తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Karimnagar Counting: కౌంటింగ్‌కు సర్వం సిద్దం.. ఉమ్మడి కరీంనగర్‌లో పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి

Karimnagar Counting: కౌంటింగ్‌కు సర్వం సిద్దం.. ఉమ్మడి కరీంనగర్‌లో పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి

HT Telugu Desk HT Telugu

03 June 2024, 13:27 IST

google News
    • Karimnagar Counting: పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు అధికారులు సర్వసన్నద్దమయ్యారు. జూన్ 4న పకడ్బందీగా కౌంటింగ్ నిర్వహించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
ఉమ్మడి కరీంనగర్‌లో కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి
ఉమ్మడి కరీంనగర్‌లో కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి

ఉమ్మడి కరీంనగర్‌లో కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి

Karimnagar Counting: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాల ఓట్ల లెక్కింపును మూడు ప్రాంతాల్లో నిర్వహిస్తారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపును కరీంనగర్ లోని ఎస్సాఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ఓట్లను రామగిరి మండలం సెంటనరీకాలనీలోని జేఎన్టీయు ఇంజనీరింగ్ కళాశాలలో నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్ల ఓట్లను మంచిర్యాలలోని కళాశాలలో మూడు అసెంబ్లీ సెగ్మెంట్ల ఓట్లను లెక్కిస్తారు. అందుకు అధికారులు ఏర్పాట్లన్ని పూర్తి చేశారు.

జూన్‌ 4న ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే కౌంటింగ్ కోసం ఇప్పటికే శిక్షణ పూర్తి చేసి మాక్ కౌంటింగ్ సైతం చేశారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ పమేలా సత్పతి కౌంటింగ్ పై అధికారులకు దిశానిర్దేశం చేశారు. కౌంటింగ్ కేంద్రం బయట సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు.

ఫలితాలు బయటకు తెలిసేలా బారీ ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి అయిదు వీవీప్యాట్ల నుంచి స్లిప్పులు లెక్కించనున్నారు. కౌంటింగ్ కేంద్రంలో ఇంటర్నెట్, విద్యుత్తు సప్లై అంతరాయం లేకుండా ఫలితాలను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో ప్రదర్శించేందుకు చర్యలు చేపడుతున్నారు.

కరీంనగర్ లో 116 టేబుళ్లు.. 153 రౌండ్లలో ఓట్ల లెక్కింపు

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపుకు కరీంనగర్ లోని ఎస్సాఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో ఏడు హాళ్ళలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల ఓట్ల లెక్కింపుకు ఏర్పాటు చేశారు. మొత్తం 116 టేబుళ్ళు, 153 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్దం చేశారు.

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 1797150 ఓటర్లు ఉండగా 1303690 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా ఓట్ల లెక్కింపు జరుగుతుండడంతో ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్ కు ఒక హాలు, ఆ హాల్ లో 14 టేబుళ్ళు ఏర్పాటు చేస్తున్నారు.

కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ లో 222296 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవడంతో కరీంనగర్ సెగ్మెంట్ ఓట్ల లెక్కింపుకు 18 టెబుళ్ళ ద్వారా 22 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి చేయనున్నారు. అదే విధంగా చొప్పదండి సెగ్మెంట్ లో 14 టేబుళ్ళు ద్వారా 24 రౌండ్లలో, మానకొండూర్ సెగ్మెంట్ లో 14 టేబుళ్ళ ద్వారా 23 రౌండ్లలో, హుస్నాబాద్, హుజురాబాద్ సెగ్మెంట్లలో 14 టేబుళ్ళ ద్వారా 22 రౌండ్లలో, సిరిసిల్ల సెగ్మెంట్ లో 14 టెబుళ్ళ ద్వారా 21 రౌండ్లలో, వేములవాడ సెగ్మెంట్ లో 14 టెబుళ్ళ ద్వారా 19 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి చేయనున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుకోసం అధనంగా మరో టెబుల్ ఏర్పాటు చేస్తున్నారు.

