తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Konda Surekha: కొండా సురేఖ ప్రచార రథం డ్రైవర్‌ పై సీఐ దాడి, ఉద్రిక్తత

Konda surekha: కొండా సురేఖ ప్రచార రథం డ్రైవర్‌ పై సీఐ దాడి, ఉద్రిక్తత

HT Telugu Desk HT Telugu

20 November 2023, 6:57 IST

google News
    • Konda surekha: వరంగల్ నగరంలో ఆదివారం రాత్రి ఉద్రిక్తత నెలకొంది. వరంగల్ తూర్పు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖకు సంబంధించిన ప్రచార రథం డ్రైవర్ పై మిల్స్ కాలనీ సీఐ సురేష్ దాడి చేశారు.
కొండా సురేఖ ప్రచార వాహనం డ్రైవర్‌పై దాడి చేస్తున్న సిఐ
కొండా సురేఖ ప్రచార వాహనం డ్రైవర్‌పై దాడి చేస్తున్న సిఐ

కొండా సురేఖ ప్రచార వాహనం డ్రైవర్‌పై దాడి చేస్తున్న సిఐ

Konda surekha: ఎన్నికల ప్రచారంలో ఉన్న కొండా సురేఖ ప్రచారం వాహనం డ్రైవర్‌పై పోలీసులు దాడి చేయడంతో వరంగల్‌లో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు నోటికి పని చెప్పి.. ఇష్టం వచ్చినట్టు తిట్టడంతో పాటు లాఠీలతో కొట్టారని ఆరోపిస్తున్నారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

ప్రత్యక్ష సాక్షులు తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. కొండా సురేఖకు సంబంధించిన ప్రచార రథం ఒకటి ఆదివారం సాయంత్రం వరంగల్ నగరంలోని శాకరాశికుంట, అండర్ బ్రిడ్జి ఏరియాలో ప్రచారం నిర్వహిస్తోంది. అదే మార్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఇల్లు ఉండగా.. ప్రచార రథం మెయిన్ రోడ్డు నుంచి వెళ్తోంది.

దీంతో ఇద్దరు బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ ప్రచార రథాన్ని అడ్డుకొని డ్రైవర్ తో వాదనకు దిగారు. వాహనం ఈ మార్గంలో రావద్దని, వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందిగా డ్రైవర్ తో గొడవపడ్డారు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం ఏర్పడగా.. కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

వెంటనే అక్కడకు చేరుకున్న మిల్స్ కాలనీ సీఐ ప్రచార రథం డ్రైవర్ పై సీరియస్ అయ్యారు. దీంతో భయపడిపోయిన డ్రైవర్ వాహనం లోపలే ఉండిపోగా.. బయటకు రావాలంటూ సీఐ ఆయనను గట్టిగా బెదిరించారు. భయపడుతూనే డ్రైవర్ బయటకు రాగా.. సీఐ ఆయనపై విరుచుకుపడ్డారు.

ఇష్టం వచ్చినట్టు బూతుపురాణం అందుకున్నారు. అనంతరం లాఠీ ఝుళిపించి ఆయన పై దాడి చేశారు. అక్కడ ఉన్నవాళ్ళందరినీ చెదరగొట్టి డ్రైవర్ తో పాటు ప్రచార రధాన్ని మిల్స్ కాలనీ స్టేషన్ కు తీసుకెళ్లారు. పోలీస్ దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు మీసాల ప్రకాష్, వేణుగోపాల్, ఇతర కార్యకర్తలు వెంటనే మిల్స్ కాలనీ స్టేషన్ కు చేరుకున్నారు. దీంతో కొద్దిసేపు అక్కడ గందరగోళం నెలకొంది.

బాధ్యులపై చర్యలు తీసుకుంటాం: ఏసీపీ

మిల్స్ కాలనీ స్టేషన్ వద్దకు కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరాగా అక్కడ గందరగోళ వాతావరణం ఏర్పడింది. దీంతో వరంగల్ ఏసీపీ బోనాల కిషన్ హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో మాట్లాడారు. ఘటనపై ఎంక్వయిరీ చేస్తామని, బాధితులపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఏసీపీ కాంగ్రెస్ నేతలకు నచ్చచెప్పారు. దీంతో కాంగ్రెస్ నేతలు శాంతించారు. కాగా సీఐ సురేష్ వ్యవహార శైలి ఇదివరకు కుడా వివాదాలకు దారి తీసిన సందర్భాలు ఉన్నాయి.

(హిందుస్థాన్ టైమ్స్, వరంగల్ ప్రతినిధి)

తదుపరి వ్యాసం