Ts Election Majority: తెలంగాణ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచింది ఆయనే..
04 December 2023, 9:20 IST
- Ts Election Majority: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ బిఆర్ఎస్ అభ్యర్థి కేపి వివేకానంద్ అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు.
కుత్బుల్లాపూర్‌లో వివేకానంద గెలుపు
Ts Election Majority: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ బిఆర్ఎస్ అభ్యర్థి కేపి వివేకానంద్ అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. సమీప బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ పై ఏకంగా 85 వేల 576 ఓట్ల మెజారిటీ సాధించారు.మొత్తంగా కేపి వివేకానంద్ కు 1, 87,999 ఓట్లు సాధించగా బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలంకు 1,02,423 ఓట్లు సాధించారు.ఇక కాంగ్రెస్ అభ్యర్థి కొలను హన్మంతు రెడ్డి 1,01,500 వందల ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు.
తెలంగాణలోనే అత్యధిక మెజారిటీ....
కుత్బుల్లాపూర్ నియోజికవర్గంలో మొత్తం 6,99,783 ఓటర్లు ఉండగా అందులో 4,01,667 ఓట్లు పోలయ్యాయి. కొన్ని నెలల క్రితం ఆ నియోజక వర్గంలో బిఆర్ఎస్ గెలుపు కష్టమనే అందరూ భావించారు. ఎమ్మెల్సీ శంభిపుర్ రాజు, గ్రేటర్ కార్పొరేటర్లు మరియు ఎమ్మెల్యే వివేకానంద్ మధ్య కొంత కాలంగా విభేదాలు ఏర్పడడంతో పార్టీకి డ్యామేజ్ జరుగుతుందని అనుకున్నారు. పార్టీ అధిష్ఠానం ఆదేశాలతో ఎమ్మెల్సీ,కార్పొరేటర్లు ఏకతాటిపైకి వచ్చి కేపి వివేకానంద్ గెలుపుకు కలిసి గట్టిగా కృషి చేశారు.
నిత్యం ప్రజల మధ్య ఉన్నందుకే....
భారీ మెజారిటీతో గెలవడానికి గల కారణాలను పరిశీలిస్తే కేపి వివేకానంద్ నియోజకవర్గంలో చేసిన మంచి పనులే అందుకు కారణం అంటున్నారు ప్రజలు. నిత్యం కుత్బుల్లాపూర్‌లో ప్రజలకు అందుబాటులో ఉంటూ,ఏ పార్టీ కార్యకర్త పని మీద తన దగ్గరకు వచ్చిన కాదనకుండా ఎమ్మెల్యే కేపి పని చేసే వారని చెబుతున్నారు.
సౌమ్యుడుగా ఉంటూ అన్నీ వర్గాలు, మతల ప్రజలకు భేదాభిప్రాయాలు లేకుండా ఎమ్మెల్యేగా తన పని తనన్ని ప్రదర్శించడం కేపి వివేకానంద్ కు కలిసి వచ్చిందని చెబుతున్నారు.ఇక బీజేపీ,కాంగ్రెస్ కు చెందిన కొందరు నేతలు తమ అభ్యర్ధుల పట్ల ఉన్న వ్యతిరేకతతో బిఅర్ఎస్ అభ్యర్థి కేపి వివేకానంద్ గెలుపుకు అంతర్గతంగా సహకరించారనే చర్చ జరుగుతుంది.
హరీష్ రావు మెజారిటీ క్రాస్ చేసిన వివేకానంద్
ఈ ఎన్నికలో సిద్దిపేట నుంచి మంత్రి హరీష్ రావు 82 వేల మెజారిటీ సాధిస్తే...కేపి వివేకానంద్ 85 వేల మెజారిటీ సాధించారు.మరోవైపు కుత్బుల్లాపూర్ మొట్ట మొదటి స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలిచి చరిత్ర సష్టించిన కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్‌ను వీడి బీజేపీ నుంచి పోటీ చేసినా ఆయనకు కలిసి రాలేదనే చెప్పాలి.
(కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్)