Gali Anil Resignation: కాంగ్రెస్ పార్టీకి గాలి అనిల్ రాజీనామా
16 November 2023, 13:21 IST
- Gali Anil Resignation: కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ షాక్ తగిలింది. టీపీసీసీ ఉపాధ్యక్షుడు, 2019 లోక్ సభ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ మెదక్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన గాలి అనిల్ కుమార్ పార్టీ ప్రాథమిక సబ్యత్యానికి రాజీనామా చేశారు.
గాలిఅనిల్‌తో బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే భేటీ
Gali Anil Resignation: కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన గాలి అనిల్ కుమార్ నర్సాపూర్‌లో నేడు జరుగనున్న బిఆర్ఎస్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సమక్షంలో అనిల్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.
అనిల్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో అసంతృప్తిగా ఉన్నట్లు తెలుసుకున్న మంత్రి హరీష్ రావు, అనిల్ కుమార్ ను తమ పార్టీలోకి ఆహ్వానించడానికి గురువారం ఉదయం అమీన్ పూర్‌లో ఉన్న అనిల్ కుమార్ నివాసానికి వెళ్లి, తమ పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్యానించాడు. మంత్రితో పాటు బీఆర్ఎస్ పఠాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కూడా అనిల్ కుమార్ ఇంటికి తరలి వెళ్ళాడు.
అనిల్ కుమార్ 2019 లో ఎంపీగా ఓడిపోయిన తర్వాత, నర్సాపూర్ ఎమ్మెల్యే సీటు ఆశిస్తూ అక్కడ పార్టీ బలోపేతానికి తీవ్ర కృషి చేశారు.అయితే తనకు టికెట్ వస్తుందనే క్రమంలో, పార్టీ నాయకత్వం ఆవుల రాజి రెడ్డిని పార్టీ అభ్యర్థిగా ప్రకటించడంతో అనిల్ కుమార్ తీవ్ర నిరుత్సాహానికి గురయ్యాడు.
రెబెల్‌గా నామినేషన్ వేసాడు. పార్టీ నాయకత్వం తనకు ఎంపీ సీటు ఇవ్వడానికి అనుకూలంగా ఉన్నదని, నామినేషన్ ఉపసంహరించుకోవాలి అని రాజి రెడ్డి కోరటంతో నామినేషన్ ఉపసంహరించుకున్నాడు. అయితే ఇప్పటివరకు అధిష్టానం నుండి తనకు ఎటువంటి పిలుపు రాకపోవడంతో, అలిగిన అనిల్ కుమార్ తో బిఆర్ఎస్ పార్టీ నాయకులు సంప్రదింపులు జరిపి తమ పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్యానించారు.
ఈ సందర్బంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ తాను పార్టీ కోసం చాల పని చేశానని పార్టీ నాయకత్వం టికెట్ ఇవ్వకుండా తనని మోసం చేసిందన్నారు. బీసీ కోటాలో తనకు సీటు వస్తుందని ఆశించానని ఆయన అన్నారు.కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో, కేంద్రంలో ఓడిపోయే దీనస్థితి లో ఉన్నప్పుడు తాను కాంగ్రెస్ జెండాను మోసానని అన్నారు.
ఈడీ కేసుల్ని కూడా ఎదుర్కొని, తాను పార్టీ బలపడటానికి కృషి చేశానని ఆయన తెలిపారు. అనిల్ కుమార్ రాజీనామాతో నర్సాపూర్, పఠాన్ చెరువు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని అభిప్రాయ పడుతున్నారు. ఇదే క్రమంలో, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఈ రెండు నియోజకవర్గాల్లో అనిల్ రాకతో లాభపడే అవకాశం ఉన్నదని బీఆర్ఎస్ పార్టీ నాయకులూ అంటున్నారు.