Warangal MP Candidates: వరంగల్ ఎంపీ టికెట్లపై సస్పెన్స్..! అభ్యర్థుల ఎంపికపై మూడు పార్టీల కసరత్తు
27 March 2024, 11:42 IST
- Warangal MP Candidates: లోక్ సభ ఎన్నికలకు రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నాయి.
వరంగల్ ఎంపీ టిక్కెట్‌పై ప్రధాన పార్టీల కసరత్తు
Warangal MP Candidates: ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు ఉండగా.. మహబూబాబాద్ స్థానంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులను ఖరారు చేశాయి. బీజేపీ నుంచి మాజీ ఎంపీ సీతారాం నాయక్ ను బరిలో నిలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వరంగల్ ఎంపీ టికెట్ పై మాత్రం సస్పెన్స్ వీడటం లేదు. రాష్ట్రంలో ప్రధానమైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ.. ఈ మూడు పార్టీలు అభ్యర్థుల ఎంపికపై ఇంకా కసరత్తు చేస్తుండటంతో ఆశావహులు టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంపీ టికెట్ కోసం ఢిల్లీ, హైదరాబాద్ లోని తమ గాడ్ ఫాదర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
కాంగ్రెస్‌లో పోటాపోటీ
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకుంది. ఉమ్మడి వరంగల్ లోని 12 స్థానాల్లో 10 నియోజకవర్గాలను ఖాతాలో వేసుకుంది. దీంతో ఆ పార్టీ ఎంపీ టికెట్ కోసం పోటీ తీవ్రంగా పెరిగింది.
ఆ పార్టీ వరంగల్ టికెట్ కోసం ఇప్పటికే 42 మంది దరఖాస్తు చేసుకోగా.. మరికొందరు దరఖాస్తు చేసుకోని నేతలు కూడా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా వరంగల్ ఎంపీ టికెట్ ను పార్టీ సీనియర్ నేత దొమ్మాటి సాంబయ్యకు ఖరారు చేశారనే ప్రచారం జరిగింది.
కాంగ్రెస్ ఇటీవల రిలీజ్ చేసిన తొలి జాబితాలో సాంబయ్య పేరు లేకపోవటంతో టికెట్ ఎవరికి దక్కుతుందోననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాగా కాంగ్రెస్ టికెట్ కోసం దొమ్మాటి సాంబయ్యతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ ఘన్ పూర్ నుంచి పోటీ చేసి ఓటమి చవిచూసిన శనిగపురం ఇందిరా పేర్లు వినిపించాయి.
వీరితో పాటు పార్టీ సీనియర్ నేతలు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ, జేఎస్ పరంజ్యోతి, రామగళ్ల పరమేశ్వర్, సర్వే సత్యనారాయణ, అద్దంకి దయాకర్‌తో పాటు పోలీస్ అధికారి శోభన్ కుమార్, జర్నలిస్ట్ బీఆర్ లెనిన్, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ హరికోట్ల రవి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
ఈ మేరకు ఎవరికి వారు టికెట్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే సోనియాగాంధీ, మల్లికార్జునఖర్గేలను కలిసి టికెట్ కోసం తమ స్టైల్ లో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీంతో టికెట్ ఎవరికి వస్తుందనే ఉత్కంఠ కాంగ్రెస్‌లో కనిపిస్తోంది.
బీజేపీ టికెట్‌పై ఉత్కంఠ
ఎంపీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఇప్పటికే తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కవరంగల్ ఎంపీ అభ్యర్థిని మాత్రం ఖరారు చేయలేదు. బీఆర్‌ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ను బీజేపీలోకి చేర్చుకుని, ఆయననే అభ్యర్థిగా ప్రకటిస్తారనే ప్రచారం జరిగింది. ఆయన యూ టర్న్ తీసుకోవడంతో మాజీ డీజీపీ కృష్ణ ప్రసాద్ పేరు వినిపిస్తోంది. ఆయన పేరునూ ఇంతవరకు ప్రకటించలేదు.
దీంతో ఇంకొందరు ఆశావహులు టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, మాజీ ఎంపీ గుండు విజయరామారావు, చింతా సాంబమూర్తి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఒకట్రెండు రోజుల్లో బీజేపీ అభ్యర్థులను ఖరారు చేయనుండగా.. ఎవరివైపు మొగ్గు చూపుతుందో చూడాలి.
అరూరి రమేశా.. కడియం కావ్యనా..?
వరంగల్ సిట్టింగ్ ఎంపీగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన పసునూరి దయాకర్ ఉండగా.. ఆయన మరోసారి టికెట్ ఆశిస్తున్నారు. కానీ ఈసారి టికెట్ ఆయనకు దక్కడం డౌటేనని పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనతో పాటు స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన కూతురు కడియం కావ్యకు ఎంపీ టికెట్ ఇప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ మేరకు పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వద్ద తన ప్రతిపాదన పెట్టారు. టికెట్ కూడా కావ్యకే కేటాయించాలని ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే కొందరు ఉద్యమకారులు కూడా బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో మాజీ కార్పొరేటర్లు జోరిక రమేష్, బోడ డిన్నా ఇప్పటికే నియోజకవర్గాల్లో కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. దీంతో బీఆర్ఎస్ ఎంపీ టికెట్ ఎవరికి అనే దక్కుతుందోనని ఉత్కంఠ నెలకొంది.
అభ్యర్థుల కోసం సర్వేలు
ఎంపీ అభ్యర్థుల ఎంపికపై మూడు ప్రధాన పార్టీలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. ఈ మేరకు అభ్యర్థుల ఎంపికపై సర్వేలు చేస్తున్నాయి. కాంగ్రెస్ అధిష్ఠానం బలమైన అభ్యర్థి కోసం సర్వే చేయిస్తుండగా.. బీజేపీ కూడా అదే తీరుగా కసరత్తు చేస్తోంది.
ఇక బీఆర్‌ఎస్‌లో తమకే టికెట్ ఇవ్వాలని ఉద్యమకారులు పట్టుపడుతుండగా, మరో ఇద్దరు కీలక నేతలు కూడా టికెట్ ఆశిస్తున్నారు. దీంతో వరంగల్ టికెట్ ఏ పార్టీలో ఎవరికి దక్కుతుందో అనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులుగా ఎవరికి టికెట్ దక్కుతుందో చూడాలి.
(హిందుస్తాన్ టైమ్స్ వరంగల్ ప్రతినిధి)