తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Khammam Apo: ఎన్నికల విధుల్లో విషాదం, భద్రాద్రి జిల్లాలో ఏపీవో, హైదరాబాద్‌లో పీఓ కన్నుమూత

Khammam APO: ఎన్నికల విధుల్లో విషాదం, భద్రాద్రి జిల్లాలో ఏపీవో, హైదరాబాద్‌లో పీఓ కన్నుమూత

HT Telugu Desk HT Telugu

13 May 2024, 13:16 IST

google News
    •  Khammam APO: భద్రాద్రి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఎన్నికల విధుల్లో ఉన్న అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్ విధుల్లోనే గుండెపోటుతో మరణించాడు. హైదరాబాద్‌లో పోలింగ్ విధుల్లో ఉన్న మరో అధికారి గుండెపోటుతో మరణించాడు. 
ఖమ్మంలో గుండెపోటుతో మరణించిన ఏపీఓ
ఖమ్మంలో గుండెపోటుతో మరణించిన ఏపీఓ

ఖమ్మంలో గుండెపోటుతో మరణించిన ఏపీఓ

Khammam APO: భద్రాద్రి జిల్లాలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఏపీవో గుండె పోటుతో మరణించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఎన్నికల విధులకు హాజరైన ఉద్యోగి ఛాతీ నొప్పితో కుప్పకూలిపోయాడు. క్షణాల వ్యవధిలోనే అపస్మారక స్థితిలోకి చేరుకుని మృత్యువాత పడ్డాడు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండల పరిధిలోని నెహ్రూ నగర్ 165 పోలింగ్ బూత్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ బూత్ లో ఏపీవోగా విధులు నిర్వహిస్తున్న శ్రీ కృష్ణ అనే ఉద్యోగి హార్ట్ స్ట్రోక్ తో మృతి చెందడం దిగ్భ్రాంతిని కలిగించింది. కొత్తగూడెం పట్టణంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న శ్రీ కృష్ణను ఎన్నికల డ్యూటీ నిమిత్తం అశ్వారావుపేట మండలంలోని165 పోలింగ్ బూత్ లో ఏపీవోగా నియమించారు.

విధుల్లో భాగంగా ఆదివారం రాత్రి పోలింగ్ విధులు నిర్వర్తించాల్సిన ప్రాంతానికి చేరుకుని అక్కడే బస చేశారు. సోమవారం ఉదయం ఫ్రెష్ అయిన శ్రీ కృష్ణ ఎన్నికల విధులకు తెల్లవారుజామున హాజరయ్యారు. ఉదయం 7 గంటలకు విధులు నిర్వర్తిస్తున్న క్రమంలోనే ఛాతీ నొప్పితో ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.

ఆయనను హుటాహుటిన అశ్వారావుపేట సామాజిక ఆసుపత్రికి తరలించారు. సీపీఆర్ నిర్వహించి అనంతరం వైద్యం అందించినప్పటికీ శ్రీకృష్ణ మృతి చెందారు. ఎన్నికల విధుల్లో చోటుచేసుకున్న ఈ దిగ్భ్రాంతికర ఘటన అటు అధికారులను, ఇటు ప్రజలను విస్మయానికి గురిచేసింది. ఈ పరిణామంతో ఓటు వేయడానికి వచ్చిన ప్రజలు దిగ్భ్రాంతి చెందారు. వెంటనే అతని స్థానంలో మరో అధికారిని నియమించిన ఉన్నతాధికారులు పోలింగ్ కు అంతరాయం కలుగకుండా కొనసాగించారు.

హైదరాబాద్‌లో కన్నుమూసిన పీఓ

ఎన్నికల విధులు నిర్వర్తించేందుకు పోలింగ్‌బూత్‌కు వచ్చిన ఓ ప్రిసైడింగ్‌ అధికారి గుండెపోటుతో మృతి చెందారు. సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం నాంపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది.

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పహిల్వాన్‌పురానికి చెందిన బొడ్డుపల్లి నర్సింహ.. ముషీరాబాద్‌‌లోని మైనార్టీ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలలో ప్రిన్సిపల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆదివారం ద్విచక్రవాహనంపై స్నేహితుడితో కలిసి మాసబ్‌ట్యాంక్‌ జె.ఎన్‌.టి.యు. ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీలోని నాంపల్లి డీఆర్‌సీ కేంద్రానికి హాజరయ్యారు.

ఎండ వేడికి తాళలేక నర్సింహతో పాటు పలువురు సిబ్బంది తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. తమకు ఫ్యాన్లు, ఎయిర్‌కూలర్లు ఏర్పాటు చేయాలని అధికారులతో వాదనకు దిగారు. నర్సింహ తీవ్ర అసౌకర్యంతో బాధపడుతూ ఓ ఫ్యాన్‌ ముందు కూర్చొని తన విధులు పూర్తిచేశారు.

భోజనం అనంతరం పోలింగ్‌ సామగ్రి తీసుకొని తనకు కేటాయించిన నాంపల్లి రెడ్‌హిల్స్‌లోని జీహెచ్‌ఎంసీ సెంట్రల్‌ ఎమర్జెన్సీ స్క్వాడ్‌ కార్యాలయం పోలింగ్‌ బూత్‌ నంబరు 151కి చేరుకున్నారు. అక్కడ ఓ కుర్చీలో కూర్చున్న నర్సింహ కుప్పకూలిపోయారు. తోటి సిబ్బంది, పోలీసులు మాసబ్‌ట్యాంక్‌లోని మహావీర్‌ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే నర్సింహ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి.

తదుపరి వ్యాసం