Pallavi Prashanth Bail: పల్లవి ప్రశాంత్‍కు ఊరట.. బెయిల్ మంజూరు
22 December 2023, 18:12 IST
- Pallavi Prashanth Bail: బిగ్‍బాస్ విజేత పల్లవి ప్రశాంత్‍కు బెయిల్ వచ్చింది. నాంపల్లి కోర్టు అతడికి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది.
Pallavi Prashanth Bail: పల్లవి ప్రశాంత్‍కు ఊరట.. బెయిల్ మంజూరు
Pallavi Prashanth Bail: బిగ్‍బాస్ తెలుగు 7వ సీజన్ టైటిల్ విజేత రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‍కు ఉపశమనం లభించింది. నాంపల్లి కోర్టు అతడికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద ఘర్షణకు కారణమయ్యాడనే కేసులో అరెస్ట్ అయిన అతడికి ఎట్టకేలకు ఊరట దక్కింది. పల్లవి ప్రశాంత్ పిటిషన్‍పై నేడు (డిసెంబర్ 22) నాంపల్లి కోర్టు విచారణ జరిపింది. బెయిల్ ఇస్తూ కొన్ని షరతులను విధించింది.
విచారణ కోసం ఆదివారం మళ్లీ పోలీసుల ముందుకు వెళ్లాలని పల్లవి ప్రశాంత్‍ను న్యాయస్థానం ఆదేశించింది. రూ.15వేల చొప్పున ఇద్దరి పూచీకత్తులను ఇవ్వాలని సూచించింది. దీంతో చంచల్‍గూడ జైలు నుంచి ప్రశాంత్ విడుదల కానున్నాడు.
గత ఆదివారం (డిసెంబర్ 17) బిగ్‍బాస్ తెలుగు 7వ సీజన్ గ్రాండ్ ఫినాలే ముగిశాక హైదరాబాద్‍లోని అన్నపూర్ణ స్టూడియోస్ బయట గొడవ జరిగింది. ఈ సీజన్ విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్, రన్నర్‌గా నిలిచిన అమర్ దీప్ అభిమానుల మధ్య వాగ్వాదం జరిగింది. ఆ సందర్భంగా కొందరు ఇతర కంటెస్టెంట్ల వాహనాలు, ప్రైవేటు వాహనాలు, ఆర్టీసీ బస్సుల అద్దాలను పల్లవి ప్రశాంత్ మద్దతుదారులు ధ్వంసం చేశారని కేసు నమోదైంది. అక్కడి నుంచి హడావుడి లేకుండా వెళ్లాలని పోలీసులు చెప్పినా.. పల్లవి ప్రశాంత్ వినిపించుకోలేదని వీడియోలు కూడా బయటికి వచ్చాయి.
పల్లవి ప్రశాంత్ హంగామా చేయడం వల్ల అల్లర్లు ఎక్కువయ్యాయని పోలీసులు కూడా చెప్పారు. ఈ అల్లర్ల కేసులో ఏ1గా ఉన్న పల్లవి ప్రశాంత్‍ను రెండు రోజుల క్రితం డిసెంబర్ 20న జూబ్లిహిల్స్ పోలీసులు.. అతడి గ్రామమైన కొలుగూరుకు వెళ్లి అరెస్ట్ చేశారు. అతడి సోదరుడితో పాటు మరికొందరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకు ముందు అతడు పరారీలో ఉన్నట్టు కూడా వార్తలు వచ్చాయి. దీంతో తాను ఇంట్లోనే ఉన్నానని ప్రశాంత్ వీడియో చేశారు. దీంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
అనంతరం పల్లవి ప్రశాంత్‍ను కోర్టు ఎదుట హాజరుపరిచారు పోలీసులు. అతడికి 14 రోజుల రిమాండ్ విధించింది న్యాయస్థానం. దీంతో ప్రశాంత్‍ను చంచల్‍గూడ జైలుకు పోలీసులు తరలించారు. అయితే, ఇప్పుడు నాంపల్లి కోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసింది.