Vfx Movies Trend and Trolls: గ్రాఫిక్స్ ఫుల్ - కంటెంట్ నిల్ - ఆదిపురుష్, బ్రహ్మాస్త్రపై విమర్శలకు కారణాలు ఇవేనా
07 October 2022, 14:21 IST
Vfx Movies Trend and Trolls: ప్రస్తుతం గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ హంగులతో సినిమాల్ని రూపొందించే ధోరణి బాలీవుడ్‌తో పాటు మిగిలిన సినీ పరిశ్రమలలో ఎక్కువగా కనిపిస్తోంది. అయితే ఈ ఆధునిక సాంకేతికతపై ఆధారపడే క్రమంలో కథను విస్మరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వీటిపై బాలీవుడ్ ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారంటే...
ప్రభాస్
Vfx Movies Trend and Trolls: ప్రస్తుతం పెరిగిన ఆధునిక సాంకేతికత ను అందిపుచ్చుకుంటూ వెండితెరపై విజువల్ వండర్స్‌ను క్రియేట్ చేసే ధోరణి అన్ని సినిమా ఇండస్ట్రీలలో కనిపిస్తోంది. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ హంగులతో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తూ థియేటర్లకు రప్పించేందుకు దర్శకులు ప్రయత్నిస్తున్నారు.
పౌరాణిక కథాంశాలకు సాంకేతిక హంగులను జోడిస్తూ కొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని సార్లు సినిమాకు ఊపిరిగా నిలిచే కథను విస్మరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కథల విషయంలో రాజీపడుతూ కేవలం గ్రాఫిక్స్ హంగులను నమ్ముకొని సినిమాల్ని తెరకెక్కించడం మంచిదికాదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఓంరౌత్‌పై విమర్శలు
గత కొద్ది రోజులుగా ప్రభాస్ ఆదిపురుష్ సినిమాను సోషల్ మీడియాలో నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్, సైఫ్ అలీఖాన్ లుక్‌తో పాటు రామాయణ కాలాన్ని విజువల్స్ ఎఫెక్ట్స్‌లో రీ క్రియేట్ చేసిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.రామాయణ గాథలోని ఓ చిన్న అంశాన్ని తీసుకొని త్రీడీ, మోషన్ క్యాప్చర్ టెక్నాలజీలో దాదాపు ఐదు వందల కోట్ల వ్యయంతో దర్శకుడు ఓంరౌత్ ఈ సినిమాను తెరకెక్కించాడు. సాంకేతికత కోసం అతడు చేసిన రీసెర్చ్‌లో పదోవంతు కూడా కథ, పాత్రల డిజైనింగ్‌పై దృష్టిపెట్టలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
విజువల్ ఎఫెక్ట్స్ వల్లే...
ఆదిపురుష్ తో పాటు ఇటీవల విడుదలైన బ్రహ్మస్త్ర సినిమా కథ, కథనాలపై నెగెటివ్ కామెంట్స్ చాలానే వినిపించాయి. రణ్‌భీర్ కపూర్ అలియాభట్ జంటగా నటించిన బాలీవుడ్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కానీ గ్రాఫిక్స్ తప్పితే కథ పరంగా చెప్పుకోవడానికి ఈ సినిమాలో ఏమీ లేదంటూ పలువురు క్రిటిక్స్ విమర్శించారు. మరికొందరు మాత్రం గ్రాఫిక్స్ వల్లే ఈ సినిమా హిట్ గా నిలిచిందని చెబుతున్నారు. రణ్‌భీర్, అలియాభట్ కెమిస్ట్రీ కంటే గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ మాత్రమే ఈ సినిమాను నిలబెట్టాయని చెబుతున్నారు. కొన్ని కథలను చెప్పడానికి గ్రాఫిక్స్ తో మాత్రమే సాధ్యమవుతుందని అంటున్నారు. వాటిలో ఆదిపురుష్, బ్రహ్మాస్త ఒకటని అంటున్నారు.
అంచనాల్ని పెంచుతున్నారు...
ప్రస్తుతం ప్రేక్షకుల్ని థియేటర్స్‌కు రప్పించడం దర్శకులకు ఛాలెంజింగ్‌గా మారిపోయిందని, డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తేనే సినిమాలు చూస్తున్నారని అందుకే విఎఫ్ఎక్స్‌కు ప్రాధాన్యత పెరిగిందని ట్రేడ్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. రెగ్యులర్ విజువల్స్, కథలను చూడటానికి ఇష్టపడటం లేదని పేర్కొంటున్నారు. సినిమా ప్రమోషన్స్‌లో గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్‌ను ప్రధాన అస్త్రంగా ఉపయోగించడం తప్పు కాదని, కానీ అతిగా వాటినే ప్రమోట్ చేస్తూ అంచనాలు పెంచడం కూడా విమర్శలకు కొన్ని సార్లు కారణమవుతోందని బాలీవుడ్ ఫిల్మ్ ఎనలిస్ట్‌లు చెబుతున్నారు.
కథలు అవసరమే...
గ్రాఫిక్స్ కోసమే వందల కోట్లు బడ్జెట్ వెచ్చించామని చెబుతూ తమకు తామే అంచనాలను పెంచుతూ ఒత్తిడిని కొని తెచ్చుకుంటున్నారని, వాటిని అందుకోలేక కొన్ని సార్లు విమర్శలను ఎదుర్కోవాల్సివస్తుందని అంటున్నారు. గ్రాఫిక్స్ ముఖ్యమే కానీ కథలపై కూడా దృష్టిసారించాలని అంటున్నారు.