తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Warangal Dayakar: పసునూరి దయాకర్ దారెటు, కాంగ్రెస్ టిక్కెట్ ఆశలు గల్లంతు..! డియం కావ్యకు ఇవ్వడంతో నిరాశ

Warangal Dayakar: పసునూరి దయాకర్ దారెటు, కాంగ్రెస్ టిక్కెట్ ఆశలు గల్లంతు..! డియం కావ్యకు ఇవ్వడంతో నిరాశ

HT Telugu Desk HT Telugu

03 April 2024, 5:57 IST

google News
    • Warangal Dayakar: కడియం శ్రీహరి వ్యవహారం ఓరుగల్లు రాజకీయాల్లో చాలామంది నేతలను గందరగోళంలో పడేసింది. కాంగ్రెస్​ పార్టీలో చేరిన మూడు రోజుల్లోనే కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యకు టికెట్​ దక్కడంతో  టికెట్​ పై ఆశలు పెట్టుకున్న ఎంతోమంది తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు.
పసునూరి దయాకర్‌ ఆశలు గల్లంతు
పసునూరి దయాకర్‌ ఆశలు గల్లంతు

పసునూరి దయాకర్‌ ఆశలు గల్లంతు

Warangal Dayakar: కడియం శ్రీహరి వ్యవహారం ఓరుగల్లు రాజకీయాల్లో చాలామంది నేతలను గందరగోళంలో పడేసింది. కాంగ్రెస్​ పార్టీలో చేరిన మూడు రోజుల్లోనే కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య Kadiyam Kavyaకు టికెట్​ దక్కగా.. టికెట్​ పై ఆశలు పెట్టుకున్న ఎంతోమంది తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. అందరికంటే ముఖ్యంగా వరంగల్ సిట్టింగ్​ ఎంపీ పసునూరి దయాకర్​  Pasunuri Dayakar పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

బీఆర్​ఎస్​ BRS లో టికెట్​ దక్కకపోవడంతో ఎంపీ టికెట్​ పై ఆశతో హస్తం  Congress పార్టీలోకి చేరిన ఆయనకు కడియం ఎంట్రీతో నిరాశే ఎదురైంది. దీంతో ఎంపీగా అవకాశం దక్కుతుందనుకున్న దయాకర్​ ఏం చేయాలో దిక్కుతోచక తలపట్టుకుంటున్నట్లు తెలిసింది.

హ్యాట్రిక్​ కోసం కాంగ్రెస్​ లోకి

వరంగల్ లోక్ సభ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్​ కాగా.. 2014, 2019 ఎన్నికల్లో రెండు పర్యాయాలు బీఆర్ఎస్ పార్టీ నుంచి పసునూరి దయాకర్ గెలిచారు. తెలంగాణ తల్లి విగ్రహ సృష్టి కర్తగా, ఉద్యమకారుడిగా ఆయనకు పేరుండగా.. తెలంగాణ ఏర్పడిన తరువాత 2015లో తొలిసారి జరిగిన ఎంపీ ఎన్నికల్లో పసునూరి దయాకర్ 6,15,403 ఓట్లు సాధించగా.. కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణ 1,56,315 ఓట్లకే పరిమితం అయ్యారు.

రెండోసారి 2019లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో దయాకర్ 6,12,498 ఓట్లు సాధించగా.. సమీప ప్రత్యర్థి దొమ్మాటి సాంబయ్యకు 2,62,200 ఓట్లు మాత్రమే వచ్చాయి. రెండు సార్లు భారీ మెజారిటీ అందుకున్న తిరుగులేని నేతగా పేరున్న దయాకర్ మూడోసారి కూడా బీఆర్​ఎస్​ నుంచి టికెట్​ ఆశించారు.

ఆ స్థానాన్ని బీఆర్ఎస్​ అధిష్ఠానం స్టేషన్​ ఘన్​ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యను అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో తీవ్ర నిరాశకు గురైన పసునూరి తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్​ వైపు అడుగులు వేశారు.  CM Revanth సమక్షంలో  జిల్లా మంత్రి కొండా సురేఖ, కాంగ్రెస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ మహేశ్​ కుమార్​ గౌడ్​ ఆధ్వర్యంలో హస్తం పార్టీలో చేరారు.

