చౌదరి గ్లామర్‌తో ఆకట్టుకుంది. సెకండాఫ్‌లో యాక్టింగ్‌తో ఆకట్టుకున్నది. హర్షవర్ధన్, చైతు జొన్నలగడ్డ ఇంపార్టెంట్ రోల్స్‌లో కనిపించారు. శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్‌గా నిలిచింది.
న్యూ ఏజ్ లవ్ స్టోరీ...
బబుల్ గమ్ మూవీని న్యూ ఏజ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ లవ్ స్టోరీగా చెప్పవచ్చు. కథలో కొత్తదనం లేకపోయినా యూత్ ఆడియెన్స్‌ను మెప్పించే బోల్డ్ కంటెంట్ ఈ సినిమాలో చాలానే ఉంది. వారిని ఫుల్ టైమ్‌పాస్ చేస్తుంది.
టాపిక్