National Film Awards: మరణానంతరం జాతీయ అవార్డ్... అయ్యప్పనుమ్ కోషియమ్ దర్శకుడికి పురస్కారం..
22 July 2022, 18:22 IST
68వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ లో ఉత్తమ దర్శకుడిగా అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాకు గాను సచీ అవార్డుకు ఎంపికయ్యారు. 2020 గుండెపోటుతో సచీ కన్నుమూశాడు. మరణానంతరం అతడికి జాతీయ పురస్కారం దక్కింది.
సచీ
68వ జాతీయ అవార్డు వేడుకల్లో మలయాళ చిత్రం అయ్యప్పనుమ్ కోషియమ్ పలు అవార్డులను దక్కించుకున్నది. ఉత్తమ దర్శకుడిగా సచీ, ఉత్తమ సహాయనటుడిగా బిజుమీనన్‌తో పాటు పలు విభాగాల్లో ఈ సినిమా అవార్డులను సొంతం చేసుకున్నది. కాగా 2020 ఏడాదికి గాను ఉత్తమ దర్శకుడి గా అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాకుగాను సచీని ఎంపిక చేసినట్లు జ్యూరీ సభ్యులు ప్రకటించారు. అతడు 2020లోనే గుండెపోటుతో కన్నుమూశాడు. మరణించిన తర్వాత అతడికి జాతీయ అవార్డు దక్కింది.
ఇద్దరు వ్యక్తుల మధ్య ఈగో కారణంగా మొదలైన శత్రుత్వంతో దర్శకుడు సచీ ...అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాను తెరకెక్కించాడు. పృథ్వీరాజ్ సుకుమారన్, బీజుమీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2020 ఫిబ్రవరిలో విడుదలైంది. సినిమా విడుదలైన నాలుగు నెలల తర్వాత గుండెపోటుతో సచీ కన్నుమూశాడు. తుంటి ఎముక సమస్యతో బాధపడుతున్న అతడికి వైద్యులు సర్జరీ చేశారు. కానీ సర్జరీ వికటించి గుండెపోటుకు దారితీయడంతో అతడు కన్నుమూశాడు. కేరళ హైకోర్టులో క్రిమినల్ లాయర్ గా చాలా కాలం పాటు ప్రాక్టీస్ చేసిన సచీ సినిమాలపై ఆసక్తిగా రచయితగా మలయాళ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు.
డ్రైవింగ్ లైసెన్స్, రామ్ లీలా, రన్ బేబీ రన్ తో పాటు పలు సినిమాలకు సోలో రైటర్ గా పనిచేశాడు. స్నేహితుడు సేతుతో కలిసి రాబిన్ హుడ్, సీనియర్స్, డబుల్స్ సినిమాలకు కథలను అందించాడు. 2015లో విడుదలైన అనార్కలి సినిమాతో సచీ దర్శకుడిగా మారాడు. ఆ తర్వాత అయ్యప్పనుమ్ కోషియమ్ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇదే అతడు రెండవ, చివరి సినిమా కావడం గమనార్హం. అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాను తెలుగులో భీమ్లానాయక్ గా రీమేక్ చేశారు. ఈ రీమేక్ లో పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా నటించారు. సచీ పూర్తి పేరు కే.ఆర్ సచ్చిదానందన్