తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ts Elections : ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ- గజ్వేల్ లో 44 మంది, కామారెడ్డిలో 39 మంది పోటీ!

TS Elections : ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ- గజ్వేల్ లో 44 మంది, కామారెడ్డిలో 39 మంది పోటీ!

15 November 2023, 21:28 IST

google News
    • TS Elections : తెలంగాణలో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ నేటితో ముగిసింది. దీంతో రిటర్నింగ్ అధికారులు నియోజకవర్గాల వారీగా బరిలో నిలిచిన అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ 44 మంది, కామారెడ్డిలో 39 మంది బరిలో నిలిచారు.
తెలంగాణ ఎన్నికలు
తెలంగాణ ఎన్నికలు

తెలంగాణ ఎన్నికలు

TS Elections : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ ఉపసంహరణ బుధ‌వారంతో ముగిసింది. దీంతో ఎన్నిక‌ల బ‌రిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితా స్పష్టత వచ్చింది. ఈ మేర‌కు ఎన్నికల అధికారులు అభ్యర్థుల జాబితా విడుద‌ల చేశారు. సీఎం కేసీఆర్ పోటీ చేస్తోన్న గజ్వేల్‌, కామారెడ్డి నియోజకవర్గాల్లో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. గజ్వేల్‌ బరిలో 44 మంది అభ్యర్థులు ఉన్నారని రిటర్నింగ్‌ అధికారి ప్రకటించారు. నామినేషన్ల పరిశీలన తర్వాత 114 మంది బరిలో ఉండగా.. బుధవారం 70 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారని వెల్లడించారు. గజ్వేల్‌ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా సీఎం కేసీఆర్‌, బీజేపీ నుంచి ఈటల రాజేందర్‌, కాంగ్రెస్‌ నుంచి తూముకుంట నర్సారెడ్డి పోటీలో ఉన్నారు. జగిత్యాల జిల్లాకు చెందిన ముగ్గురు చెరకు రైతులు, ఇద్దరు భూనిర్వాసితులు గజ్వేల్ పోటీలో నిలిచారు.

కామారెడ్డి బరిలో 39 మంది అభ్యర్థులు

సీఎం కేసీఆర్‌ పోటీ చేస్తున్న మరో నియోజకవర్గం కామారెడ్డి. ఇక్కడ బుధవారం నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 39 మంది పోటీలో నిలిచారు. అభ్యర్థులు తుది జాబితాను రిటర్నింగ్‌ అధికారి ప్రకటించారు. నామినేషన్ల స్క్రూటినీ తర్వాత కామారెడ్డిలో 58 మంది పోటీలో ఉండగా.. 19 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారని తెలిపారు. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిగా సీఎం కేసీఆర్‌, కాంగ్రెస్‌ నుంచి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, బీజేపీ నుంచి కె.వెంకట రమణారెడ్డి పోటీలో నిలిచారు. సీఎం కేసీఆర్‌, రేవంత్‌రెడ్డి కామారెడ్డి నుంచి పోటీ చేస్తుండటంతో ఆసక్తి నెలకొంది. ఉమ్మడి మహబూబ్‌న‌గ‌ర్‌ జిల్లాలో మొత్తం 173 మంది పోటీలో మిగిలారు. కల్వకుర్తి నియోజకవర్గం నుంచి అత్యధికంగా 24 మంది పోటీ చేస్తన్నారు. గద్వాల నుంచి 20 మంది, నారాయణపేటలో ఏడుగురు ఎన్నికల బరిలో నిలిచారని రిటర్నింగ్ అధికారులు తెలిపారు.

జీహెచ్ఎంసీ పరిధిలో 312 మంది

తెలంగాణలో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన తరువాత గ్రేటర్ హైదరాబాద్ లోని 15 స్థానాల్లో బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. హైదరాబద్ లోని 15 నియోజకవర్గాల్లో మొత్తం 312 పోటీలో నిలిచారు. మొత్తం 20 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఈ మేరకు పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను రిటర్నింగ్ అధికారులు విడుదల చేశారు. రంగారెడ్డి జిల్లాలోని 6 స్థానాలకు అత్యధికంగా 173 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇబ్రహీంపట్నంలో 28 మంది, ఎల్బీ నగర్ లో 38 మంది, మహేశ్వరంలో 27 మంది, రాజేంద్రనగర్ లో 25 మంది, శేరిలింగంపల్లిలో 33 మంది, చేవెళ్ల లో 12 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

గ్రేటర్ లో 207 నామినేషన్లు తిరస్కరణ

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రిటర్నింగ్ అధికారులు ఏకంగా 207 నామినేషన్లను రిజెక్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లాలో 33, మేడ్చల్ లో 71 నామినేషన్లను అధికారులు రిజెక్ట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 608 నామినేషన్లను అధికారులు రిజెక్ట్ చేశారు. నాగార్జున సాగర్ లో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి, కోరుట్లలో ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, మిర్యాలగూడలో మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సతీమణి జామున నామినేషన్లను తిరస్కరించారు.

తదుపరి వ్యాసం