2023 Tollywood Hits And Flops: 45 రోజులు - మూడు బాక్సాఫీస్ హిట్స్ - 2023 టాలీవుడ్ ఆరంభం అదిరింది
16 February 2023, 8:11 IST
2023 Tollywood Hit And Flops: 2023లో టాలీవుడ్‌కు చక్కటి ఆరంభం దక్కింది. గడిచిన నలభై ఐదు రోజుల్లో పలువురు స్టార్ హీరోలు తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. వాటిలో విజయాల్ని సాధించిన సినిమాలు ఏవంటే...
బాలకృష్ణ, శృతిహాసన్
2023 Tollywood Hit And Flops: టాలీవుడ్‌లో ప్రతి ఏటా విజయాల శాతం పదికి మించదు. ప్రతి ఏడాది 150 నుంచి 200 వరకు సినిమాలు రిలీజైనా అందులో సక్సెస్‌లు సంఖ్య 20 నుంచి 30 మధ్యలోనే ఉంటుంది. వరుసగా విజయాలు దక్కడం అరుదనే చెప్పుకోవాలి. 2023 ప్రారంభమై అప్పుడే నెలన్నర పూర్తయింది. ఈ నలభై ఐదు రోజుల్లో మూడు కమర్షియల్ హిట్స్ దక్కాయి.
సంక్రాంతికి రిలీజైన చిరంజీవి వాల్తేర్ వీరయ్యతో పాటు బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలు బ్లాక్‌బస్టర్ సక్సెస్‌లుగా నిలిచి టాలీవుడ్‌కు అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. చిరంజీవి, రవితేజ హీరోలుగా నటించిన వాల్తేర్ వీరయ్య సినిమా 230 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది.
పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు బాబీ ఈ సినిమాను తెరకెక్కించాడు. చిరులోని మాస్ కోణాన్ని, కామెడీ టైమింగ్ ను లాంగ్ గ్యాప్ తర్వాత పూర్తిస్థాయిలో ఈ సినిమాలో చూపించారు బాబీ. తెలుగు రాష్ట్రాల్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన నాలుగో టాలీవుడ్ మూవీగా వాల్తేర్ వీరయ్య నిలిచింది.
బాలకృష్ణ కెరీర్‌లో హయ్యెస్ట్…
చిరంజీవి సినిమాకు పోటీగా రిలీజైన బాలకృష్ణ వీరసింహారెడ్డి కూడా వంద కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. బాలకృష్ణ కెరీర్‌లో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా నిలిచింది. రాయలసీమ ఫ్యాక్షనిజానికి అన్నాచెలెళ్ల అనుబంధం జోడించి దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ సినిమాను రూపొందించారు. ఈ రెండు సినిమాలు తప్ప జనవరిలో మరో హిట్ దక్కలేదు. జనవరి 26న రిలీజైన సుధీర్ బాబు హంట్ సినిమా ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది.
రైటర్ పద్మభూషణ్ మాత్రమే...
ఫిబ్రవరి నెలలో కళ్యాణ్‌రామ్, సందీప్‌కిషన్‌తో పాటు పలువురు హీరోలు తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. వీరిలో సుహాస్ మినహా మిగిలిన వారికి విజయం వరించలేదు. సుహాస్ హీరోగా నటించిన రైటర్ పద్మభూషణ్ చక్కటి వసూళ్లను రాబడుతోంది.
కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథాంశంతో రూపొందిన ఈ సినిమా తొలి వారంలో పది కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టి నిర్మాతలకు లాభాల్ని మిగిల్చింది. భారీ అంచనాలతో విడుదలైన కళ్యాణ్ రామ్ అమిగోస్, సందీప్ కిషన్ మైఖేల్ ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయాయి. కథలో బలం లేకపోవడంతో ఈ రెండు సినిమాలకు ఆశించిన రిజల్ట్ రాలేదు.
చిన్న సినిమాల మెరుపులు లేవు…
ఈ 45 రోజుల్లో ప్రత్యర్థి, పాప్ కార్న్, ది రెబెల్ ఆఫ్ తుపాకుల గూడెం, సింధూరంతో పాటు మరికొన్ని చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. వాటిలో ఏవి బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయాయి.