Pallavi Prashanth: బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్‌కు 14 రోజుల రిమాండ్.. చంచల్ గూడా జైలుకు తరలింపు
21 December 2023, 8:41 IST
Bigg Boss Pallavi Prashanth To Remand: బిగ్ బాస్ 7 తెలుగు విజేత పల్లవి ప్రశాంత్‌ను సుమారు ఆరు గంటలపాటు పోలీసులు విచారించారు. అనంతరం ప్రశాంత్‌కు 14 రోజుల రిమాండ్ విధించారు.
బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్‌కు 14 రోజుల రిమాండ్.. చంచల్ గూడా జైలుకు తరలింపు
Pallavi Prashanth To Jail: బిగ్ బాస్ 7 తెలుగు విన్నర్ పల్లవి ప్రశాంత్, అతని సోదురుడు మహావీర్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. బుధవారం సాయంత్రం పల్లవి ప్రశాంత్ సొంత గ్రామం గజ్వేల్‌లోని కొల్లూరులో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఇద్దరినీ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, ప్రైవేటు ఆస్తుల ధ్వంసం కేసులో పల్లవి ప్రశాంత్, అతని సోదురుడు మహావీర్‌ను పోలీసులు సుమారు 6 గంటలపాటు విచారించారు. అనంతరం రాత్రి సమయంలో జడ్జి ఇంట్లోనే ఇద్దరిని ప్రవేశపెట్టారు. ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయమూర్తి.. ప్రశాంత్, మహావీర్ ఇద్దరికీ 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో వారిని అర్ధరాత్రి చంచల్‌గూడా జైలుకు తరలించారు పోలీసులు.
పోలీసులు ముందే హెచ్చరించినా సెలబ్రిటీ ముసుగులో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగేలా చేస్తే ఊరుకోమని పోలీసులు తెలిపారు. మొత్తంగా ఇద్దరిపై ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల ధ్వంసం కేసును పోలీసులు నమోదు చేశారు.
కాగా బిగ్ బాస్ 7 తెలుగు గ్రాండ్ ఫినాలే రోజున అన్నపూర్ణ స్టూడియో వద్ద ప్రభుత్వ ఆస్తులపై జరిగిన దాడి ఘటనలో ప్రశాంత్‌ను A1 నిందితుడిగా, అతని సోదురుడు మహావీర్‌ను A2 నిందితుడుగా పేర్కొంటూ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే, బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే తర్వాత కేసు నమోదు అయినట్లు తెలుసుకున్న ప్రశాంత్ పరారీలో ఉన్నాడు. దీనికి సంబంధించిన న్యూస్ వైరల్ కావడం, పోలీసులు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయడంతో లాయర్ ద్వారా ఇంటికి చేరుకున్నాడు ప్రశాంత్.
విషయం తెలుసుకున్న పోలీసులు ప్రశాంత్‌తోపాటు అతని సోదరుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులో జూబ్లీహిల్స్ ఎస్సై మెహర్ రాకేష్ ఫిర్యాదుతో కేసు నమోదు అయింది. పల్లవి ప్రశాంత్, మహా వీర్, వినయ్‌తోపాటు అద్దె కార్లను నడిపిన డ్రైవర్స్ సాయికిరణ్, రాజుపై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ నెల 19న డ్రైవర్లు సాయికిరణ్, రాజుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. తాజాగా ప్రశాంత్, మహావీర్‌కు రిమాండి విధించారు.