Bramayugam Review: భ్రమయుగం రివ్యూ...మమ్ముట్టి హారర్ మూవీ ఎలా ఉందంటే?
23 February 2024, 14:32 IST
Bramayugam Review: మమ్ముట్టి హీరోగా నటించిన హారర్ మూవీ భ్రమయుగం శుక్రవారం థియేటర్ల ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. బ్లాక్ అండ్ వైట్‌లో తెరకెక్కిన ఈ మూవీకి రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించాడు.
భ్రమయుగం రివ్యూ
Bramayugam Review: మలయాళంలో ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంటాడు మెగాస్టార్ మమ్ముట్టి(Mammootty). అతడు హీరోగా నటించిన తాజా చిత్రం భ్రమయుగం. మూడు పాత్రలతో బ్లాక్ అండ్ వైట్ ఫార్మెట్ లో తెరకెక్కిన ఈ సినిమాకు రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించాడు. మలయాళంలో విమర్శకుల ప్రశంసలను అందుకున్న ఈ మలయాళం మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ తెలుగులో రిలీజ్ చేసింది. శుక్రవారం థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఎలా ఉందంటే?
గాయకుడి పోరాటం...
తేవాన్ (అర్జున్ అశోకన్) ఓ గాయకుడు. పోర్చుగీసు సేనలు తక్కువ కులం వారిని బానిసలుగా మార్చి అమ్మేస్తుండటంతో వారికి దొరక్కుండా తన స్నేహితుడితో కలిసి అడవిలోకి పారిపోతాడు తేవాన్. అడవిలో తేవాన్ కళ్ల ముందే దుష్టశక్తి బారిన పడి అతడి స్నేహితుడు కోరా కన్నుమూస్తాడు.
ఆ దుష్టశక్తికి దొరక్కుండా పారిపోయిన తేవాన్ అడవిలో ఉన్న ఓ పాడుబడిన భవంతిలోకి వెళతాడు. ఆ పాత భవంతిలో కొడుమోన్ పోట్టితో (మమ్ముట్టి) పాటుఅతడి వంటవాడు (సిద్ధార్థ్ భరతన్) ఇద్దరు మాత్రమే ఉంటారు. తేవాన్‌కు కొడుమోన్ పొట్టి తన ఇంటిలో ఆథిత్యం ఇస్తాడు. ఆ ఇంటి వెనకాల చాలా మంది సమాధులు ఉండటం తేవాన్ గమనిస్తాడు.
ఇంట్లో క్షుద్రపూజల ఆనవాళ్లు కనిపిస్తాయి. ఆ ఇంటి నుంచి పారిపోవాలని తేవాన్ చేసిన ప్రయత్నాలను కొడుమోన్ పొట్టి ఎలా అడ్డుకున్నాడు? కొడుమోన్ పొట్టి గురించి తేవాన్ తెలుసుకున్న నిజాలేమిటి? కొడుమోన్ పొట్టి తాంత్రికుడు అని తెలిసి కూడా వంటమనిషి అతడితోపాటే ఎందుకు ఉంటున్నాడు? ఆగ్నికి ఆహూతి అయిన ఆ భవంతి నుంచి ఈ ముగ్గురిలో ఎవరు ప్రాణాలతో బయటపడ్డారు? అన్నదే భ్రమయుగం(Bramayugam Review)మూవీ కథ.
ప్రయోగాత్మకంగా...
మాయలు, మంత్రాలు, క్షుద్రపూజల కాన్సెప్ట్‌లతో దక్షిణాది భాషల్లో ఎన్నో సినిమాలొచ్చాయి. కానీ వాటికి భిన్నంగా ప్రయోగాత్మకంగా భ్రమయుగం సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు రాహుల్ సదాశివన్.
కంప్లీట్‌గా ఈ సినిమా మూడు పాత్రలతో, బ్లాక్ అండ్ వైట్‌లో సాగుతుంది. ఓ మాంత్రికుడి ట్రాప్ నుంచి బయటపడేందుకు గాయకుడు సాగించిన పోరాటం చుట్టూ ప్రారంభం నుంచి చివరి వరకు ఉత్కంఠగా ఈ సినిమాను నడిపించాడు డైరెక్టర్. ఇందులో హీరో ఎవరు? విలన్ ఎవరు? అన్నది చివరి సీన్ వరకు ప్రేక్షకుల ఊహలకు అందదు. అదే ఈ సినిమా స్పెషాలిటీ.
ఫస్ట్ సీన్‌తోనే...
మమ్ముట్టి ఎంట్రీ సీన్ గూస్‌బంప్స్‌ను కలిగిస్తుంది. ఆ సీన్‌తోనే భ్రమయుగంలో అతడి విలనిజం ఏ రేంజ్‌లో ఉంటుందో దర్శకుడు సదాశివన్ చూపించారు. సినిమా మొత్తం తన డైలాగ్స్‌తోనే మమ్ముట్టి విలనిజం పండించాడు. సౌండ్ డిజైనింగ్ ఈ సినిమాకు పెద్ద హైలైట్‌గా చెప్పవచ్చు. డైలాగ్స్ కంటే ఎక్కువగా సౌండ్స్ సినిమాలో భయపెడతాయి. .పురాతన బంగ్లాలో వచ్చే సౌండ్స్ రియల్ హారర్ ఫీల్‌ను కలిగిస్తాయి. తేవాన్‌ను బిల్డింగ్‌లో ట్రాప్ చేయడానికి పాచికల గేమ్ ఎంచుకునే సీన్ కొత్తగా ఉంది.
క్లైమాక్స్ ట్విస్ట్ హైలైట్...
కొడుమోన్ పొట్టి, వంటవాడి మధ్య ఆధిపత్య పోరు చుట్టూ సెకండాఫ్ సాగుతుంది. కొడుమోన్ పొట్టి నిజస్వరూపం తెలుసుకోవడానికి తేవాన్ సాగించే అన్వేషణలో ఒక్కో ట్విస్ట్ రివీల్ చేయడం బాగుంది.
కొడుమోన్ పొట్టి కుటుంబం తాలూకు ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ యావరేజ్‌గా అనిపిస్తుంది. తేవాన్ పారిపోకుండా పొట్టి చేసే మాయలు మాత్రం థ్రిల్లింగ్‌ను పంచుతాయి. ప్రీ క్లైమాక్స్‌లో మమ్ముట్టి క్యారెక్టర్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే ట్విస్ట్ హైలైట్ అనిపిస్తుంది. అఖండ దీపం నేపథ్యంలో క్లైమాక్స్‌ను దర్శకుడు ఇంట్రెస్టింగ్‌గా రాసుకున్నాడు. రొటీన్‌కు భిన్నంగా సినిమా ఎండ్ అవుతుంది.
మమ్ముట్టి నట విశ్వరూపం...
కొడుమోన్ పొట్టి పాత్రలో మమ్ముట్టి తన నట విశ్వరూపంతో అదరగొట్టాడు. అతడి లుక్, బాడీలాంగ్వేజ్, డైలాగ్స్ విభిన్నంగా ఉంటాయి. నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్ లో జీవించాడు. మమ్ముట్టి తర్వాత అర్జున్ అశోకన్ నటన బాగుంది. కుడమోన్ పొట్టి భవంతి నుంచి బయటపడేందుకు ప్రయత్నించే గాయకుడి పాత్రలో ఒదిగిపోయాడు. వంటవాడిగా సిద్ధార్థ్ భరతన్ యాక్టింగ్ ఈ సినిమాకు ప్లస్‌గా నిలిచింది.
మమ్ముట్టి యాక్టింగ్ కోసం...
భ్రమయుగం డిఫరెంట్ ఫీల్‌ను కలిగించే హారర్ మూవీ. మమ్ముట్టి యాక్టింగ్ కోసం మిస్ కాకుండా చూడాల్సిన మూవీ ఇది.
టాపిక్