Waheeda Rehman Dadasaheb Phalke: వహీదా రెహమాన్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు - అనౌన్స్ చేసిన కేంద్రం
26 September 2023, 13:40 IST
Waheeda Rehman Dadasaheb Phalke: బాలీవుడ్ నటి వహీదా రెహమాన్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2023 ఏడాదికిగాను వహీదా రెహమాన్‌కు ఈ అవార్డు ను అందజేయబోతున్నట్లు సెంట్రల్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు.
వహీదా రెహమాన్
Waheeda Rehman Dadasaheb Phalke: బాలీవుడ్ సీనియర్ నటి వహీదా రెహమాన్‌కు కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును ప్రకటించింది. దేశ అత్యున్నత సినీ పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును 2023 ఏడాదికిగాను వహీదా రెహమాన్‌కు అందజేయబోతున్నట్లు మంగళవారం కేంద్ర ఇన్ఫర్మేషన్ బ్రాడ్‌కాస్టింగ్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
ఐదు దశాబ్దాల పాటు సినీ రంగానికి వహీదా రెహమాన్ చేసిన అసమాన సేవలను గుర్తించి ఈ పురస్కారాన్ని వహీదా రెహమాన్‌కు అందజేయబోతున్నట్లు అనురాగ్ ఠాకూర్ తెలిపాడు.
ప్యాసా, కాగజ్ కే పూల్, సాహెబ్ బీవీ ఔర్ గులామ్, గైడ్, ఖామోషీతో పాటు ఎన్నో బాలీవుడ్ సినిమాల్లో అజరామరమైన నటనతో విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల్న మన్ననల్ని వహీదా రెహమాన్ అందుకున్నారని అనురాగ్ ఠాకూర్ తన ట్వీట్‌లో తెలిపాడు.
జాతీయ అవార్డు…
రేష్మా ఔర్ షేరా సినిమాలో అద్భుత నటనతో ఉత్తమ నటిగా జాతీయ పురస్కారాన్ని వహీదా రెహమాన్ దక్కించుకున్నదని అనురాగ్ ఠాకూర్ గుర్తుచేశారు. కమిట్‌మెంట్, హార్డ్‌వర్క్‌తో గొప్ప నటిగా అత్యున్నత శిఖరాల్ని అధిరోహించారని, పద్మశ్రీ, పద్మభూషన్ వంటి అవార్డులను సొంతం చేసుకున్న ఎంతో మంది మహిళలకు వహీదా రెహమాన్ ఆదర్శంగా నిలిచారని మినిస్టర్ అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నాడు.
మహిళా బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపిన తరుణంలో వహీదా రెహమాన్‌కు దాదాసాహెబ్ ఫాల్కే లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును ప్రకటించడం ఆనందంగా ఉందని పేర్కొన్నాడు.
హిందీతో పాటు దక్షిణాది భాషల్లో కలిపి 100కుపైగా సినిమాలు చేసింది వహీదా రెహమాన్. తెలుగులో సింహాసనం, చుక్కల్లో చంద్రుడు సినిమాల్లో నటించింది. 2021లో రిలీజైన స్కేటర్ గర్ల్ తర్వాత నటనకు దూరమైంది వహీదా రెహమాన్. ఆమె స్వస్థలం హైదరాబాద్ కాగా...విజయవాడలో చదువుకున్నది.