Beast Review | విజయ్ బీస్ట్ రివ్యూ...నో లాజిక్స్ ఓన్లీ ఫన్
13 April 2022, 12:06 IST
విజయ్ హీరోగా నటించిన తమిళ చిత్రం ‘బీస్ట్’ అదే పేరుతో డబ్బింగ్ రూపంలో నేడు తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. డాక్టర్ ఫేమ్ నెల్సన్ దిలీప్‌కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ తమిళ అనువాద చిత్రం ఎలా ఉందంటే...
విజయ్
విజయ్ సినిమా విడుదల అవుతుందంటే తమిళనాట సినీ అభిమానులకు పండుగే. బాక్సాఫీస్ రికార్డులు, వసూళ్లతో కోలీవుడ్‌లో సందడి వాతావరణం నెలకొంటుంది. తెలుగులో మాత్రం ఆ హడావిడి కనిపించదు. సూర్య, కార్తి, విక్రమ్ లాంటి హీరోలతో పోలిస్తే విజయ్‌కి టాలీవుడ్‌లో పెద్దగా మార్కెట్ లేదు. తుపాకీ తర్వాత టాలీవుడ్‌పై ప్రత్యేకంగా దృష్టిసారించడం మొదలుపెట్టారు విజయ్. మెర్సల్, విజిల్ లాంటి అనువాదాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేసిన పెద్దగా ఫలించలేదు. ఆయన నటించిన తాజా తమిళ చిత్రం ‘బీస్ట్’ అదే పేరుతో తెలుగులో నేడు విడుదలైంది. ‘డాక్టర్’ తో విజయాన్ని అందుకున్న నెల్సన్ దిలీప్‌కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అరబిక్ కుతు పాట పెద్ద హిట్ అవ్వడంతో కోలీవుడ్ జనాలతో పాటు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఈ సినిమా ఆసక్తిని రేకెత్తించింది. . విజయ్ ఈ సినిమాతో తెలుగులో హిట్ కొట్టాడా? కేజీఎఫ్-2 ను తట్టుకొని థియేటర్లలో నిలబడగలిగే కెపాసిటీ ఈ చిత్రానికి ఉందా లేదా అన్నది తెలియాలంటే కథలోని వెళ్లాల్సిందే...
కథా పరిచయం
వీర రాఘవన్(విజయ్) ‘రా’ ఏజెంట్ గా పనిచేస్తుంటాడు. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఉమర్ ఫరూక్ ను మూడు నెలలు ప్లాన్ చేసి స్పెషల్ ఆపరేషన్ ద్వారా వీర రాఘవన్ పట్టుకుంటాడు. కానీ ఈ ప్రయత్నం లో తన ప్రమేయం లేకుండానే ఓ చిన్నారి ప్రాణాలను కోల్పోతుంది. ‘రా’ అధికారుల తప్పు వల్లనే ఆ పొరపాటు జరిగిందనే కోపం తో వీర ఉద్యోగాన్ని వదిలిపెడతాడు. ప్రియురాలు ప్రీతి(పూజాహెగ్డే) కోరిక మేరకు ఓ సెక్యూరిటీ ఏజెన్సీ లో ఉద్యోగం లో చేరతాడు. ఈస్ట్ కోస్ట్ అనే మాల్ సెక్యూరిటీ వ్యవహారాలను మాట్లాడేందుకు తన బాస్(వీటీవీ గణేష్), ప్రీతితో కలిసి వీర వెళతాడు. హఠాత్తుగా ఆ మాల్ ను టెర్రిరిస్ట్ లు హైజాక్ చేసి అందులో ఉన్న ప్రజలను బందీలుగా చేస్తారు. ఉమర్ ఫరూఖ్‌ను వదిలిపెట్టాలని డిమాండ్ చేస్తారు. ఆ మాల్ లోనే వీరరాఘవన్ చిక్కుకుంటాడు. టెర్రరిస్ట్‌లు ప్లాన్ ను భగ్నం చేసే బాధ్యతను వీరకు అప్పగిస్తాడు ‘రా’ ఉన్నతాధికారి అల్తాఫ్(సెల్వరాఘవన్). తొలుత అతడి ప్రతిపాదనను తిరస్కరించిన వీర రాఘవన్ ప్రజల ప్రాణాలను కాపాడటం కోసం ఆ బాధ్యతను చేపట్టడానికి అంగీకరిస్తాడు. ఆ టెర్రిరిస్ట్ లను వీర రాఘవన్ ఎలా ఎదుర్కొన్నాడు? ప్రజల ప్రాణాలను ఏ విధంగా కాపాడాడు? ఈ పోరాటంలో అతడికి ప్రీతితో పాటు మిగతా వారు ఎలా సహకరించారన్నదే ఈ చిత్ర ఇతివృత్తం.
మాస్ ప్లస్ కామెడీ...
మాస్, యాక్షన్ అంశాలే హీరోగా విజయ్ బలం. దర్శకుడు నెల్సన్ కు కామెడీపై మంచి పట్టుంది. ఈ అంశాలన్నీ కలగలుపుతూ తెరకెక్కిన సినిమా ఇది. తీవ్రవాదం, దేశభద్రత పాయింట్ తో కూడిన సినిమా అంటే చాలా సీరియస్‌గా సాగుతుంది. అందులో కామెడీ పండించడం అంటే కత్తిమీద సాము లాంటిదే. ఏ మాత్రం తేడా కొట్టినా మొదటికే మోసం వస్తుంది. ఈ ఛాలెంజ్‌ను దర్శకుడు నెల్సన్ అద్భుతంగా డీల్ చేశాడు. సీరియస్ ఇష్యూను ఆద్యంతం పంచ్ డైలాగ్స్ తో వినోదాత్మకంగా తెరకెక్కించారు.
విజయ్ అభిమానులకు విందుభోజనం
విజయ్ నుంచి అభిమానులు కోరుకునే యాక్షన్, హీరోయిజం హంగులతో వారికి ఫుల్ మీల్స్ లా సినిమాను నడిపించారు. తొలి యాక్షన్ సీక్వెన్స్ తోనే విజయ్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో చూపించారు దర్శకుడు. అతడో బీస్ట్ లాంటివాడని చెబుతూ డిజైన్ చేసిన యాక్షన్ ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత కామెడీ జోన్‌లోకి సినిమాను మళ్లించారు. లవ్ ట్రాక్ పేరుతో టైమ్‌పాస్ చేయకుండా సింపుల్‌గా ఒక్క సీన్ తోనే నాయకానాయికల మధ్య ప్రేమాయణాన్ని మొదలుపెట్టాడు దర్శకుడు.
ఫుల్ కామెడీ
హీరోయిన్ ద్వారా హీరో మాల్ లోకి ఎంటర్ అవ్వడం, అది హైజాక్ కావడంతో కథ ఆసక్తికరంగా మారుతుంది. మిగిలిన సినిమా మొత్తాన్ని మాల్ లోనే నడిపించారు దర్శకుడు. తన పక్కనున్న అమాయకులను వాడుకుంటూ టెర్రిరిస్టులను హీరో బోల్తా కొట్టించే సన్నివేశాలను నుంచి కామెడీ చాలా జనరేట్ అయ్యింది. హీరో వేసే ప్లాన్స్ కారణంగా యోగిబాబు, వీటీవీ గణేష్ పడే ఇబ్బందులు నవ్వించాయి. ముఖ్యంగా టెర్రిరిస్ట్‌లతో సంప్రదింపులు జరిపే ‘రా’ ఆఫీసర్‌గా దర్శకుడు సెల్వరాఘవన్ క్యారెక్టర్ ను కొత్తగా రాసుకున్నారు దర్శకుడు. అతడి ప్రతి డైలాగ్ థియేటర్స్ లో నవ్వులు పూయించింది.
నో లాజిక్స్
ఈ సినిమాలో దర్శకుడు లాజిక్ లను పూర్తిగా పక్కనపెట్టి కేవలం నవ్వించడానికే దర్శకుడు ప్రాధాన్యమిచ్చాడు. వందలాది మంది ప్రజల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నా విజయ్ అండ్ టీమ్ మాత్రం ఎలాంటి టెన్షన్ లేకుండా మాల్ మొత్తం కలియతిరుగుతూ జోకులు వేయడం కొన్ని చోట్ల కన్వీన్సింగ్‌గా అనిపించదు. హైజాకింగ్ డ్రామా కారణంగా లవ్ ట్రాక్ పూర్తిగా సైడ్‌కు వెళ్లిపోయింది. ద్వితీయార్థంలో హీరోయిన్ గెస్ట్ క్యారెక్టర్‌గానే మారిపోయింది. ఒకటి అరా సన్నివేశాల్లో హీరోపై తనకున్న ప్రేమను చాటేందుకు హీరోయిన్ చేసే ప్రయత్నాలు బలవంతంగా ఇరికించినట్లుగా అనిపిస్తాయి. క్లైమాక్స్‌ను పూర్తిగా విజయ్‌లోని హీరోయిజాన్ని చూపించడానికే వాడుకున్నారు దర్శకుడు. కథకు సంబంధం లేనట్లుగా వస్తుందా యాక్షన్ ఎపిసోడ్.
స్టైలిష్ క్యారెక్టర్ లో విజయ్
వీరరాఘవన్ అనే మాజీ రా ఏజెంట్‌గా మాస్, స్టైలిష్ క్యారెక్టర్‌లో విజయ్ ఆకట్టుకున్నాడు. విజయ్ వన్ మెన్ షో ఇది. అతడు తప్ప మిగతా క్యారెక్టర్స్ ఏది పెద్దగా ప్రేక్షకుల్ని అట్రాక్ట్ చేయదు. సీరియస్ క్యారెక్టర్ లో తన కామెడీ టైమింగ్ తో నవ్వించారు. పూజాహెగ్డేను హీరోయిన్ అనడం కంటే గెస్ట్ అని చెప్పుకోవడమే మంచింది.
సెల్వరాఘవన్, యోగిబాబు, వీటీవీ గణేష్ తమ డైలాగ్స్ తో నవ్వించారు. కానీ ఆ అరవ కామెడీ తెలుగు ప్రేక్షకులకు ఏ మేరకు కనెక్ట్ అవుతుందన్నదే పెద్ద ప్రశ్న. అంకుర్ విలనిజంలో కొత్తదనం లేదు.
అరబిక్ కుతు అదుర్స్
అనిరుధ్ మ్యూజిక్ సినిమాకు పెద్దబలంగా నిలిచింది. సినిమాలో ఉన్నది అరబిక్ కుతు ఒక్కటే పాట. ప్రథమార్థంలో వచ్చే ఈ పాట ఆడియోన్స్ లో ఫుల్ జోష్‌ను నింపింది. విజయ్ కనబడే ప్రతిసారి అతడిలోని హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ వచ్చే బీజీఎమ్ బాగుంది. దర్శకుడిగా, రచయితగా నెల్సన్ మరోసారి ప్రతిభను చాటుకున్నారు. స్టార్ హీరో సినిమాను రెండున్నర గంటలు ఒకే చోట నడిపించడం ఈజీ కాదు. విజయ్ సినిమాపై ఉన్న అంచనాల్ని నిలబెడుతూ చక్కగా తెరకెక్కించాడు.
టైమ్‌పాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. విజయ్ అభిమానులను పూర్తిగా మెప్పిస్తుంది. కథలో కొత్తదనం లేకపోవడంతో కేజీఎఫ్-2 పోటీని తట్టుకొని ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడటం మాత్రం అనుమానమే.
రేటింగ్-2.5/5