తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Khammam Brs Nama: ముఖం చాటేస్తున్న మాజీ మంత్రి.. ఖమ్మంలో ఏకాకిగా మారిన బిఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి నామా…

Khammam BRS Nama: ముఖం చాటేస్తున్న మాజీ మంత్రి.. ఖమ్మంలో ఏకాకిగా మారిన బిఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి నామా…

HT Telugu Desk HT Telugu

28 March 2024, 9:23 IST

google News
    • Khammam BRS Nama:  ఖమ్మంలో బీఆర్‌ఎస్ మాజీ మంత్రి ముఖం చాటేస్తుండటంతో ఎంపీ అభ్యర్ధి నామా నాగేశ్వరరావు ఏకాకిగా మారారు. 
ఖమ్మంలో  ఒంటరిగా మారిన బిఆర్ఎస్ అభ్యర్ధి నామా
ఖమ్మంలో ఒంటరిగా మారిన బిఆర్ఎస్ అభ్యర్ధి నామా

ఖమ్మంలో ఒంటరిగా మారిన బిఆర్ఎస్ అభ్యర్ధి నామా

Khammam BRS Nama: ఎన్నికల నగారా మోగడంతో పోలింగ్ నిర్వహణకు అధికార యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. వాస్తవానికి అధికారుల ఏర్పాట్ల కంటే వేగంగా రాజకీయ పార్టీలు ఈ ఎన్నికల యుద్ధంలో తలమునకలు కావాల్సి ఉంది. అయితే అధికారం కోల్పోయిన బీఆర్ఎస్  BRS పార్టీ మొన్నటి ఎన్నికల ఫలితాల దెబ్బ నుంచి ఇంకా కొలుకున్నట్లు కనిపించడం లేదు.

ఫలితంగా Khammamలో ఆ పార్టీ కేడర్ BRS Cadre ఇంకా నిస్తేజంలోనే కునరిల్లుతోంది. అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు కలకళలాడిన జిల్లా కేంద్రలోని పార్టీ కార్యాలయం తన మొఖం చూసే కార్యకర్తలు లేక వెలవెలబోతోంది. దీంతో పార్లమెంట్ ఎన్నికల సమరాంగానికి గులాబీ కేడర్ ఇంకా సిద్ధమవ్వనట్లే తేటతెల్లం అవుతోంది.

బిఆర్‌ఎస్‌ పార్టీ ఖమ్మం అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావును Nama nageswra rao ప్రకటించినా ఆయన శిబిరంలోనూ ఎన్నికల హడావుడి ఏమాత్రం కనిపించడం లేదు.

జిల్లాకు దూరంగా మాజీ మంత్రి..

అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొడతామన్న ధీమాతో దూసుకుపోయిన ఖమ్మం మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ Puvvada Ajay ను గత ఎన్నికల్లో ఓటమి పలకరించేసరికి తట్టుకోలేని స్థితిలోకి వెళ్లిపోయారు. దీంతో అధికారంలో ఉన్నప్పుడు వెంట తిరిగిన కీలక నాయకులకు సైతం ఆయన దూరంగా ఉంటున్నట్లు ఆ పార్టీ వర్గాలే చెప్పుకుంటున్నాయి.

దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఖమ్మం Khammam జిల్లా కేంద్రంలో గెలిచి మంత్రి అయిన తొలి అమాత్యునిగా రికార్డు సృష్టించిన అజయ్ మొన్నటి ఎన్నికల్లో మునుపెన్నడూ లేనివిధంగా 50 వేల పైచిలుకు ఓట్ల భారీ తేడాతో ఓటమి పాలైన అపఖ్యాతిని సైతం మూటగట్టుకున్నారు.

ఈ దుస్థితిలో ఆయన సొంత నియోజకవర్గానికి కూడా దూరంగానే కాలం గడుపుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్‌లో ఉంటూ చుట్టం చూపుగా మాత్రమే ఖమ్మం వస్తున్న పరిస్థితితో ఖమ్మంలో గులాబీ శ్రేణులు కకావికాలం అయ్యాయి.

దీంతో ఎన్నికల యుద్దానికి సిద్ధం చేసే సారధే లేకుండా పోయారు. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో విస్తరించి ఉంది. మాజీ మంత్రి ప్రాతినిధ్యం వహించిన ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, కార్యకర్తల దుస్థితి ఎంతటి అగమ్యగోచరంగా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.

నేతల నడుమ కనిపించని ఐక్యత..

మాజీ మంత్రి తాజా తీరు ప్రస్తుత ఎన్నికల యుద్ధంలో గులాబీ పార్టీకి నష్టం తెచ్చేలా కనిపిస్తుండగా పార్టీ అధికారంలో కొనసాగినప్పుడు సైతం నేతల మధ్య సఖ్యత కనిపించలేదు.

మంత్రిగా అజయ్.. ఎంపీలు, ఎమ్మెల్యేల స్వేచ్ఛను ఎప్పటికప్పుడు అదుపు చేసే ప్రయత్నమే చేశారన్న ప్రచారం జరిగింది. దీంతో ఎంపీగా ఉన్న నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న వద్దిరాజు రవిచంద్రలతో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు కూడా అజయ్ తీరుతో గతంలోనే ఇబ్బందులు పడినట్లు పార్టీ శ్రేణులు బహిరంగంగానే చర్చించుకున్నాయి.

ఇటీవల గులాబీ బాస్ నేతృత్వంలో హైదరాబాద్ లో జరిగిన ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సామావేశంలో ఎంపీ వద్దిరాజు రవి.. మాజీ మంత్రి తీరుపై చేసిన నర్మగర్భ వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల నేపధ్యంలో నేతల మధ్య సఖ్యత ప్రశ్నార్థకంగానే మారిపోయింది.

ఈ క్రమంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో మాజీ మంత్రి అజయ్ మనస్ఫూర్తిగా పని చేసే పరిస్థితి లేనేలేదని పార్టీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. నేతల మధ్య నెలకొన్న ఈ అగాధం ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా మరోసారి బరిలోకి దిగుతున్న నామ నాగేశ్వరరావుకు మింగుడుపడని స్థితిని తెచ్చిపెట్టింది.

పువ్వాడ తీరుతో ఈ ఎన్నికల్లో నామా ఒంటరిగా పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఓవైపు సొంత పార్టీలో కుంపట్లు ఇలా ఉంటే మరోవైపు జిల్లాలో బలమైన శక్తిగా ఎదిగిన కాంగ్రెస్ జోరు నామాకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి.

(రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఖమ్మం.)

తదుపరి వ్యాసం