ఇంతవరకు బాగానే ఉండగా.. ఇంతకాలం తనకే టికెట్​ వస్తుందని భావించారు. హ్యాట్రిక్​ విజయం కూడా తనదేననే ధీమా ఉన్నారు. కానీ అనూహ్యంగా కడియం శ్రీహరి, తన కూతురు కావ్య బీఆర్​ఎస్​ అభ్యర్థిత్వాన్ని వదులుకుని కాంగ్రెస్​ పార్టీలో చేరడంతో సీన్​ మొత్తం రివర్స్​ అయ్యింది.

పార్టీలో చేరిన తెల్లారే కావ్యకు టికెట్​..

బీఆర్​ఎస్​ వరంగల్​ స్థానాన్ని కడియం కావ్యకు కేటాయిస్తున్నట్లు పార్టీ అధినేత కేసీఆర్​ మార్చి 13న ప్రకటించగా.. మార్చి 27 వరకు కడియం శ్రీహరి, కావ్య ఇద్దరూ జిల్లాలోని వివిధ నేతలను కలిసారు. ఆ తరువాత మార్చి 28న ఎవరూ ఊహించని విధంగా ట్విస్ట్​ ఇచ్చారు. తాను పోటీ నుంచి తప్పుకుంటున్నానని, అవినీతి, లిక్కర్​ స్కామ్​ తో బీఆర్​ఎస్ ప్రతిష్ట దిగజారిందంటూ కడియం కావ్య కేసీఆర్​కు లేఖ రాశారు.

ఆ రోజు నుంచే కాంగ్రెస్​ పార్టీ అగ్రనేతల టచ్​ లో ఉన్నప్పటికీ మార్చి 31న కడియం శ్రీహరి, కడియం కావ్య ఇద్దరూ కాంగ్రెస్​ కండువా కప్పుకుని, అధికారికంగా హస్తం పార్టీలో చేరారు. ఇదిలాఉంటే ఆమె మార్చి 31న పార్టీలో చేరగా.. ఏప్రిల్​ 1వ తేదీన కాంగ్రెస్ విడుదల చేసిన జాబితాలో వరంగల్​ స్థానాన్ని కడియం కావ్యకు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పార్టీలో చేరిన తెల్లారే ఆమెకు టికెట్​ దక్కినట్లయ్యింది.

దిక్కుతోచని స్థితిలో పసునూరి, ఇతర నేతలు

ఎంపీగా రెండు సార్లు విజయం సాధించిన పసునూరి దయాకర్​ కడియం కావ్యకు టికెట్​ కేటాయించడంతో గందరగోళంలో పడ్డారు. టికెట్​ తనదేననే ధీమాలో ఉండగా.. కడియం శ్రీహరి, కావ్య సడెన్​ ఎంట్రీ ఇచ్చి టికెట్​ దక్కించుకోవడంతో దిక్కుతోచని పరిస్థితిలో ఉండిపోయారు.

పసునూరితో పాటు కాంగ్రెస్​ ఎంపీ టికెట్​ కోసం దొమ్మటి సాంబయ్య, సింగాపురం ఇందిర, పెరుమాండ్ల రామకృష్ణ, జేఎస్​ పరంజ్యోతి, రామగళ్ల పరమేశ్వర్​, పులి అనిల్​ ఇలా చాలామంది పోటీ పడ్డారు. కానీ టికెట్​ మాత్రం పార్టీలో కొత్తగా చేరిన కడియం కావ్యకు ఇవ్వడం పట్ల వాళ్లంతా అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో కొందరు నేతలు అలకబూనగా.. పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్​ఛార్జ్​లు అసంతృప్త నేతలను బుజ్జగించే పనిలో పడ్డారు. కాగా కాంగ్రెస్​ తరఫున టికెట్​ దక్కకపోవడం, బీఆర్​ఎస్​ టికెట్​ ఇంకా ఎవరికీ ఖరారు కాకపోవడంతో కొందరు నేతలు అటువైపుగా కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. కడియం శ్రీహరి కాంగ్రెస్​ లోకి ఎంట్రీ ఒక్కసారిగా రాజకీయ వాతావరణం మారిపోగా.. అసంతృప్త నేతలు ఎటువైపు అడుగులు వేస్తారో చూడాలి.

(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

తదుపరి వ్యాసం