Nakrekal Fight: ఆసక్తి రేపుతున్న నకిరేకల్ ఎన్నికల పోరు
24 November 2023, 11:24 IST
- Nakrekal Fight: ఉమ్మడి నల్గొండ జిల్లా నకిరేకల్ ఎస్సీ రిజర్వుడు నియోజక వర్గంలో గెలుపు ఎవరిని వరిస్తుందనే దానిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
నకిరేకల్‌లో విజయం దక్కేది ఎవరికి
Nakrekal Fight: ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రెండు ఎస్సీ రిజర్వుడు నియోజక వర్గాల్లో నకిరేకల్ ఒకటి. 2007లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో జనరల్ స్థానం నుంచి ఎస్సీ రిజర్వుడు కోటాలోకి మారింది. అంటే 2009 ఎన్నికల నుంచే ఇక్కడ ఎస్సీ అభ్యర్థులు పోటీలో ఉంటున్నారు.
1957 నుంచి 2004 ఎన్నికల వరకు ఈ నియోజకవర్గంలో 11 ఎన్నికలు జరిగితే కేవలం ఒకే ఒక్క సారి 1972 లో కాంగ్రెస్ గెలవగా మిగిలిన పది ఎన్నికల్లో వామపక్షాలు గెలిచాయి. 1957లో పీడీఎఫ్, 1962లో సీపీఐ, ఇక మిగిలిన ఎనిమిది పర్యాయాలూ సీపీఎం జయకేతనం ఎగురవేసింది.
జనరల్ స్థానం నుంచి ఎస్సీలకు రిజర్వు అయిన తర్వాత జరిగిన మూడు ఎన్నికల్లో సీపీఎం ఒక్క ఎన్నికల్లోనూ గెలవలేక పోయింది. ఈ మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ రెండు సార్లు, బీఆర్ఎస్ ఒక సారి గెలిచాయి. 2023 ఎన్నికల్లోనూ పోటీ బీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్యనే హోరా హోరీగా సాగుతోంది.
ముఖా ముఖి పోరు
నకిరేకల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్య ముఖా ముఖి పోరు జరగనుంది. ఇక్కడి నుంచి బీఎస్పీ, బీజేపీ తదితర పార్టీలు పోటీలో ఉన్నా, ప్రధాన పోటీ మాత్రం బీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్యనే కొనసాగనుంది.
గత ఈ ఎన్నికల్లో తలపడుతున్న అభ్యర్థుల పార్టీలు మారినా, పాత ప్రత్యర్థులే పోటీలో ఉన్నారు. 2014లో బీఆర్ఎస్ నుంచి వేముల వీరేశం, కాంగ్రెస్ నుంచి చిరుమర్తి లింగయ్యలు పోటీపడగా, ఆ ఎన్నికల్లో వీరేశం గెలిచారు.
2018 ఎన్నికల్లో సైతం ఈ ఇద్దరే ప్రత్యర్థులు కాగా, ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి చిరుమర్తి లింగయ్య విజయం సాధించగా, వీరేశం ఓటమి పాలయ్యారు. కాగా, కొన్నాళ్లకు నియోజకవర్గ డెవలప్ మెంట్ కోసమంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య బీఆర్ఎస్ లో చేరిపోయారు.
2023 ఎన్నికల విషయానికి వస్తే.. సిట్టింగ్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకే బీఆర్ఎస్ టికెట్ ఇవ్వడంతో, బీఆర్ఎస్ లో చివరికంటా కొనసాగిన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం వేరు దారి చూసుకోవాల్సి వచ్చింది. బీఆర్ఎస్ లో టికెట్ వచ్చే అవకాశం లేకపోవడంతో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని ఆ పార్టీ తరపున పోటీలో నిలిచారు.