ఓటర్ల తీర్పు ఈవిఎంలో భద్రం

మే 13 జరిగిన పోలింగ్ తో ఓటర్ల తీర్పు నిక్షిప్తమైన ఈవిఎంను కట్టుదిట్టమైన భద్రత మద్య ఎస్సాఆర్ఆర్ డిగ్రీ కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచారు. కరీంనగర్ లో 28 మంది అభ్యర్థులు పోటీ చేయగా ప్రదానంగా బిజేపి కాంగ్రెస్ బిఆర్ఎస్ మద్యనే పోటీ నెలకొది. అభ్యర్థుల భవితవ్యం 4న మద్యాహ్నం వరకు తేలనుంది. ప్రతి సెగ్మెంట్ లో ఓట్ల లెక్కింపులో ఎన్నికల అధికారితోపాటు అభ్యర్థులు కూర్చునే విధంగా ఏర్పాట్లు చేశారు.

అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా రౌండ్ల వారీగా లెక్కింపు పూర్తయ్యాక వాటిని క్రోడికరించి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి ఫలితాన్ని ఒక రౌండ్ గా ప్రకటిస్తారు. మొత్తం 153 రౌండ్లు ఉన్నాయి. ఏడు సెగ్మెంట్ల ఫస్ట్ రౌండ్ పూర్తి అయిన తర్వాత ఏడింటివి కలిపి ఫస్ట్ రౌండ్ ఫలితం ప్రకటిస్తారు. అలా రౌండ్ ల వారిగా ఫలితాలు వెలువడుతాయి.

కౌంటింగ్ కు మూడెంచెల భద్రత

ఓట్ల లెక్కింపు సందర్బంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడెంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నారు. కౌంటింగ్ విధులు నిర్వహించే ఉద్యోగులు, సిబ్బంది, ఏజంట్లు ఉదయం 7 గంటల లోపే కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలని పోలీసులు సూచించారు. కౌంటింగ్ సందర్బంగా ఆరోజు కరీంనగర్ లో దారి మల్లింపు చర్యలు చేపడుతున్నట్లు సిపి అభిషేక్ మోహంతి తెలిపారు.

కౌంటింగ్ రోజున ఉదయం ఆరు గంటల నుంచి కౌంటింగ్ ముగిసే వరకు కోర్టు నుంచి ఆర్టీసి వర్క్ షాప్ వరకు ఆ దారిలో ఎలాంటి వాహనాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. జగిత్యాల నుంచి కరీంనగర్ కు వచ్చే వాహనాలు రేకుర్తి చౌరస్తా నుండి శాతవాహన యూనివర్సిటీ , పద్మనగర్ మీదుగా కరీంనగర్ లోకి చేరుకోవాలని సూచించారు. కరీంనగర్ నుండి జగిత్యాల కు వెళ్లాల్సిన వాహనాలు కోర్ట్ కాంప్లెక్స్ దాటగానే జ్యోతినగర్ , కెమిస్ట్రీ భవన్ , శాతవాహన యూనివర్సిటీ , రేకుర్తి చౌరస్తా నుంచి జగిత్యాల రోడ్ వైపు వెళ్ళవలసిందిగా ఆదేశించారు.

ఓట్ల లెక్కింపు సందర్బంగా కమీషనరేట్ వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. కౌంటింగ్ సందర్బంగా ఎలాంటి అవాంయనీయ సంఘటనలు తావు లేకుండా మంగళవారం ఉదయం 6 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6గంటల వరకు నిషేదాజ్ఞలు అమల్లో ఉంటాయని సిపి స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంగించే వారిపై చట్టప్రకారం చర్యలు చేపడుతామని హెచ్చరించారు.

(రిపోర్టింగ్ కేవీ.రెడ్డి, హెచ్‌టి తెలుగు, ఉమ్మడి కరీంనగర్)

తదుపరి వ్యాసం