Kothagudem Politics : కొత్తగూడెంలో "జలగం" జగడం
23 November 2023, 19:11 IST
- Telangana Assembly Elections 2023 : కొత్తగూడెం బరిలో జలగం వెంకట్రావు గట్టి పోటీదారుడిగా మారారు. ఫలితంగా ప్రధాన పార్టీలకు ఇబ్బందికరంగా మారింది. జలగం ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తుండటంతో ఎవరి ఓట్లు చీలి ఎవరికి లబ్ధి చేకూరుతుందనేది ఆసక్తికరంగా మారింది.
కొత్తగూడెం బరిలో 'జలగం'
Kothagudem Assembly Constituency : కొత్తగూడెం నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన జలగం వెంకట్రావు ప్రధాన పార్టీల అభ్యర్థులకు గుబులు పుట్టిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో కొనసాగిన ఆయన టికెట్ ఆశించి భంగపడ్డారు. సిట్టింగ్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు అవకాశం దక్కడంతో వెంకట్రావు చివరి దశలో కాంగ్రెస్ పార్టీ లో టికెట్ కోసం ముమ్మర ప్రయత్నాలు చేశారు. సిపిఐతో పొత్తులో భాగంగా కొత్తగూడెం స్థానాన్ని సిపిఐకి కేటాయించడంతో కాంగ్రెస్ లోనూ జలగంకు చుక్కెదురైంది. దీంతో అనివార్య స్థితిలో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి నిలిచారు.
పంజా విసురుతున్న ‘సింహం’..
కొత్తగూడెం శాసనసభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు తనయుడు వెంకటరావుకు ఎన్నికల అధికారులు సింహం గుర్తు కేటాయించారు. జలగం పోటీతో తాజాగా ఆ స్థానంలో నెలకొన్న రాజకీయ పరిణామాలు ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో కలవరం పుట్టిస్తున్నాయి. బీఆర్ఎస్ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్, సిపిఐ పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా కూనంనేని సాంబశివరావు బరిలో నిలిచారు. తొలుత ఇద్దరి మధ్య ప్రధాన పోటీ నెలకొంటుందని అందరూ భావించగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగిన జలగం వెంకట్రావు వారిద్దరి గెలుపోటములను ప్రభావితం చేసే పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత బీఆర్ఎస్ పార్టీ తొలిసారి రాష్ట్రంలో పోటీ చేసినప్పుడు 2014 ఎన్నికల్లో జలగం వెంకట్రావు కొత్తగూడెం నియోజకవర్గం నుంచి గొలిపొందిన ఏకైక ఎమ్మెల్యేగా చరిత్రలో నిలిచారు. ఆ తర్వాత 2018 లో వెంకట్రావుపై గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు టీఆర్ఎస్ లో చేరడంతో జలగం వెంకట్రావు రాజకీయ అయోమయ పరిస్థితిల్లో పడ్డారు.
జలగంకు తెలుగుదేశం మద్దతు..
స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న జలగం వెంకట్రావుకు తెలుగుదేశం పార్టీ మద్దతుగా నిలిచింది. 2014 ఎన్నికల్లో గెలిచిన వెంకటరావు నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేశారని, ఈసారి ఎన్నికల్లోనూ ఆయన గెలిచి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారని టిడిపి నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పలు రకాల అభివృద్ధి కార్యక్రమాలను నెరవేర్చే హామీ మేరకే తాము జలగంకు ఈసారి మద్దతుగా నిలుస్తున్నామని ఆ పార్టీ నాయకులు స్పష్టం చేస్తున్నారు. జలగం పోటీ నేపథ్యంలో కొత్తగూడెం స్థానంలో త్రిముఖ పోటీ నెలకొంది. ఫలితంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు అవకాశాలపై నీలి నీడలు అలముకున్నాయి. గతంలో ఒక పర్యాయం వెంకట్రావు ఎమ్మెల్యేగా పని చేసిన అనుభవం ఉండడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులకు గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులైన వనమా వెంకటేశ్వరరావు కూనంనేని సాంబశివరావుల గెలుపోటములు తారుమారయ్యే ప్రమాదం కనిపిస్తోంది. ప్రధాన పార్టీల్లో ఏ పార్టీ ఓట్లను వెంకటరావు ఎక్కువగా చీలుస్తారన్న అంశంపై ఇప్పుడు కొత్తగూడెంలో రాజకీయ చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ తో పాటు గతంలో కాంగ్రెస్ లోనూ ఆయన పనిచేసిన అనుభవం కలిగి ఉండడంతో ఇరు పార్టీలకు ఆయన నష్టం కలిగించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఎవరు గట్టెక్కినా స్వల్ప ఆదిత్యంతోనే గెలుస్తారన్న అంచనాలు కనిపిస్తున్నాయి.