Lok Sabha elections: 2024 లోక్ సభ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు?.. లోక్ నీతి-సీఎస్డీఎస్ సర్వే ఏం చెబుతోంది?
13 April 2024, 15:59 IST
భారత్ లో లోక్ సభ ఎన్నికల సమరం హోరాహోరీగా సాగుతోంది. తొలి దశ పోలింగ్ మరో వారం రోజుల్లో జరగనుంది. ఈ నేపథ్యంలో లోక్ నీతి-సీఎస్డీఎస్ సంస్థ దేశవ్యాప్తంగా ప్రి పోల్ సర్వే (Lokniti-CSDS Pre-Poll survey 2024) నిర్వహించింది. ఈ సర్వేలో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి.
ప్రతీకాత్మక చిత్రం
లోక్ నీతి-సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (CSDS) ఈ ప్రి పోల్ సర్వే నిర్వహించింది. ఓటర్లలో బీజేపీకి సానుకూలత వ్యక్తమవుతోందని, విపక్షాల కూటమి కంటే బీజేపీ 12 శాతం ఆధిక్యంలో ఉందని ఈ సర్వేలో తేలింది. పదిమందిలో కనీసం నలుగురు ఓటర్లు బీజేపీకి మద్దతిచ్చారని ఈ సర్వే (Lokniti-CSDS Pre-Poll survey 2024) తెలిపింది. 2024లో లోక్ నీతి-సీఎస్డీఎస్ (Lokniti-CSDS) 19 రాష్ట్రాల్లోని 10,019 మంది నుంచి ఈ సర్వే ద్వారా అభిప్రాయాలను సేకరించింది.
సర్వేలో వెల్లడైన 10 ముఖ్యమైన పాయింట్లు
1. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి కంటే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 12 శాతం ఆధిక్యంలో ఉంది. 2019 నాటి కన్నా కాంగ్రెస్ కూడా స్వల్పంగా బలపడే అవకాశం ఉంది. కానీ, అధికారంలోకి వచ్చేంతగా కాంగ్రెస్ బలపడకపోవచ్చు.
2. సర్వేలో పాల్గొన్న వారిలో సగానికి పైగా బీజేపీ పదేళ్ల ప్రభుత్వ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వానికి మరో అవకాశం ఇచ్చేందుకు సానుకూల ధోరణిని కనబరిచారు.
3. ప్రధాని నరేంద్ర మోదీ 'మోదీ గ్యారంటీ'కి ఓటర్లలో ఆదరణ లభిస్తోంది. ఇది రాహుల్ గాంధీ ఇస్తున్న హామీల కంటే ఆయనకు అడ్వాంటేజ్ ఇస్తోంది.
4. ఆధిక్యాన్ని కాపాడుకున్నప్పటికీ, 2019తో పోలిస్తే ప్రభుత్వ పనితీరుపై సంతృప్తి గణనీయంగా తగ్గింది. పట్టణ ప్రాంతాల ఓటర్లు బీజేపీకి మరో టర్మ్ ఇవ్వడానికి ఎక్కువగా ఆసక్తి చూపడం లేదు.
5. ప్రధాని మోదీ వ్యక్తిత్వం నిర్ణయాత్మక అంశంగా ఉంది. ఓటర్లలో చాలా మంది రాహుల్ గాంధీ కంటే ప్రధానిగా మోదీని ఇష్టపడతున్నారు.
6. అయోధ్యలో రామ మందిర నిర్మాణం మోదీ అత్యంత ప్రశంసనీయమైన పనిగా నిలుస్తుంది. ఇది ఓటర్లలో, ముఖ్యంగా ఎన్డిఏ మద్దతుదారులలో బలంగా ప్రతిధ్వనిస్తుంది.
7. పెరుగుతున్న ధరలు, పెరుగుతున్న నిరుద్యోగం మోదీ ప్రభుత్వ వైఫల్యాలలో ముఖ్యమైనవని ఓటర్లు భావిస్తున్నారు. ఇవి మోదీ ప్రజాదరణను, బీజేపీ మద్ధతును కొంతమేర దెబ్బతీస్తున్నాయి.
6. ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ, ఓటర్లు కేవలం ఆర్థిక వ్యవస్థ వైఫల్యాన్నే పరిగణనలోకి తీసుకోవడం లేదని సర్వేలో తేలింది. రాబోయే ఎన్నికలలో బీజేపీ తన ఆధిక్యాన్ని కొనసాగించే అవకాశం ఉంది.
8. ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో బీజేపీ పట్టు కొనసాగుతుంది. కానీ, కర్ణాటక ను మినహాయిస్తే, ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో మెరుగైన ఫలితాలు సాధించకపోవచ్చు.
10. బీజేపీ, కాంగ్రెస్ మధ్య ద్విముఖ పోటీ ఉన్న చోట బీజేపీకే ఎడ్జ్ కనిపిస్తోంది. బహుముఖ పోటీ ఉన్నచోట ఫలితాలు ఆసక్తికరంగా రావొచ్చు.
ఈ ఎన్నికలను ప్రభావితం చేసే ప్రధాన అంశాలు
1. ధరల పెరుగుదల, నిరుద్యోగం అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు ప్రతికూలంగా పరిణమించవచ్చు. ఈ సర్వే (Lokniti-CSDS Pre-Poll survey 2024) లో పాల్గొన్నవారిలో సగానికి పైగా ఓటర్లు ఈ అంశాలపై ఆందోళన వ్యక్తం చేశారు.
2. సర్వేలో పాల్గొన్నవారిలో 62 శాతం మంది ఉద్యోగ కల్పన ప్రధాన సవాలుగా భావిస్తున్నారు.
3. ముస్లింలు (67 శాతం), ఇతర వెనుకబడిన తరగతులకు చెందిన హిందువులు (63 శాతం), షెడ్యూల్డ్ తెగలు (59 శాతం), అగ్రకులాలు (57 శాతం) సహా వివిధ జనాభాలో ఉద్యోగాల కొరత సెంటిమెంట్ ఉంది.
4. ధరల పెరుగుదల అంశం ఓటర్లను భారీగా ప్రభావాన్ని చూపుతోందని ఈ సర్వే నొక్కి చెప్పింది. సర్వేలో పాల్గొన్న వారిలో 71 శాతం మంది, ముఖ్యంగా పేదలు, ముస్లింలు, ధరల పెరుగుదల ప్రధాన సమస్య అన్నారు.
5. గత అయిదేళ్లలో అవినీతి పెరిగిందని 55 శాతం మంది అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వంలో అవినీతి పెరిగిందని 25%, రాష్ట్ర ప్రభుత్వాల్లో అవినీతి పెరిగిందని 12% అభిప్రాయపడ్డారు.