TS Election Counting: తెలంగాణలో తొలి ఫలితం వెలువడేది అక్కడే…!
03 December 2023, 6:42 IST
- TS Election Counting: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లో వెలువడనున్నాయి. రాష్ట్రంలో మొత్తం 119 నియోజక వర్గాలలో ఆదివారం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానున్నది. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కించనున్నారు.
ఓట్ల లెక్కింపు నేపథ్యంలో స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద భద్రత
TS Election Counting: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధమైంది. రాష్ట్రంలో మొత్తం 119 నియోజకవర్గాలకుగానూ ఆదివారం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానున్నది. ఓట్ల లెక్కింపుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఓట్ల లెక్కింపుకు 49 ప్రాంతాల్లో 119 కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,798 టేబుళ్లలో 2,417 రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
రాష్ట్రంలో అతి తక్కువ ఓటర్లు, తక్కువ పోలింగ్ కేంద్రాలున్న ఛార్మినార్, భద్రాచలం, అశ్వారావుపేట నియోజకవర్గాల ఫలితాలు మొదట వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట మధ్యలో తొలి ఫలితాలు వెలువడనున్నాయి. అత్యధిక పోలింగ్ కేంద్రాలు, ఓటర్లున్న శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల ఫలితం ఆలస్యం కానుంది. భద్రాచలంలో 13, అశ్వారావుపేటలో 14, చార్మినార్‌లో 15, ఆర్మూర్‌లో 16 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది.
రాష్ట్రంలోని 35,655 పోలింగ్ కేంద్రాలకు సంబంధిం చిన ఈవీఎంలలో నమోదైన ఓట్లను లెక్కించాల్సి ఉంది. భద్రాచలం, అశ్వారావుపేట, చార్మినార్ నియోజ కవర్గాల్లో లెక్కింపు రౌండ్లు తక్కువగా ఉండడంతో వీటిలో ఏదో ఒక స్థానం ఫలితం తొలుత వెలువడే అవకాశాలు ఉన్నాయి.
తెలంగాణలో చార్మినార్ నియోజక వర్గంలో తక్కువ పోలింగ్ నమోదు కావడంతో మిగిలిన రెండింటి కంటే దాని ఫలితమే మొదట వెలువడనుంది. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులతో పాటు కేంద్ర సర్వీసుల్లో ఉన్నవారు, దివ్యాంగులు, 80 సంవత్సరాలు దాటిన వయోవృద్ధులు సుమారు 2.20 లక్షల మంది వేసిన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుతో కౌంటింగ్ ప్రారం భమవుతుంది.
కేంద్ర సర్వీసులోని ఉద్యోగులు వేసిన ఓట్లు చాలా వరకు తపాలాశాఖ ద్వారా ఇప్పటికే ఆయా పోలింగ్ కేంద్రాలకు చేర్చారు. మిగిలిన ఓట్లు కూడా ఆయా నియోజకవర్గాల లెక్కింపు కేంద్రాల అధి కారులకు అందాయి. ఆదివారం ఉదయం 7.59 వరకు అందిన వాటిని మాత్రమే లెక్కించాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపు పూర్తైన తర్వాత ఉదయం 8.30 నుంచి ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు మొదల వుతుంది. పది గంటల నుంచి ఫలితాల సరళి వెలువడే అవకాశం ఉంది.
అక్కడ ఆలస్యమయ్యే అవకాశం
తెలంగాణలోని ఆరు నియోజకవర్గాల్లో ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో అక్కడి ఫలితాల వెల్లడికి అధిక సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్, మహే శ్వరం, ఎల్బీనగర్, మేడ్చల్ నియోజకవర్గాల్లో ఒక్కోచోట 500 నుంచి 600 వరకు పోలింగ్ కేంద్రాలు ఉండటంతో వాటిని లెక్కించడానికి ఆలస్యం కానుంది. అత్యధిక నియోజకవర్గాలకు 14 లెక్కింపు టేబుల్స్ చొప్పున ఏర్పాటు చేయగా ఈ ఆరు స్థానాల కోసం 28 టేబుల్స్ చొప్పున ఏర్పాటు చేశారు.
కుత్బుల్లాపూర్‌లో మొత్తం 6,99,130 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 3,99,752 మంది ఓటు వేశారు. అత్యధిక ఓట్లు పోలైన నియోజకవర్గం ఇదే. మేడ్చల్‌లో 6,37,839 మంది ఓట ర్లలో 3,96,752 మంది ఓటు వేశారు. శేరిలింగం పల్లి, రాజేంద్రనగర్, మహేశ్వరం నియోజకవర్గాల్లో మూడు లక్షలకు పైగా ఓట్లు లెక్కించాల్సి ఉంది.
అత్యధికంగా కరీంనగర్, ఇబ్రహీంపట్నం, యాకుతపుర నియోజకవర్గాల్లో 25 రౌండ్ల చొప్పున లెక్కించాల్సి వస్తుంది. అతి తక్కువగా భద్రాచలంలో 13, అశ్వరావుపేటలో 14, చార్మినార్లో 15 రౌండ్లలో లెక్కింపు పూర్తి కానుంది. భద్రాచలంలో 1,17,447, అశ్వారావుపేటలో 1,35,497 మంది ఓట్లు వేశారు. చార్మినార్ నియోజకవర్గంలో 94,830 మంది మాత్రమే ఓటుహక్కు వినియోగించుకు న్నారు. భద్రా చలం, అశ్వారావుపేటల కంటే చార్మినార్ ఫలితమే ముందుగా వెలువడుతుంది.
ప్రతి కౌంటింగ్ టేబుల్‌కు ప్రత్యేక సిబ్బంది..
ఓట్ల లెక్కింపులో ఒక్కో టేబుల్‌కు ఒక కౌంటింగ్ సూపర్‌వైజర్ , ఒక కౌంటింగ్ అసిస్టెంట్, కౌంటింగ్ సిబ్బంది, ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు. బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కోసం టేబుళ్ల వద్ద ఒక సహాయక రిటర్నింగ్ అధికారి, ఒక కౌంటింగ్ సూపర్‌వైజర్ , ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు (గెజిటెడ్ ఆఫీసర్, లేక ఆ సమాన హోదాగల అధికారి), ఒక మైక్రో అబ్జర్వర్ చొప్పున నియమించారు. గతానికి భిన్నంగా ఈసారి పోస్టల్ బ్యాలెట్ల కోసం ప్రత్యేక టేబుళ్లను ఏర్పాటు చేశారు.
500 ఓట్లకు ఒకటి చొప్పున మొత్తం 131 టేబుళ్లను ఏర్పాటుచేశారు. ఈవీఎంల కౌంటింగ్ పూర్తయ్యేలోగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తిచేయాలని నిర్ణయించారు. ఒకవేళ ఈవీఎంల ఓట్ల లెక్కింపు పూర్తయ్యేలోగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తికాకుంటే, చివరి రౌండ్ ఈవీఎంల లెక్కింపును నిలిపివేసి, పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపును పూర్తిచేయాలని, ఆ తర్వాతే చివరి రౌండ్ ఈవీఎంల లెక్కింపు చేపట్టాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.