NOTA Votes : వరంగల్జిల్లాలో నోటాకు మొగ్గుచూపిన ఓటర్లు, 21 వేలకు పైగా ఓట్లు
04 December 2023, 17:30 IST
- NOTA Votes : ఉమ్మడి వరంగల్ జిల్లాలో నోటాకు భారీగా ఓట్లు పడ్డాయి. ప్రముఖ లీడర్లు ఉన్న నియోజకవర్గాల్లో నోటాకు అధికంగా ఓట్లు పడడం గమనార్హం.
నోటా
NOTA Votes : ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలామంది ఓటర్లకు ఏ పార్టీ అభ్యర్థులూ నచ్చలేదట. అందుకే వాళ్లంతా ఏ అభ్యర్థికి ఓటు వేయకుండా నోటా వైపు మొగ్గు చూపారు. ఇందులో ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో ప్రముఖంగా చెప్పుకునే లీడర్లు ఉన్న చోట్లనే నోటాకు అత్యధిక ఓట్లు రావడం గమనార్హం.
21 వేల మందికిపైగా
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉండగా.. అందులో కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ 2 సెగ్మెంట్లలో విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరూ తమకు నచ్చలేదంటూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 21 వేల మందికి పైగా ఓటర్లు నోటాకు ఓటేయడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మొత్తంగా 21,174 మంది నోటాకు ఆసక్తి చూపడం విస్మయాన్ని కలిగిస్తోంది. ఇందులో అత్యధికంగా వర్ధన్నపేట నియోజకవర్గంలోనే పోలవడం గమనార్హం. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి అరూరి రమేశ్, కాంగ్రెస్ నుంచి రిటైర్డ్కేఆర్నాగరాజు, బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, ఇంకో 12 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వాళ్లెవరికీ ఓటు వేయకుండా మొత్తంగా 3,612 మంది నోటాను ఎంచుకోవడం గమనార్హం. ఇదిలాఉంటే ఎర్రబెల్లి దయాకర్‌రావు పోటీ చేసిన పాలకుర్తి నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్నుంచి ఎర్రబెల్లి దయాకర్‌రావు, కాంగ్రెస్ నుంచి మామిడాల యశస్వినీ రెడ్డి, బీజేపీ నుంచి లేగ రాంమోహన్ రెడ్డి, మరో 13 మంది కూడా పోటీ చేశారు. కానీ ఇక్కడ 2,743 ఓట్లు నోటాకు పడ్డాయి. ఓటమి ఎరుగని నేతగా.. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నానని చెప్పుకునే దయాకర్ రావు నియోజకవర్గంలో ఇన్ని ఓట్లు నోటాకు పడ్డాయంటే మామూలు విషయం కాదు.
వరంగల్ పశ్చిమలో కూడా
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యేగా పని చేసిన దాస్యం వినయ్ భాస్కర్‌కు ఉద్యమకారుడిగా మంచిపేరే ఉంది. దీంతోనే 2009 నుంచి 2018 వరకు జరిగిన నాలుగు ఎలక్షన్లలో జనం ఆయనకు పట్టం కట్టారు. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి దాస్యం వినయ్ భాస్కర్, కాంగ్రెస్ నుంచి నాయిని రాజేందర్ రెడ్డి, బీజేపీ నుంచి రావు పద్మారెడ్డి పోటీ చేశారు. ఇందులో ఎవరి ప్రత్యేకత వారిదే అయినా నోటాకు 2,426 ఓట్లు పడటం గమనార్హం. వీటితో పాటు కొండా సురేఖ, నన్నపనేని నరేందర్, ఎర్రబెల్లి ప్రదీప్ రావు పోటీ చేసిన వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో 1,978 ఓట్లు, ములుగులో 1,937, మహబూబాబాద్ లో 1,932, జనగామలో 1,467, డోర్నకల్‌లో 1,392, స్టేషన్ ఘన్ పూర్ లో 1,153 ఓట్లు నోటాకు పడ్డాయి. పరకాలలో 966, భూపాలపల్లిలో 830, ఇక ఉమ్మడి జిల్లాలోనే అత్యధికంగా పోలింగ్ శాతం నమోదైన నర్సంపేటలో మాత్రం అత్యల్పంగా 738 ఓట్లు నోటాకు పడటం ఈ సందర్భంగా గమనార్హం.
(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)