2018 ఎన్నికల్లో తలపడిన ప్రత్యర్థులే ఈ ఎన్నికల్లోనూ పోటీ పడుతున్నా వారి పార్టీలు మాత్రం తారుమారయ్యాయి. బరిలో నాలుగు పార్టీలు ఉన్నా.. పోటీ మాత్రం ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ లమధ్యే కనిపిస్తోంది. బీజేపీ, బీఎస్పీ నామమాత్రపు పోటీకే పరిమితం కానున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఎవరి ధీమా వారిది
ఈ ఎన్నికల్లో గెలుపు అవకాశాలపై ఎవరి ధీమా వారికి ఉంది. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ కార్యక్రమాలు, అభివ్రుద్ది పనులు తనను గట్టెక్కిస్తాయన్న ఆశలో అధికార బీఆర్ఎస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య ఉన్నారు. కానీ, ఆయన గత ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ పై గెలిచి, గులాబీ పార్టీలోకి వెళ్లిపోయారన్న ఆగ్రహం కాంగ్రెస్ వర్గాల్లో ఉంది.
చిరుమర్తి లింగయ్య పార్టీ మారిన సమయంలో సైతం కాంగ్రెస్ ను వీడి ఆయన వెంట బీఆర్ఎస్ లోకి వచ్చిన ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు తక్కువ. దీంతో వారు ఈ ఎన్నికల్లో తమ పార్టీని మధ్యలోనే వదిలేసి, కార్యకర్తలను పట్టించుకోకుండా, తనను గెలిపించిన వారి గురించి ఆలోచించకుండా పార్టీ మారారని, ఈ సారి అసెంబ్లీ గేటు దాటనివ్వమని ఇక్కడి కాంగ్రెస్ శ్రేణులు ప్రతినబూనాయి.
మరో వైపు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన వేముల వీరేశం చివరి నిమిషం వరకు బీఆర్ఎస్ టికెట్ వస్తుందని ఎదురు చూసినా ఫలితం లేకపోవడంతో అనివార్యంగా ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోవాల్సి వచ్చింది. మొదటి నుంచి బీఆర్ఎస్ లో బలమైన వర్గమంతా వీరేశంతోనే కొనసాగింది.
కాంగ్రెస్ నుంచి వచ్చి తమ పార్టీలో చేరిన ఎమ్మెల్యే చిరుమర్తితో వీరు కలిసిపోలేక పోయారు. ఇపుడు ఈ వర్గమంతా వీరేశంతో కాంగ్రెస్ లోకి మారిపోయింది. ఇప్పటికే బలంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులతో వీరు కలిసిపోవడంతో తమ గెలుపు ఖాయమన్న ధీమాలో కాంగ్రెస్ నాయకత్వం ఉంది.
2014లో ఎమ్మెల్యేగా గెలిచిన వేముల వీరేశం తన పనితీరు, వ్యవహారాలతో కొంత వివాదాస్పదం అయ్యారు. అందుకే కాంగ్రెస్ లోని ఒక సెక్షన్ లోపాయికారిగా తనకు సహకరిస్తుందన్న అంచనాలో బీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నారు. మొత్తానికి ఎవరికి లెక్కలు వారికి ఉన్నాయి.
సాధారణ జనాభిప్రాయం, నిఘా వర్గాల నివేదికలు సైతం కాంగ్రెస్ మొగ్గు ఉందని చెబుతుండడంతో బీఆర్ఎస్ నాయకత్వం ఈ నియోజకవర్గ ఎన్నికను సవాలుగా తీసుకుంది. ఆ పార్టీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ ఇప్పటికే ఒక సారి బహిరంగ సభలో పాల్గొని వెళ్ళగా, వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించారు.
కాంగ్రెస్ అభ్యర్థి తరపునా ఆ పార్టీ నాయకులు జోరుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ముఖా ముఖి పోటీలో చివరకు ఎవరు విజయం సాధిస్తారో అన్న ఉత్కంఠ నకిరేకల్ నియోజకవర్గంలో నెలకొని ఉంది.
( రిపోర్టింగ్ : క్రాంతీపద్మ, నల్గొండ )